భూమండలాన్ని శాసించనున్న ఏఐ
శాన్‌ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేథస్సు (ఏఐ) మనకు కావాల్సిన వంటచేసి పెడుతుంది. కాలక్షేపానికి మనకు కబుర్లు చెబుతుంది. మనకు నచ్చే ఆట ఆడుతుంది. మనతో గెలుస్తోంది. ఈ భూమండలంపైనా ఇంటర్నెట్తో అనుసంధానించిన ప్రతి పరికరాన్ని నియంత్రిస్తోంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. నేడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ పోటాపోటీగా అభివృద్ధిలో దిశలో దూసుకుపోతున్నాయి. కొన్ని వందల ఏళ్లకు కృత్రిమ మేథస్సుకు సహజత్వం సిద్ధించి యజమాని ఎవరో, సర్వెంట్ ఎవరో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ భవిష్యత్ వాణిని వినిపించిందీ మరెవరో కాదు. ఏఐ పరిశోధనలపై భారీ పెట్టుబడులు పెడుతున్న ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్. ఆయన కాలిఫోర్నియాలో జరిగిన బ్లూమ్బర్గ్ టెక్ సదస్సులో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. కృత్రిమ మేథస్సుకు సంబంధించి తాను చెబుతున్న మాటలు ప్రస్తుతానికి థియరీనేనని, కానీ సమీప భవిష్యత్తులోనే ఇది నిజమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ అభివృద్ధి సంస్థలో 3,000 లక్షల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.
కృత్రిమ మేథస్సు పెరగడం వల్ల ఐటీ పరిశ్రమలో భారీగా ఉద్యోగావకాశాలు పడిపోతాయని, ఐటీ టెక్కులు చేసే పనులను రోబోలే ఎక్కువగా చేస్తాయని ఎంతోమంది ఏఐ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. బాస్ ఎవరో, సర్వెంట్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడితే మాత్రం మనిషి, తాను సాధించిన సాంకేతిక ప్రగతితోనే యుద్ధం చేయాల్సి వస్తుందేమో!