quantum computing
-
లద్దాఖ్‌లో ‘క్వాంటమ్’ ఎర్త్ స్టేషన్
ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించించింది. సంప్రదాయ శాటిలైల్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సంప్రదాయ విధానాల్లో అయితే మెగాహెర్ట్జ్(ఎంహెచ్‌జెడ్), గిగాహెర్ట్జ్(జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీల్లో సమాచార మార్పిడి జరుగుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్లలో మాత్రం టెరాహెర్ట్జ్(టీహెచ్జెడ్) ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. దీంతో డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. క్వాంటమ్ ప్రసారాల రంగంలో తదుపరి పరిశోధనలకు గాను గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) సైంటిస్టులు అన్వేషణ ప్రారంభించారు. అడ్వాన్స్డ్ అబ్జర్వేటరీ కేంద్రాలైన లద్దాఖ్‌లోని హన్లే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ(ఐఏఓ), రాజస్తాన్‌లోని మౌంట్ అబూ అబ్జర్వేటరీ, నైనిటాల్‌లోని ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్ఐఈఎస్)ను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లోని ఓపెన్–సోర్స్ డేటాను విశ్లేషించారు. క్వాంటమ్ సంకేతాలను అంతరిక్షంలోకి పంపించడానికి హన్లేలోని ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని తేల్చారు. ఇక్కడే ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హన్లే గ్రామం సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నీరు ఆవిరయ్యే రేటు తక్కువ. క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలకు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుందని గుర్తించారు. ప్రభావవంతమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏర్పాటుకు క్వాంటమ్ సంకేతాలను భూవాతావరణం గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతరిక్షంలోకి పంపించడం అత్యంత కీలకం. అందుకు ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. క్వాంటమ్ సిగ్నల్స్‌ను ప్రాథమికంగా క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. ఇందులో అత్యంత సూక్ష్మమైన ఫో టాన్లు, ఎల్రక్టాన్లు, అణువుల ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది కాబట్టి నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. డేటా సెక్యూరిటీ విషయంలో క్వాంటమ్ టెక్నాలజీ పాత్ర నానాటికీ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నా రు. భవిష్యత్తులో అత్యాధునిక క్వాంటమ్ టెక్నా లజీ ప్రాజెక్టులకు ఇండియా కేంద్రస్థానంగా మా రుతుందని, ఇక్కడున్న భౌగోళిక వైవిధ్యమే అందుకు కారణమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏకకాలంలో ఎన్నోపనులు..!
ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్ టెక్నాలజీ కంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్‌మెంట్, సూపర్‌పొజిషన్స్ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్ రేణువులు ఎంటాంజిల్‌మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు. -
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..
ప్రస్తుతకాలంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు! ఏఐనే మన జీవితాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రభావం చూపుతోంది. అలాంటిది ఏఐ కంటే ఎన్నోరెట్లు ఎక్కువ సమర్థతో పనిచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రభంజనమే. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లు కలిసి కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. దాంతో దేశాల మధ్య పోటీ మొదలైంది. కెనడా, అమెరికాల తరువాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసిన ఘనత ఇటీవలే చైనా సొంతం చేసుకుంది. 2026 నాటికి భారత్ 50 క్యుబిట్ల సామర్థ్యంతో సొంత క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందిస్తుందని నాస్కామ్ అంచనా. దానికన్నా ముందు క్వాంటమ్ సిమ్యులేటర్లు, సెన్సర్ల తయారీకి భారత్ సమాయత్తమవుతోంది. క్వాంటమ్ రంగంలో అగ్రశక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో క్వాంటమ్ ఆధారిత సైన్స్, టెక్నాలజీ (క్వెస్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలా.. క్వాంటమ్ పథకం కింద 2023-31 మధ్య కాలంలో సంబంధిత కంప్యూటర్ ప్రాసెసర్లు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రూపకల్పన, నిపుణులైన మానవ వనరులను తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య సంరక్షణ, భూగర్భ వనరుల అన్వేషణ, ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్ సెన్సర్లు తయారు చేస్తారు. భూ, వాయు, జల, అంతరిక్ష మార్గాల్లో ప్రయాణాల కోసం క్వాంటమ్ నావిగేషన్ సాధనాలను రూపొందిస్తారు. క్వాంటమ్ సాంకేతికతలు దేశ భద్రత, బ్యాంకింగ్ రంగానికి మెరుగైన కమ్యూనికేషన్ అందిస్తాయని అభిప్రాయాలు ఉన్నాయి. క్వాంటమ్ సాధనాల తయారీకి కావాల్సిన సూపర్, సెమీ కండక్టర్లు, రకరకాల లోహ మిశ్రమాలను భారత్ సొంతంగా తయారుచేసుకుంటోంది. 2035కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ రాబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష-వైమానిక, ఆటోమోటివ్, ఫైనాన్స్, ఫార్మా వంటి వివిధ రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగవంతమైన సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులను ఛేదించే వీలుంది. దీంతో అత్యంత సునిశిత సెన్సర్లను రూపొందించవచ్చు. ఇవి ప్రత్యర్థి సైనిక, ఆర్థిక, కార్పొరేట్, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయగలవు. పేటెంట్ల నమోదు, క్వాంటమ్ కమ్యూనికేషన్లలో చైనా అమెరికాను మించిపోయింది. భూమి నుంచి అంతరిక్షానికి కమ్యూనికేషన్ యంత్రాంగ నిర్మాణం కోసం అనేక క్వాంటమ్ నానో ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రత్యర్థుల రాడార్లకు చిక్కని స్టెల్త్ జలాంతర్గాములు, యుద్ధవిమానాలను పసిగట్టే క్వాంటమ్ ఆధారిత రాడార్‌నూ చైనా రూపొందించింది. ఇదీ చదవండి: ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్..! నిపుణులు కరవు.. ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చాలా కొద్ది వర్సిటీలు మాత్రమే క్వాంటమ్ సైన్స్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికీ క్వాంటమ్ రంగం కోసం ప్రత్యేక నిపుణులెవరూ తయారు కాలేదు. 2021లో ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ సాంకేతికతలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు దాదాపు 851 మాత్రమే. ఆ రంగంలో ప్రపంచమంతటా పట్టభద్రులైనవారు కేవలం 290 మందే. నిపుణుల కొరతను తీర్చడానికి ప్రస్తుతం భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజినీర్లే క్వాంటమ్ పరిశోధకుల అవతారం దాలుస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో నిపుణుల కొరతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కణ కవలలపై పరిశోధనలు
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభియనం చేసిన సినిమా ‘హలో బ్రదర్’ గుర్తుందా? 1994లో విడుదలైన ఈ సినిమా చూసుంటే.. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోనీ జీలింగర్‌లు చేసిన పరిశోధనలు అర్థం చేసుకోవడం సులువవుతుంది. కణస్థాయిలో జరిగే కొన్ని భౌతిక దృగ్విషయాలను నియంత్రించడం వీలవుతుందని వీరు వేర్వేరుగా జరిపిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలుకొని హ్యాకింగ్‌కు అస్సలు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఇంతకీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలేమిటి? హలో బ్రదర్ సినిమా చూసుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎలా సులువు అవుతుంది? దూరంగా ఉన్నప్పటికీ ఒకేలా ప్రవర్తన ముందుగా చెప్పుకున్నట్లు హలో బ్రదర్ చిత్రంలో నాగార్జునది ద్విపాత్రాభినయం. పుట్టినప్పుడే వేరైన ఇద్దరు కవలల కథ. కవలలంటే చూసేందుకు ఒకేలా ఉండేవారు మాత్రమే అని అనుకునేరు. వీరిద్దరు కొంచెం దగ్గరగా వస్తే చాలు.. ఒకరిని కొడితే ఇంకొకరికి నొప్పి కలుగుతుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఒకరికి నవ్వు వచ్చినా, దుఃఖం కలిగినా అదే రకమైన భావనలు రెండో వ్యక్తిలోనూ కలుగుతూంటాయి! నిజ జీవితంలో ఇలాంటి కవలలు ఉండటం అసాధ్యమేమో గానీ భౌతిక శాస్త్రంలో మాత్రం సుసాధ్యమే. సూక్ష్మ కణాల మధ్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అని పిలుస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ కణాల్లో ఒకదానిలో జరిగే మార్పు ప్రభావం ఇంకోదాంట్లోనూ కనిపిస్తుందన్నమాట! అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌లు పరిశోధనలు చేసింది ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పైనే. దూరంగా ఉన్నా కూడా ఒక్కతీరుగా ప్రవర్తించే కాంతి కణాల (ఫోటాన్లు)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగా కొన్ని కొత్త, వినూత్నమైన టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా చాలాకాలంగా కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. లెక్కకు చిక్కనంత వేగంగా పనిచేసే కంప్యూటర్లు, అతి సురక్షితమైన సమాచార వ్యవస్థలు వీటిల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. చిరకాల శేష ప్రశ్నలు నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్పై చాలాకాలంగా ఎన్నో శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు కణాలు దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించడం వెనుక ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. 1960వ దశకంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుర్తు తెలియని అంశాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సేకరించే కొలతల ఫలితాలు నిర్దిష్టమైన విలువకు మించి ఉండవని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ ‘‘బెల్స్ అసమానత’’లు నిర్దిష్ట ప్రయోగాల్లో చెల్లవని క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో ఒకరైన జాన్ ఎఫ్ క్లాసర్ గతంలోని స్టూవర్ట్ బెల్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా.. లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవిక ప్రయోగాలు చేపట్టారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ‘‘బెల్స్ అసమానత’’లు పనిచేయవని స్పష్టమైంది. అలెన్ ఆస్పెక్ట్ ఈ విషయాలను మరింత ముందుకు తీసుకెళుతూ.. జాన్ క్లాసర్ ప్రయోగాల్లోని కొన్ని లోపాలను సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. వీరిద్దరి ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఆంటోనీ జీలింగర్ ఎంటాంగిల్‌మెంట్ స్థితిలో ఉన్న కణాలను నియంత్రించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్నాలజీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. -
కృత్రిమ మేధపై కలసికట్టుగా..
దావోస్ (స్విట్జర్లాండ్): స్వేచ్ఛతో కూడిన ఉచిత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణపై ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో భాగంగా సుందర్ పిచాయ్ ప్రసంగించారు. గోప్యత అన్నది ఖరీదైన వస్తువేమీ కాదంటూ ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ అందరికీ అవసరం. డేటా సార్వభౌమత్వం ప్రతీ దేశానికి ముఖ్యమైనది. కనుక ప్రపంచంలో ఏ దేశంలో అయినా డేటా పరిరక్షణకు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్నెట్ నిజానికి ఒక ఎగుమతి వస్తువు. యూట్యూబ్‌లో ఒక భారతీయ పౌరుడు ఒక వీడియోను పోస్ట్ చేస్తే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సౌందర్యం ఇదే’’ అని పిచాయ్ చెప్పారు. ఆధునిక ప్రపంచంలో ఏఐ అద్భుత పాత్రను పోషిస్తుందన్నారు. ఏఐ రిస్క్‌ల గురించి అవగాహన ఉందని, ఇది బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ‘‘సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని ఎన్నో పనులను క్వాంటమ్ కంప్యూటర్లు చేయగలవు. వీటి సాయంతో ప్రకృతి మెరుగ్గా మారేలా ప్రేరేపించొచ్చు. వాతావరణం, ప్రకృతి మార్పుల గురించి మెరుగ్గా అంచనా వేయొచ్చు. టెక్నాలజీలో క్వాంటమ్ భవిష్యత్తులో పెద్ద ఆయుధంగా మారుతుంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కలయిక అద్భుతంగా ఉంటుంది’’ అని పిచాయ్ చెప్పారు. ఏఐపై ఒక కం పెనీ లేక ఒక దేశమో పనిచేయడం కాకుండా కలసికట్టుగా పనిచేసే అంతర్జాతీయ విధానం అవసరమని సూచించారు. గూగుల్ శక్తి పెరిగితే ప్రమాదకరమా..? ఈ ప్రశ్నను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్‌ష్వాబ్ సంధించారు. దీనికి పిచాయ్ స్పందిస్తూ.. ‘‘ఇతరులు కూడా మాతో సమానంగా మంచి పనితీరు చూపించినప్పుడే మేము సైతం మంచిగా పనిచేయగలం. సరైన పరిశీలన అనంతరమే మా స్థాయి విషయంలో ముందడుగు ఉంటుంది. మా వెంచర్ల ద్వారా ఏటా వందలాది స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం’’ అని తెలిపారు. ప్రజల జీవితాలను టెక్నాలజీతో ఏవిధంగా మెరుగుపరచొచ్చన్న దానిపై గూగుల్ పనిచేస్తుందని భవిష్యత్తు ప్రణాళికలపై బదులిచ్చారు. సదస్సులో ఇతర అంశాలు.. ► డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. ► ప్రపంచ ఆర్థిక వేదిక పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ► కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో దావోస్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు. -
దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్
పారిస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్ ‘సికామోర్ మెషీన్’ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని బుధవారం తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అంటారు. గూగుల్ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది. సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. ఇందులోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్ క్యూబిట్స్ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్ ప్రాసెసర్ 54 క్యూబిట్స్ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వకారణమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్‌చేశారు. -
ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
భూమండలాన్ని శాసించనున్న ఏఐ
శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేథస్సు (ఏఐ) మనకు కావాల్సిన వంటచేసి పెడుతుంది. కాలక్షేపానికి మనకు కబుర్లు చెబుతుంది. మనకు నచ్చే ఆట ఆడుతుంది. మనతో గెలుస్తోంది. ఈ భూమండలంపైనా ఇంటర్నెట్తో అనుసంధానించిన ప్రతి పరికరాన్ని నియంత్రిస్తోంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. నేడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ పోటాపోటీగా అభివృద్ధిలో దిశలో దూసుకుపోతున్నాయి. కొన్ని వందల ఏళ్లకు కృత్రిమ మేథస్సుకు సహజత్వం సిద్ధించి యజమాని ఎవరో, సర్వెంట్ ఎవరో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ భవిష్యత్ వాణిని వినిపించిందీ మరెవరో కాదు. ఏఐ పరిశోధనలపై భారీ పెట్టుబడులు పెడుతున్న ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్. ఆయన కాలిఫోర్నియాలో జరిగిన బ్లూమ్‌బర్గ్ టెక్ సదస్సులో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. కృత్రిమ మేథస్సుకు సంబంధించి తాను చెబుతున్న మాటలు ప్రస్తుతానికి థియరీనేనని, కానీ సమీప భవిష్యత్తులోనే ఇది నిజమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ అభివృద్ధి సంస్థలో 3,000 లక్షల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. కృత్రిమ మేథస్సు పెరగడం వల్ల ఐటీ పరిశ్రమలో భారీగా ఉద్యోగావకాశాలు పడిపోతాయని, ఐటీ టెక్కులు చేసే పనులను రోబోలే ఎక్కువగా చేస్తాయని ఎంతోమంది ఏఐ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. బాస్ ఎవరో, సర్వెంట్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడితే మాత్రం మనిషి, తాను సాధించిన సాంకేతిక ప్రగతితోనే యుద్ధం చేయాల్సి వస్తుందేమో! -
ఆ ప్రధాని అందరూ అవాక్కయ్యేలా..
అంటారియో: అది ఓ దేశ ప్రధాని మీడియా సమావేశం. అంతర్జాతీయ సంబంధాలు, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశం తీసుకుంటున్న చర్యలు గురించి మాట్లాడుతున్న సందర్భం. అయితే ఆ సమయంలో ఓ కొంటె రిపోర్టర్ సాక్షాత్తూ.. దేశ ప్రధానినే ఓ వ్యంగ్యమైన ప్రశ్న అడిగారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విచక్షణ కోల్పోయే నేతలను మనం చాలా మందిని చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రశ్న ఎదుర్కొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ శుక్రవారం అంటారియోలోని 'ద పెరీమీటర్ ఇనిస్టిట్యూట్ ఫర్ థీయరిటికల్ ఫిజిక్స్' ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కెనడా తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించే సమయంలో ఓ రిపోర్టర్ 'క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను' అని ప్రధానితో వ్యంగ్యంగా అన్నారు. దీనిని సవాల్‌గా తీసుకున్న ట్రుడేవ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి గడగడా ఉపన్యాసం మొదలుపెట్టారు. ప్రధాని ఊహించని స్పందనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కేరింతలతో ఆయన ఉపన్యాసాన్ని ఉత్సాహపరిచారు. రాజకీయాల్లోకి రాక ముందు వాంకోవర్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌తో పాటు హై స్కూల్లో బోధించిన అనుభవం ట్రుడేవ్‌కు ఉంది. అంతేకాదు ఇంజనీరింగ్ పట్టబద్రుడైన ట్రుడేవ్.. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫిలో మాస్టర్స్ డిగ్రీని సైతం అభ్యసించారు. ఈ అనుభవంతో ట్రుడేవ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి లెక్చర్ దంచేశాడంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ట్రుడేవ్ చెప్పిన విషయాలు అతను ఆరోజు ఉదయమే దాని గురించి చదివాడా అన్నంత ఆశ్చర్యానికి గురిచేశాయని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ప్రొఫెసర్ మార్టిన్ లఫోరెస్ట్ అన్నారు.