అసమానతల  అంతు చూస్తారా? | Quantum Computing to Tackle Turbulence, a Long-Standing Scientific Challenge | Sakshi
Sakshi News home page

అసమానతల  అంతు చూస్తారా?

Published Tue, Feb 11 2025 6:23 AM | Last Updated on Tue, Feb 11 2025 6:23 AM

Quantum Computing to Tackle Turbulence, a Long-Standing Scientific Challenge

ద్రవాలు, వాయువుల్లో అసమతుల్యత వంటి హఠాత్పరిణామాలపై మరింత లోతైన అధ్యయనం 
 

తొలిసారిగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విధానంతో టర్బులెన్స్‌ గుట్టు విప్పే సాహసం చేస్తున్న శాస్త్రవేత్తలు 

విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్‌ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్‌ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది.

 ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్‌ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్‌ తప్పడమో జరుగుతున్నాయి. 

వెదర్‌ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. 

మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్‌ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్‌ హార్ట్‌ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్‌పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్‌పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్‌ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. 

వేగంగా చర్యలు జరిపి.. 
ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్‌ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్‌ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్‌ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్‌ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్‌ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్‌చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. 

దీంతో సెకన్‌ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్, ఫిజికల్‌ రివ్యూ రీసెర్చ్‌ జర్నల్‌లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్‌ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. 

సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్‌ మాత్రమే వాడతారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో క్వాంటమ్‌ బిట్‌(క్వాబిట్స్‌) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్‌ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్‌ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్‌ గోరియనోవ్‌ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్‌ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధకుడు జేమ్స్‌ బీటెల్‌ చెప్పారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement