ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్ టెక్నాలజీ కంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఇది ఎంటాంజిల్‌మెంట్, సూపర్‌పొజిషన్స్ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.
ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
క్వాంటమ్ రేణువులు ఎంటాంజిల్‌మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment