nasa scientists
-
సునీతా విలియమ్స్‌ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్‌లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్‌లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్‌గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
వోయేజర్–1 పునరుత్థానం!
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవ సృష్టి ఉల్కాపాతం
ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్)గా డైమార్ఫోస్ ఉల్కపాతం రికార్డుకెక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్–అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు(డార్ట్) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్) ఎంచుకున్నారు. నిజానికి ఈ అస్టరాయిడ్తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్’లో భాగంగా 2021 నవంబర్ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెపె్టంబర్ 26న భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్ ప్రయోగం దోహదపడింది. 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి: నాసా స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నా రు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు. డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలన్కు చెందిన డీప్–స్పేస్ అస్ట్రోడైనమిక్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ పోస్టు డాక్టోరల్ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కచి్చతంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది. -
Giant Magellan Telescope: పేద్ద టెలిస్కోప్
ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి జీవులమేనా? లేక ఇతర గ్రహాల్లోనో, లేదంటే విశ్వాంతరాల్లో సుదూరాల్లోనో మరెక్కడైనా జీవముందా? ఉంటే వాళ్లు మనలాంటి ప్రాణులేనా? మనిషిని ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాలకు మరోసారి తెర లేచింది. ఇందుకోసం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..! ఏమిటీ జీఏంటీ? విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన ఈ టెలీస్కోప్ నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది... జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ) ► దీని ఉపరితలం వైశాల్యమే ఏకంగా 368 చదరపు మీటర్లు! ► జీఏంటీకు ఏడు అతి పెద్ద పట్టకాల సమూహాన్ని బిగిస్తున్నారు. వీటి పొడవు 24.5 మీటర్లు. ► వీటిలో కీలకమైన చివరి, ఏడో ప్రాథమిక పట్టకం పాలిషింగ్ పని చివర్లో ఉందిప్పుడు. జీవం ఉనికిని గుర్తించడంలో కీలకం... సుదూరాల్లోని గ్రహాలు, శకలాలు తదితర గోళాల్లో ఉపరితలాలను ముందెన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించేందుకు జీఏంటీ తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమి మాదిరిగానే వాటిమీద పర్వతమయ ప్రాంతాలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తద్వారా వాటిమీద జీవం ఉనికి తాలూకు జాడ కూడా చిక్కుతుంది‘ అని వారు అంటున్నారు. 20 టన్నుల ఆప్టికల్ గ్లాస్! ► జీఏంటీ తాలూకు పట్టకాల తయారీ పని అరిజోనా యూనివర్సిటీలోని రిచర్డ్ ఎఫ్.కారిస్ మిర్రర్ ల్యాబ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ► ఇందుకోసం ఏకంగా 20 టన్నుల అత్యంత శుద్ధమైన ఆప్టికల్ గ్లాస్‌ను వాడుతున్నారు. ► దాన్ని 1,185 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నారు. ► ఈ గ్లాస్ కరిగిన కొద్దీ బయటి కొసవైపు కుంభాకారపు పట్టకంగా రూపుదాలుస్తుంది. ► తర్వాత దాన్ని 3 నెలల పాటు చల్లబరుస్తారు. ► అనంతరం పాలిíÙంగ్ చేస్తారు. ► చివరగా ఏడు అద్దాలనూ కలగలిపి ఒకే పెద్ద పట్టకంగా బిగిస్తారు. ► అప్పుడిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెలీస్కోప్లన్నింటి కంటే జీఏంటీ కనీసం 4 రెట్లు హెచ్చు రిజల్యూషన్, 200 రెట్లు అధిక సున్నితత్వంతో పనిచేసే టెలిస్కోప్‌గా మారుతుంది. ► జేమ్స్వెబ్తో సహా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఏ టెలీస్కోప్‌కూ ఇంత పెద్ద పట్టకం లేదు. అయితే ఇన్ ఫ్రారెడ్ కాంతిలో విశ్వాన్ని పరిశీలించే శక్తి ఇప్పుడు తయారవుతున్న జీఏంటీతో సహా ఏ టెలీస్కోప్‌కూ లేదు. ఆ సామర్థ్యం ఇప్పటిదాకా జేమ్స్ వెబ్ కు మాత్రమే సొంతం. ► జీఏంటీ పొడవు 39 మీటర్లు. దీని తయారీకి 2,100 టన్నుల స్టీలు వాడుతున్నారు! కొసమెరుపు: ఈ జీఏంటీ టెలీస్కోప్ పూర్తిగా తయారై అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరేళ్లన్నా పట్టొచ్చట. అంటే, దశాబ్దాంతం దాకా వేచి చూడాల్సిందే! నేషనల్ డెస్క్, సాక్షి -
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!
నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు! సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది! కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది! అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది! సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!! సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకింతోష్ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. కారణాలు మిస్టరీయే! సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు. తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్ సైకిల్లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్ సైకిల్ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్య వయస్సులోకి ఆదిత్యుడు... సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట. ఏమిటీ సోలార్ సైకిల్? సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్ సైకిల్. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్ స్పాట్స్) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్‌స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!
వాషింగ్టన్: దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్హెచ్ఎస్ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడుతున్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్ చొప్పున వేసేస్తోందట! పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్హెచ్ఎస్ 475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది. -
భూమ్మీద పడనున్న నాసా పాత ఉపగ్రహం
కేప్ కెనావెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ ఉపగ్రహం సేవా కాలం ముగిసిపోయింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ది ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడిపోనుంది. 1984లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని సేవలు నిలిచిపోయాయి. -
అపూర్వ విజయమది
భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదమున్న గ్రహశకలాలను అంతరిక్షంలోనే ఢీకొట్టి దారి మళ్లించడం ద్వారా మనకు ముప్పు తప్పించే లక్ష్యంతో సెప్టెంబర్‌లో నాసా చేపట్టిన చరిత్రాత్మక డార్ట్ (డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్టన్) ప్రయోగం దిగ్విజయం కావడం తెలిసిందే. ఇందులో భాగంగా భూమికి ఏకంగా 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో డిడిమోస్ అనే పెద్ద గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తున్న డైమోర్ఫస్ అనే బుల్లి శకలాన్ని 570 కిలోల బరువున్న డార్ట్ ఉపగ్రహం గంటకు ఏకంగా 22,500 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ఆ ప్రయోగ ఫలితాలపై పలు కోణాల్లో అధ్యయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కీలక విషయాలు తాజాగా వెలుగు చూశాయి. ప్రయోగం ద్వారా డైమోర్ఫస్ కక్ష్యను మార్చడం సైంటిస్టుల ప్రధాన లక్ష్యం. అది వారు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా నెరవేరిందని తాజాగా తేలింది. డిడిమోస్ చుట్టూ దాని పరిభ్రమణ కాలం ఏకంగా 32 నిమిషాల మేరకు తగ్గిందని వెల్లడైంది. ‘‘అందుకే డార్ట్ ప్రయోగం మామూలు విజయం కాదు. ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఫలితమిచ్చింది’’ అని నాసా సైంటిస్టులు సంబరంగా చెబుతున్నారు. అంతేకాదు, డార్ట్ ఢీకొన్నప్పుడు దాని ఊహాతీత వేగపు ధాటికి డైమోర్ఫస్ నుంచి కనీసం 10 లక్షల కిలోల బరువైన ఉపరితల పదార్థాలు ముక్కచెక్కలుగా అంతరిక్షంలో దూసుకెళ్లాయట. అంతరిక్షంలో ఇలా ఒక వస్తువు ఢీకొనే వేగం వల్ల రెండో వస్తువుపై పడే ఒత్తిడిని ద్రవ్యవేగపు మార్పిడిగా పేర్కొంటారు. ‘‘డార్ట్ ప్రయోగం వల్ల జరిగిన ద్రవ్యవేగపు మార్పిడిని ‘బెటా’గా పిలుస్తాం. అర టన్ను బరువున్న ఏ వస్తువైనా గ్రహశకలం ఆకర్షణ శక్తికి లోబడి దానికేసి దూసుకెళ్తే జరిగే దానికంటే డార్ట్ ప్రయోగం వల్ల 3.6 రెట్లు ఎక్కువగా ద్రవ్యవేగపు మార్పిడి జరిగింది. డార్ట్ ప్రయాణించిన గంటకు 22,500 కిలోమీటర్ల వేగమే ఇందుకు కారణం’’ అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్‌కు చెందిన డార్ట్ మిషన్ సైంటిస్టు డాక్టర్ ఆండీ చెంగ్ వివరించారు. ‘‘ఈ ద్రవ్యవేగపు మార్పిడి ఎంత ఎక్కువగా ఉంటే గ్రహశకలాన్ని అంతగా దారి మళ్లించడం వీలవుతుంది. భూమిని నిజంగానే గ్రహశకలాల బారినుంచి కాపాడాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఇది చాలా కీలకంగా మారగలదు. డార్ట్ ప్రయోగం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిన అతి కీలక సమాచారమిది’’ అని ఆయన చెప్పారు. ‘‘అందుకే డార్ట్ ప్రయోగాన్ని ఊహకు కూడా అందనంతటి గొప్ప విజయంగా చెప్పాలి. దీనివల్ల గ్రహ శకలాల ముప్పును తప్పించేంత సామర్థ్యం మనకు ఇప్పటికిప్పుడే సమకూరిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ దిశగా మనం వేసిన అతి పెద్ద ముందడుగుగా మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు’’ అని నాసా డార్ట్ ప్రోగ్రాంలో కీలకంగా పని చేసిన సైంటిస్టు డాక్టర్ టామ్ స్టాట్లర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనిపై స్పందించారు. 2022లో నాసా సాధించిన మూడు ఘన విజయా ల్లో డార్ట్ ప్రయోగం ఒకటంటూ ప్రశంసించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
సుదూర తార చిక్కిన వేళ...
ఫొటోలో బాణం గుర్తు ఎదురుగా మిణుకుమిణుకుమంటూన్న చిన్న వెలుగు కన్పిస్తోందా? లేదా? అయితే ఇన్సెట్లో చూడండి. కంటికి కొద్దిగా ఆనుతోంది కదా! అదేమిటో తెలుసా? మనకు తెలిసిన విశ్వమంతటిలోనూ అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రం. పేరు ఎరెండల్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా దీన్ని క్లిక్‌మనిపించింది. ఇది సన్‌రైజ్ ఆర్క్ అనే గెలాక్సీలో ఉందట. ఇంతకూ ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో ఉందో తెలుసా? ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో! ఇంతటి దూరాల్లో సాధారణంగా పాలపుంతలు మాత్రమే కన్పిస్తాయి. అలా చూస్తే ఈ సుదూర తార మనకు కన్పించడం యాదృచ్చికంగా కలిసొచ్చిన అదృష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఇది ముందుగా హబుల్ టెలిస్కోప్‌కు కన్పించిందట. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకుని ఆశ్చర్యానందాలకు లోనయ్యారట. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పట్టిందట! ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్ రూపం బిగ్‌బ్యాంగ్ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఎరెండెల్ అంటే వేకువ తార అని అర్థం. మనకు కన్పిస్తున్న ఎరెండెల్ రూపం విశ్వపు తొలి నాళ్లకు చెందినది గనుక ఈ పేరు సరిగ్గా నప్పిందంటూ సంబరపడుతున్నారు. -
అంతరిక్షంలో అంతుచిక్కని సునామీ..
వాషింగ్టన్: అంతరిక్షంలో అంతుచిక్కని సునామీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సునామీలు బ్లాక్‌హోల్స్ వల్ల సంభవిస్తున్నాయని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ స్టిమ్యులేషన్ ఆధారంగా ఈ సునామీలను గుర్తించినట్లు వారు వెల్లడించారు. బ్లాక్‌హోల్స్ గురుత్వాకర్షణ నుంచి వాయువులు తప్పించుకోవడం, రేడియేషన్ వల్ల భారీ స్థాయిలో సునామీ ఏర్పడుతుందని తేల్చారు. ఇది దాదాపు పది కాంతి సంవత్సరాల వరకూ విస్తరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో చాలా బ్లాక్‌హోల్స్ ఇలాంటి సునామీలను సృష్టిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. -
నేడు ఆకాశంలో క్రిస్మస్ స్టార్
వాషింగ్టన్: నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి. ఇలా రెండు గ్రహాలు చలికాలంలో ఓ చోట చేరితే దాన్ని ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘క్రిస్మస్ స్టార్ ఆఫ్ 2020’ అని పేరు పెట్టారు. ఇలాంటి ఘటనను మళ్లీ చూడాలంటే మరో 60 సంవత్సరాలు ఆగాలని, 2080లో మళ్లీ కనిపిస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న 13 సంవత్సరాల తర్వాత, 1623లో జూపిటర్ చుట్టూ నాలుగు నక్షత్రాలను గుర్తించారు. వాటిని అప్పట్లో జూపిటర్ చందమామలుగానూ, శాటర్న్ వృత్తంగానూ గుర్తించారు. నాసా పేర్కొంది. ఇలాంటి ఓ ఘటన జరగడం గత 400 ఏళ్లలో ఇదే మొదటి సారి అని తెలిపారు. డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున ఉత్తరార్థగోళంలో పగలు అత్యంత తక్కువగానూ, దక్షిణార్థగోళంలో పగలు అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండనుంది. -
అరుణగ్రహంపై జీవం కోసం...
పాసడీనా (అమెరికా): వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్) ద్వారా నాసా ఆ గ్రహంపై ఇప్పటివరకు ఏమైనా జీవం ఉందా అన్న అంశాన్ని పరిశోధించనుంది. అంతేకాదు భవిష్యత్తులో మానవుని మనుగడ సాధ్యమవుతుందా అనేది కూడా తెలుసుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణగ్రహంపైకి పంపనున్న అంతరిక్ష నౌకను శుక్రవారం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఈ నౌకను శాస్త్రవేత్తలు రూపొందించారు. గత వారమే ఈ నౌకను విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఈ నౌక 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహంపై ల్యాండ్ కానుంది. ఈ రోవర్‌పై 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలను విశ్లేషించేందుకు లేజర్లను వాడినట్లు డిప్యూటీ మిషన్ లీడర్ మట్ వాలేస్ తెలిపారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలను అమర్చారు. ఈ రోవర్ దాదాపు కారు పరిమాణంలో ఉంటుంది. అక్కడి ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని తూర్పారా పట్టే పనిని రోవర్‌కు అప్పగించారు. దీనికి చేతులు, నేలను తవ్వేందుకు డ్రిల్ అమర్చారు. ఒకప్పుడు అరుణగ్రహంపై వెచ్చటి ఉపరితల జలం, చిక్కటి వాతావరణం, దీని చుట్టూ అయస్కాంత శక్తి ఉండేదని వివరించారు. దీన్ని బట్టి ఏకకణ జీవం ఉండేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రోవర్ దిగే స్థలంపై పరిశోధన చేశాక ఎంపికచేశారు. ఈ స్థలంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని తెలిపారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు. అరుణ గ్రహంపై పరిశోధనలు చేయనున్న రోవర్ ఇదే -
సౌర వ్యవస్థ ఆవల మరో గ్రహం
బోస్టన్: మన సౌర వ్యవస్థ ఆవల మరో కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రహం మనకు సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల కోసం అన్వేషణ సాగిస్తున్న టెస్ (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) సాయంతో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ శాటిలైట్ లాంచ్ చేయగా.. ఇప్పటివరకు మన సౌర వ్యవస్థ ఆవల 3 గ్రహాలను కనుగొంది. తాజా గ్రహం పేరు హెచ్డీ 21749బీ కాగా.. పై మెన్సె బీ, ఎల్హెచ్ఎస్ 3844బీ ఇంతకుముందు కనుగొన్న మరో 2 గ్రహాలు. ఈ 3 గ్రహాల్లోకెల్లా ప్రస్తుత గ్రహమే అధిక కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఈ గ్రహం మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 36 రోజుల సమయం తీసుకుంటుంది. సూపర్ ఎర్త్‌గా భావించే ‘పై మెన్సె’గ్రహం తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 6.3 రోజుల సమయం తీసుకుంటుండగా.. ఎల్హెచ్ఎస్ 3844బీ తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 11 గంటల సమయమే తీసుకుంటుంది. తాజా గ్రహంపై ఉష్ణోగ్రత 300 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉన్నట్లు తెలిపారు. ప్రకాశవంతమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల్లోకెల్లా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఇదేనని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ డయానా చెప్పారు. భూమి కంటే ఈ గ్రహం సైజు 3 రెట్లు ఎక్కువ కాగా.. బరువులో 23 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఈ గ్రహం నివాసయోగ్యమైనది కాకపోవచ్చని అన్నారు. మరో గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లనూ పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ దీన్నీ ధ్రువీకరించినట్లయితే టెస్ కనుగొన్న భూమి ఆకారంలో ఉన్న మొదటి గ్రహం ఇదే కానుంది. -
రెడ్ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే
వాషింగ్టన్: న్యూహారిజన్స్ అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను గురువారం నాసాకు పంపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్ ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా జనవరి 1న అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ను పంపిన సంగతి తెలిసిందే. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు. న్యూహారిజన్స్ అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్ హాఫ్కిన్స్ వర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) ట్వీట్ చేసింది. తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీ. సమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది. రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. -
మామ.. ‘మంచు’మామ!
వాషింగ్టన్: అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు(మంచు) ఉన్నట్లు నాసా వెల్లడించింది. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు. కానీ ప్రస్తుతం కనుగొన్న ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు ఆవాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని చెబుతున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద లూనార్ క్రేటర్స్ (ఉల్కాపాతం వల్ల ఏర్పడిన గుంత లాంటి ప్రదేశం)లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉండగా.. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్–1 అంతరిక్ష నౌకలో మూన్ మినరాలజీ మ్యాపర్( M3) అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది. -
వందకు పైగా కొత్త గ్రహాలు!
లాస్ఏంజెలెస్: మన సౌర కుటుంబానికి వెలుపల వందకు పైగా గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటి ఉపగ్రహాలపై జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ గ్రహాలన్నీ వాయు గ్రహాలైనప్పటికీ వాటి ఉపగ్రహాలపై మాత్రం భూమి మాదిరిగా నేలలు ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2009లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఇప్పటికే మన సౌర వ్యవస్థకు వెలుపల వేలాది గ్రహాలను కనుగొన్న విషయం తెలిసిందే. -
ఒంటరి నక్షత్రం..
వాషింగ్టన్: మన పాలపుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను మన పాలపుంతలో పదికిపైనే కనుగొన్నా.. పాలపుంతకు ఆవల కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. సాధారణంగా న్యూట్రాన్ స్టార్ల లాంటి నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాల అంతర్భాగంలో ఉంటాయి. అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు అంతరించిపోయి సూపర్నోవాగా అవతరిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
చంద్రుడి ఉపరితలంపై నీరు..!
వాషింగ్టన్: చందమామపై అధిక మొత్తంలో నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో అంచనావేశారు. ఈ నీరు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా చంద్రుడి ఉపరితలమంతా విస్తరించి ఉందని చెబుతున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయం చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు అక్కడి నీటిని ఒక వనరుగా వాడుకునేందుకు చేయాల్సిన పరిశోధనలకు సహకరిస్తాయని అమెరికాలోని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ జోషువా బాండ్ఫీల్డ్ వివరించారు.