‘గురు’డి చెల్లి... మనకు మరో తల్లి?
విశ్వంలో భూమి మీదే జీవం ఎందుకు ఉంది? భూగోళమే జీవులకు ఎందుకు అనుకూలం? ఇక్కడ మాత్రమే అనుకూల వాతావరణం ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి! అయితే.. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరివారమేనా? ఏమో.. భూమిలాగే ఎక్కడో ఓ గ్రహం పచ్చగా కళకళలాడుతూ ఉండవచ్చు! అందుకే.. శతాబ్దాల తరబడి అన్వేషణ సాగుతోంది.ప్రస్తుతానికైతే చంద్రుడు, అంగారకుడిపై కాలనీల గురించే ప్రయత్నాలన్నీ.
కానీ.. గురుగ్రహం జాబిల్లి ‘గ్యానిమీడ్’ కూడా మనకు మరో భూమి కాగలదంటున్నారు శాస్త్రవేత్తలు!గురుగ్రహం చందమామ గ్యానిమీడ్ ఉపరితలం కింద మహా సముద్రం! చుట్టూ కొంత బలమైన అయస్కాంత క్షేత్రం! ఈ విషయాలను గతంలోనే అంచనా వేసినా.. తాజాగా కచ్చితమైన ఆధారాలు దొరికాయి. మంచుతో నిండి ఉన్న గ్యానిమీడ్ ఉపరితలం కింద భారీ సముద్రం ఉన్నట్లు హబుల్ అంతరిక్ష టెలిస్కోపు అందించిన సమాచారంతో ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం కూడా ఆవరించి ఉన్నట్లు ఇటీవల ధ్రువీకరించారు.
దీంతో భవిష్యత్తులో గ్యానిమీడ్‌ను మరో భూమిగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. మన సౌరకుటుంబంలో అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ ఇదే మరి. ఉపరితలం కింద నీరు కూడా పుష్కలంగా ఉంది కాబట్టి.. మానవ ఆవాసానికి ఉపయోగపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వందల కోట్లు కాకపోయినా.. కోట్లాది మంది అయినా నివసించవచ్చని చెబుతున్నారు.
ఒకే గ్రహం.. రెండు అయస్కాంత క్షేత్రాలు!
భూమిపై ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఆకాశంలో రంగురంగుల ధ్రువ కాంతులు (ఆరోరా) ఏర్పడుతున్నట్లే.. గ్యానిమీడ్ చుట్టూ కూడా ధ్రువ కాంతులు నాట్యం చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి విద్యుదావేశ కణాలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే మార్పుల వల్ల ధ్రువకాంతులు ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడటం వెనక అయస్కాంత క్షేత్ర ప్రభావమే ప్రధాన కారణం. అదేవిధంగా గ్యానిమీడ్‌కు విచిత్రంగా రెండు అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి! ఒకటి సొంత క్షేత్రం కాగా, మరోటి గురుగ్రహ క్షేత్రం.
అంటే.. గ్యానిమీడ్, జూపిటర్ అయస్కాంత క్షేత్రాలు పరస్పరం కలిసిపోతూ ఉంటాయి. దీనివల్ల గ్యానిమీడ్ ధ్రువకాంతులు కూడా వెనక్కి, ముందుకు కదులుతూ నాట్యం చేసినట్లు కనిపిస్తాయి. గ్యానిమీడ్ ఉపరితలం కింద ఉన్న భారీ సముద్రం వంద కిలోమీటర్ల మందంతో, ఒక లీటరుకు 5 గ్రాముల ఉప్పుతో ఉండవచ్చని అంచనా. నీరు అనేది జీవుల మనుగడకు ప్రాథమిక వనరు కాబట్టి.. దీనిపై నీరు ఉందన్న విషయం ఖగోళ శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
ఇవీ సాధ్యాసాధ్యాలు...
చంద్రుడు, అంగారకుడిపై కాలనీల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. అక్కడ మనిషి స్థిరపడేందుకు వందల ఏళ్లు పట్టవచ్చు. అయినా ఎల్లప్పుడూ అంతరిక్షం నుంచి ఉల్కలు, రేడియేషన్ల ముప్పు ఎక్కువే. కానీ గ్యానిమీడ్‌కు కాస్త బలమైన అయస్కాంత క్షేత్రం, సముద్రం ఉండటం వల్ల ఇక్కడ ఆవాసం సులభం కానుంది. రెండు అయస్కాంత క్షేత్రాల నుంచి రక్షణ లభిస్తుండటం కూడా అనుకూలాంశమే.
అయితే, గ్యానిమీడ్‌పై ఖనిజ వనరులు పెద్దగా లేవు. అయినా, గురుగ్రహానికి చెందిన ఇతర ఉపగ్రహాల నుంచి ఖనిజాలను దీనిపైకి తరలించడం చాలా సులభం. జూపిటర్ అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇక్కడ అంతరిక్ష ప్రయాణం ఎంతో ఈజీ. ఇంధన అవసరం లేకుండా మ్యాగ్నెటిక్ స్పేస్‌షిప్‌లలోనూ ప్రయాణించవచ్చు. షీల్డులతో కూడిన బయోస్పియర్‌లను ఏర్పాటు చేసుకుంటే పంటలు కూడా పండించుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని చందమామల్లోనూ.. సముద్రాలు!
జూపిటర్ మూన్స్ యూరోపా, కాలిస్టో, శని చందమామలు ఎన్‌సెలడస్, టైటాన్, మిమాస్, నెప్ట్యూన్ మూన్ ట్రైటాన్‌ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఎన్‌సెలడస్ సముద్రంలో వేడినీటి ప్రవాహాలున్నాయని, వాటిలో సూక్ష్మజీవులు ఉండవచ్చనీ అంచనా. అలాగే మరుగుజ్జు గ్రహాలు ప్లూటో, సిరీజ్‌ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఇవన్నీ ఆవాసానికి అనుకూలం కాకపోయినా.. వీటిని అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములు మజిలీలుగా ఉపయోగించుకుని, ఇక్కడి నీటితో హైడ్రోజన్, ఆక్సిజన్‌లను తయారు చేసుకునేందుకైనా వీలు కావచ్చని భావిస్తున్నారు.
2022లో బయలుదేరనున్న ‘జ్యూస్’ ఆర్బిటర్
గ్యానిమీడ్‌ను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈసా 2022లో ‘జ్యూస్(జుపిటర్ ఐసీ మూన్ ఎక్స్‌ప్లోరర్)’ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది 2030 నాటికి గ్యానిమీడ్‌ను చేరి, దాని అయస్కాంత క్షేత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. రాడార్ పరికరాలతో మంచు ఉపరితలాన్ని, సముద్రాన్ని, గురుత్వాకర్షణ శక్తిని అధ్యయనం చేసి సమాచారాన్ని భూమికి పంపనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ. 930 కోట్లు వ్యయం కానుందని అంచనా.
ఇవీ విశేషాలు...
⇒ గెలీలియో 1610లో కనుగొన్నారు.
⇒ వైశాల్యం 5,300 కిలోమీటర్లు (భూమి సైజులో 0.0704 వంతు)
⇒ చంద్రుడి కంటే 2 రెట్లు బరువు ఎక్కువ
⇒ వాతావరణంలో ఆక్సిజన్, ఓజోన్ కూడా ఉండవచ్చు.
⇒ గెలీలియో కనుగొన్న నాలుగు జూపిటర్ మూన్స్‌లో ఒకటి.
⇒ ఇంతకుముందు వోయేజర్, గెలీలియో వ్యోమనౌకలు అధ్యయనం చేశాయి.
⇒ అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ.
⇒ గురుగ్రహం చుట్టూ ఏడు రోజులకోసారి తిరుగుతుంది.
⇒ అతిపెద్ద గ్రహమైన జూపిటర్‌కు 67 చందమామలుండగా, ఇదే అతిపెద్దది.
⇒ సౌరకుటుంబంలోని అన్ని చందమామల్లోనూ ఇదే పెద్దది.
⇒ భూమి నుంచి గ్యానిమీడ్‌ను చేరేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది.
- హన్మిరెడ్డి యెద్దుల