
పాలపుంతలో ఏం జరుగుతోంది?
మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలోని ధనూరాశి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద కృష్ణబిలం(బ్లాక్‌హోల్) నుంచి ఇంతకుముందెన్నడూ చూడనంతటి స్థాయిలో భారీ ఎక్స్-రే విస్ఫోటం వెలువడిందట. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా నాసా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కొన్నేళ్లుగా మామూలుగా ఉన్న ఎక్స్-రే ప్రకాశం ఒక్కసారిగా భారీ జ్వాలలా మారడం అనేది ఈ కృష్ణబిలం ప్రవర్తన, పరిసరాలపై కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తోందని చెబుతున్నారు.
మన సూర్యుడి కన్నా 45 లక్షల రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్‌హోల్ తన సమీపంలోని ఓ ధూళిమేఘాన్ని మింగేసేటప్పుడు ఎంత వెలుతురు వెలువడుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టగా.. ఆ ప్రక్రియతో వెలుతురు వెలువడకపోగా ఇలా అనూహ్యంగా అప్పటికే ఉన్న ఎక్స్-రే ప్రకాశం 400 రెట్లు అధికంగా వెలిగిపోయిందట. ధూళి మేఘాలు కాకుండా ఏదైనా పెద్ద గ్రహశకలం బ్లాక్‌హోల్‌ను సమీపించడంతో ఇలాంటి విస్ఫోటం జరిగి ఉంటుందని కొందరు.. బ్లాక్‌హోల్‌లోకి వెళుతున్న వాయువులు కలగాపులగమై దిశలను మార్చుకోవడం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.