నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..! | Strange unprecedented vortex spotted around the sun north pole | Sakshi
Sakshi News home page

నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!

Published Sun, Feb 12 2023 2:05 AM | Last Updated on Sun, Feb 12 2023 9:05 AM

Strange unprecedented vortex spotted around the sun north pole - Sakshi

నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు!
సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా
ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది!
కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది!
అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది!
సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!!

సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్‌ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి.

ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫరిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ స్కాట్‌ మాకింతోష్‌ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు.

కారణాలు మిస్టరీయే!
సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు.

తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్‌ సైకిల్‌ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్‌ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మధ్య వయస్సులోకి ఆదిత్యుడు...
సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట.

ఏమిటీ సోలార్‌ సైకిల్‌?
సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్‌ సైకిల్‌. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్‌ స్పాట్స్‌) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది.

సన్‌స్పాట్స్‌ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్‌ సైకిల్‌ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్‌ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్‌ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement