Magnetic field
-
నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!
నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు! సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది! కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది! అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది! సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!! సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకింతోష్ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. కారణాలు మిస్టరీయే! సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు. తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్ సైకిల్లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్ సైకిల్ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్య వయస్సులోకి ఆదిత్యుడు... సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట. ఏమిటీ సోలార్ సైకిల్? సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్ సైకిల్. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్ స్పాట్స్) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్‌స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!
ముంబై: కరోనా మహమ్మారి రాకతో ప్రపంచం మొత్తం పూర్తిగా అతలాకుతలామయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్‌తో మన దేశం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష..! అని పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపారు. కాగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వస్తాయనే విషయం తెలిసిందే. కాగా, నాసిక్ చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతడి శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అరవింద్ మమూలుగానే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో కోవిషిల్డ్ రెండో డోసును వేయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిని రియల్ లైఫ్ మ్యాగ్నటో(ఎక్స్ మెన్ లోని ఒక సూపర్ హీరో పాత్ర) అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెడికల్ అధికారులు స్సందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్సైట్లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కోవిడ్-19 టీకాలు తీసుకున్న ప్రదేశంలో ఎలాంటి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయగల పదార్థాలను కలిగి ఉండవని తెలిపారు. కోవిడ్-19 టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలకు తావులేదని తెలిపింది. అంతేకాకుండా కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సీడీసీ పేర్కొంది. View this post on Instagram A post shared by Bol Bhidu (@bolbhidu) చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
ఇకపై ఫోన్లు పనిచేయవ్... కారణం?
లండన్: ఇప్పటి వరకు ప్రపంచం అంతా కరోనా మహమ్మారి పై పోరాడుతూ దానికి ఒక పరిష్కారం వెతకడంలో సతమతమవుతోంది. అయితే ఇప్పుడు మరో సమస్య రాబోతుందని శాస్త్రవేత్తలంటున్నారు. అయితే ఈ సమస్య వైరస్‌లకు, బ్యాక్టీరియాలకు సంబంధించినది, ఆరోగ్యానికి సంబంధించినది కాదు. టెక్నాలజీకి సంబంధించింది. మొబైల్ ఫోన్... ఇప్పుడు ఇది మన సాధారణ జీవితంలో ఒక భాగమైపోయింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మొబైల్ ద్వారానే నేడు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా పుట్టికొచ్చిన సమస్య ద్వారా మొబైల్ ఫోన్లు, శాటిలైట్లు ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... (‘రీ ఓపెన్ అమెరికా’పై బాట్స్ ఉద్యమం) భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది మనల్ని సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్ సిగ్నల్, శాటిలైట్ సిగ్నల్స్ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందులో కొంత భాగం బలహీన పడిపోయిందంట. అయితే ఎందుకు అలా జరుగుతోంది అన్న విషయం మాత్రం ఎవరికి అంతుచిక్కడం శాటిలైట్ల డేటా ఆధారంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా మధ్య ఈ బలహీనత ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సౌత్ అట్లాంటిక్ ఎనామలీ అని పిలిచే ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉందంట. దీని అర్థం ఏంటంటే... అయస్కాంత క్షేత్రాల బలహీనత రానూరానూ ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తోందని అర్థం. ఇంతకుముందు 24000 నానాటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం కాస్త ఇప్పుడు 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సైంటిస్టులు చెప్పారు. ఈ ఎనామలీ ఏరియా... ఏటా 20 కిలోమీటర్లు అదనంగా పడమర వైపు విస్తరిస్తోందని తెలిపారు. తాజాగా... నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే ఎనామలీ రెండుగా ముక్కలైందని వారు భావిస్తున్నారు. దీనిలో ప్రధాన సమస్య ఏంటంలే ఈ ఎనామలీ ఈమధ్య కాలంలో చాలా వేగంగా విస్తస్తోంది. దీనికి సంబంధించి ఈఎస్ఏ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.... భూమిలో ఉత్తర, దక్షిణ ధ్రువాల అయస్కాంత క్షేత్రం తలకిందులుగా అవ్వడమే అయస్కాంత క్షేత్రం బలహీనంగా అవ్వడానికి కారణం. దీని అర్థం ఉత్తర ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం దక్షిణ ధ్రువానికీ, దక్షిణ ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువానికీ చేరినట్లన్నమాట. ఇలా ప్రతి 250000 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది అని తెలిపారు. ఇదిలా ఉండగా ఒక వేళ ఈఎస్ఏ చెప్పిందే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ల కమ్యూనికేషన్ కొంతవరకూ దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టెలికం నెట్వర్కులు, మొబైల్ ఫోన్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతవరకూ పనిచేయకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో వెళ్లే విమానాలు సరిగా పనిచేయకపోవచ్చని కూడా పరిశోధకలు చెబుతున్నారు. అయితే మరోవైపు వేరే రకమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి శాటిలైట్లు, మొబైళ్లకు ఏ సమస్య రాలేదు కాబట్టి, ఇకపై కూడా రాకపోవచ్చనే అంచనా వేస్తోన్నారు. అయస్కాంత క్షేత్రం తలకిందులు అవ్వడం అనేది ఒక్క రోజులో జరగదు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా) -
దారి తప్పుతున్న దిక్కులు!
స్మార్ట్‌ఫోన్‌లో మ్యాప్స్ అప్లికేషన్ వాడుతుంటారా..? తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే దీన్నే ఉపయోగిస్తారా..? ఏ మారుమూల ప్రాంతాలనైనా భలే గుర్తుపడుతుంది కదా.. ఈ సౌకర్యానికి రోజులు దగ్గరపడ్డాయి.. ఎందుకంటే భూ అయస్కాంత ధృవం వేగంగా కదిలిపోతోంది! దీంతో మ్యాప్స్‌లాంటి దిక్సూచిలన్నీ కకావికలం కానున్నాయి! అయస్కాంత ధృవమేంటీ..? కదిలిపోవడం ఏంటీ? స్మార్ట్ ఫోన్లకూ వాటికీ లింకేంటీ.. ఇవేగా మీ మనసులో మెదు లుతున్న ప్రశ్నలు. భూమి ఒక అయస్కాంతం లాంటిదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ అయ స్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉం టాయి. ఇవి కంటికి కనిపించవు. ఆర్కి టిక్.. అంటార్కిటికాలను ధృవాలు అం టాం. ఈ ప్రాంతాలను అసలు ధృవా లని పిలుస్తారు. అయస్కాంత క్షేత్ర ధృవాలు భూమి లోపలి పొరల్లో జరిగే కార్యకలాపాలకు అనుగు ణంగా కదులుతుంటాయి. ఇంకా సులువుగా చెప్పాలంటే 3 లక్షల ఏళ్లకోసారి ధృవాలు తారుమారు అవు తుంటాయి. అయస్కాంతం తిరగబడి నట్లు అన్నమాట! కానీ ఈ మధ్య ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందట. ఎంత వేగంగా అంటే.. అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి యాభై కిలోమీటర్ల చొప్పున సైబీరియా ప్రాంతంవైపు కదలిపోయేంతగా! అయితే ఏంటి అంటున్నారా.. దీని వల్ల చాలా సమ స్యలే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ మొదలుకొని విమా నాలు, నౌకలు తమ ప్రయాణానికి ఉపయోగించే దిక్సూచీలన్నీ ఈ అయస్కాంత ధృవాల ఆధారంగానే ఉత్తర దక్షిణాలను గుర్తిస్తుంటాయి. ఒకవేళ ధృవాలు తారుమారైతే ఈ రంగాలన్నీ అతలాకుతలమైపోతాయి. కారణమేంటో తెలీదు.. అయస్కాంత ధృవాలు ఎందుకు తారుమారు అవుతున్నా యన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. అయస్కాంత ఉత్తర ధృవం ప్రస్తుతం కెనడా ప్రాంతంలో ఉన్నట్లు అంచనా. కంటికి కనిపించని ధృవాల కదలికలతో వరల్డ్ మాగ్నెటిక్ మోడల్ పేరుతో ఒక మ్యాప్ ఉంటుంది. గూగుల్ లాంటి సంస్థలు ఈ మోడల్‌నే వాడుకుంటాయి. 2020 వరకు పనిచేస్తుందన్న అంచనాతో నాలుగేళ్ల కింద తాజా మోడల్ విడుదలైంది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయా లని సూచిస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో కదిలే దూరాన్ని మూడేళ్లలోనే అధిగమించినట్లు కొలరాడో యూనివర్సిటీ, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్టేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. 2000 నుంచి అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి 50 కిలోమీటర్ల దూరం కదులుతోందని.. అయితే మూడేళ్ల కింద సంభవించిన ఓ భౌగోళిక సంఘటన.. ఉత్తర ధృవ ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పుల కారణంగా వేగం మరింత పెరిగిందని అర్నాడ్ చుల్లియట్ అనే శాస్త్రవేత్త వివరించారు. అయస్కాంత దక్షిణ ధృవం మాత్రం ఏడాదికి పది కిలోమీటర్ల మేర మాత్రమే కదులుతోందని చెప్పారు. దీంతో ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు ఇతర సంస్థల నావిగేషన్ వ్యవస్థలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావించారు. ఈ నెల 15 నాటికి మార్చేద్దామని నిర్ణయించారు కూడా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ కారణంగా ఈ గడువు నెలాఖరుకు చేరింది. ఏం జరుగుతుంది? అయస్కాంత ఉత్తర ధృవం వేగంగా కదలిపోతే నావిగేషన్ వ్యవస్థలకు ఇబ్బందన్నది ఒక సమస్య మాత్రమే. ఇది కాస్తా సమీప భవిష్యత్తులో ధృవాలు తారుమారయ్యేం దుకు సూచిక అయితే ప్రమాదమేనని శాస్త్ర వేత్తల అంచనా. సూర్యుడి నుంచి వస్తున్న రేడి యోధార్మిక కిరణాల నుంచి మనల్ని రక్షిస్తున్న అయస్కాంత క్షేత్ర ధృవాలు తారుమారయ్యే సమ యంలో బలహీనంగా మారుతాయి. సూర్యుడి నుంచి వెలువడే శక్తిమంతమైన కిరణాలు మన ఉపగ్రహాలను, విద్యుత్ సరఫరా గ్రిడ్లను తీవ్రంగా నష్టపరుస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఈ అయస్కాంత క్షేత్రం ఆధారంగానే ఎటువెళ్లాలో నిర్ణయించుకునే పక్షులు గందరగోళానికి గురవుతాయి. అయితే ఈ ధృవాల తారుమారు ప్రక్రి యతో ప్రాణ నష్టం ఉండే అవకాశాలు లేకపోవడం కొంచెం సాంత్వన కలిగించే అంశం. -
‘గురు’డి చెల్లి... మనకు మరో తల్లి?
విశ్వంలో భూమి మీదే జీవం ఎందుకు ఉంది? భూగోళమే జీవులకు ఎందుకు అనుకూలం? ఇక్కడ మాత్రమే అనుకూల వాతావరణం ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి! అయితే.. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరివారమేనా? ఏమో.. భూమిలాగే ఎక్కడో ఓ గ్రహం పచ్చగా కళకళలాడుతూ ఉండవచ్చు! అందుకే.. శతాబ్దాల తరబడి అన్వేషణ సాగుతోంది.ప్రస్తుతానికైతే చంద్రుడు, అంగారకుడిపై కాలనీల గురించే ప్రయత్నాలన్నీ. కానీ.. గురుగ్రహం జాబిల్లి ‘గ్యానిమీడ్’ కూడా మనకు మరో భూమి కాగలదంటున్నారు శాస్త్రవేత్తలు!గురుగ్రహం చందమామ గ్యానిమీడ్ ఉపరితలం కింద మహా సముద్రం! చుట్టూ కొంత బలమైన అయస్కాంత క్షేత్రం! ఈ విషయాలను గతంలోనే అంచనా వేసినా.. తాజాగా కచ్చితమైన ఆధారాలు దొరికాయి. మంచుతో నిండి ఉన్న గ్యానిమీడ్ ఉపరితలం కింద భారీ సముద్రం ఉన్నట్లు హబుల్ అంతరిక్ష టెలిస్కోపు అందించిన సమాచారంతో ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం కూడా ఆవరించి ఉన్నట్లు ఇటీవల ధ్రువీకరించారు. దీంతో భవిష్యత్తులో గ్యానిమీడ్ను మరో భూమిగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. మన సౌరకుటుంబంలో అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ ఇదే మరి. ఉపరితలం కింద నీరు కూడా పుష్కలంగా ఉంది కాబట్టి.. మానవ ఆవాసానికి ఉపయోగపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వందల కోట్లు కాకపోయినా.. కోట్లాది మంది అయినా నివసించవచ్చని చెబుతున్నారు. ఒకే గ్రహం.. రెండు అయస్కాంత క్షేత్రాలు! భూమిపై ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఆకాశంలో రంగురంగుల ధ్రువ కాంతులు (ఆరోరా) ఏర్పడుతున్నట్లే.. గ్యానిమీడ్ చుట్టూ కూడా ధ్రువ కాంతులు నాట్యం చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి విద్యుదావేశ కణాలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే మార్పుల వల్ల ధ్రువకాంతులు ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడటం వెనక అయస్కాంత క్షేత్ర ప్రభావమే ప్రధాన కారణం. అదేవిధంగా గ్యానిమీడ్కు విచిత్రంగా రెండు అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి! ఒకటి సొంత క్షేత్రం కాగా, మరోటి గురుగ్రహ క్షేత్రం. అంటే.. గ్యానిమీడ్, జూపిటర్ అయస్కాంత క్షేత్రాలు పరస్పరం కలిసిపోతూ ఉంటాయి. దీనివల్ల గ్యానిమీడ్ ధ్రువకాంతులు కూడా వెనక్కి, ముందుకు కదులుతూ నాట్యం చేసినట్లు కనిపిస్తాయి. గ్యానిమీడ్ ఉపరితలం కింద ఉన్న భారీ సముద్రం వంద కిలోమీటర్ల మందంతో, ఒక లీటరుకు 5 గ్రాముల ఉప్పుతో ఉండవచ్చని అంచనా. నీరు అనేది జీవుల మనుగడకు ప్రాథమిక వనరు కాబట్టి.. దీనిపై నీరు ఉందన్న విషయం ఖగోళ శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇవీ సాధ్యాసాధ్యాలు... చంద్రుడు, అంగారకుడిపై కాలనీల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. అక్కడ మనిషి స్థిరపడేందుకు వందల ఏళ్లు పట్టవచ్చు. అయినా ఎల్లప్పుడూ అంతరిక్షం నుంచి ఉల్కలు, రేడియేషన్ల ముప్పు ఎక్కువే. కానీ గ్యానిమీడ్కు కాస్త బలమైన అయస్కాంత క్షేత్రం, సముద్రం ఉండటం వల్ల ఇక్కడ ఆవాసం సులభం కానుంది. రెండు అయస్కాంత క్షేత్రాల నుంచి రక్షణ లభిస్తుండటం కూడా అనుకూలాంశమే. అయితే, గ్యానిమీడ్పై ఖనిజ వనరులు పెద్దగా లేవు. అయినా, గురుగ్రహానికి చెందిన ఇతర ఉపగ్రహాల నుంచి ఖనిజాలను దీనిపైకి తరలించడం చాలా సులభం. జూపిటర్ అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇక్కడ అంతరిక్ష ప్రయాణం ఎంతో ఈజీ. ఇంధన అవసరం లేకుండా మ్యాగ్నెటిక్ స్పేస్షిప్లలోనూ ప్రయాణించవచ్చు. షీల్డులతో కూడిన బయోస్పియర్లను ఏర్పాటు చేసుకుంటే పంటలు కూడా పండించుకోవచ్చని చెబుతున్నారు. మరిన్ని చందమామల్లోనూ.. సముద్రాలు! జూపిటర్ మూన్స్ యూరోపా, కాలిస్టో, శని చందమామలు ఎన్సెలడస్, టైటాన్, మిమాస్, నెప్ట్యూన్ మూన్ ట్రైటాన్ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఎన్సెలడస్ సముద్రంలో వేడినీటి ప్రవాహాలున్నాయని, వాటిలో సూక్ష్మజీవులు ఉండవచ్చనీ అంచనా. అలాగే మరుగుజ్జు గ్రహాలు ప్లూటో, సిరీజ్ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఇవన్నీ ఆవాసానికి అనుకూలం కాకపోయినా.. వీటిని అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములు మజిలీలుగా ఉపయోగించుకుని, ఇక్కడి నీటితో హైడ్రోజన్, ఆక్సిజన్లను తయారు చేసుకునేందుకైనా వీలు కావచ్చని భావిస్తున్నారు. 2022లో బయలుదేరనున్న ‘జ్యూస్’ ఆర్బిటర్ గ్యానిమీడ్ను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈసా 2022లో ‘జ్యూస్(జుపిటర్ ఐసీ మూన్ ఎక్స్‌ప్లోరర్)’ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది 2030 నాటికి గ్యానిమీడ్ను చేరి, దాని అయస్కాంత క్షేత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. రాడార్ పరికరాలతో మంచు ఉపరితలాన్ని, సముద్రాన్ని, గురుత్వాకర్షణ శక్తిని అధ్యయనం చేసి సమాచారాన్ని భూమికి పంపనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ. 930 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇవీ విశేషాలు... ⇒ గెలీలియో 1610లో కనుగొన్నారు. ⇒ వైశాల్యం 5,300 కిలోమీటర్లు (భూమి సైజులో 0.0704 వంతు) ⇒ చంద్రుడి కంటే 2 రెట్లు బరువు ఎక్కువ ⇒ వాతావరణంలో ఆక్సిజన్, ఓజోన్ కూడా ఉండవచ్చు. ⇒ గెలీలియో కనుగొన్న నాలుగు జూపిటర్ మూన్స్‌లో ఒకటి. ⇒ ఇంతకుముందు వోయేజర్, గెలీలియో వ్యోమనౌకలు అధ్యయనం చేశాయి. ⇒ అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ. ⇒ గురుగ్రహం చుట్టూ ఏడు రోజులకోసారి తిరుగుతుంది. ⇒ అతిపెద్ద గ్రహమైన జూపిటర్కు 67 చందమామలుండగా, ఇదే అతిపెద్దది. ⇒ సౌరకుటుంబంలోని అన్ని చందమామల్లోనూ ఇదే పెద్దది. ⇒ భూమి నుంచి గ్యానిమీడ్ను చేరేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది. - హన్మిరెడ్డి యెద్దుల -
భూమి అంతు చిక్కని ఓ అద్భుతం
భూ అయస్కాంత క్షేత్రంపై కొనసాగుతున్న పరిశోధనలు చౌటుప్పల్: ‘ భూమి అంతు చిక్కని ఓ అద్భుతం.. అతిపెద్ద అయస్కాంత క్షేత్రం. మానవజాతి మనుగడను ఈ అయస్కాంత క్షేత్రం గోడలా పరిరక్షిస్తుంది.. అందుకే ప్రపంచవ్యాప్తంగా నిత్యం భూ అయస్కాంత క్షేత్రాలపై 150 కేంద్రాలు పరిశోధనలు సాగిస్తున్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలోని ఎన్జీఆర్ఐ క్షేత్రంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోమాగ్నటిజమ్ అండ్ ఎరోనమీ (ఐఏజీఏ) నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ అబ్జర్వేటరీ వర్క్‌షాప్ గురువారం మూడో రోజుకు చేరింది. 50మంది దేశవిదే శాల శాస్త్రవేత్తలు పరిశోధనల్లో పాల్గొన్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిల్లర్స్‌పై మాగ్నటోమీటర్లను ఏర్పాటు చేసి, పరిశోధనలు సాగించారు. వేరియోమీటర్ ద్వారా సంగ్రహించిన భూ అంతర్భాగంలోని నమూనాలను కంప్యూటర్ల ద్వారా విశ్లేషించారు. శాస్త్రవేత్తలందరి పరిశోధన విషయాలను మార్పిడి చేసుకొని, కచ్చితత్వానికి వచ్చారు. కార్యశాల కో-కన్వీనర్ డాక్టర్ కుసుమితా అరోరా, ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్ బి.వీణాధరి, కె.చంద్రశేఖర్‌రావు పరిశోధనలను పర్యవేక్షించారు.