Andy Rubin
-
వేధింపులపై గూగుల్ ఉక్కుపాదం
న్యూయార్క్: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్ నాటన్ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబీన్కు రూ.659.38 కోట్లు(90 మిలియన్ డాలర్లు) ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్ వీడ్కోలు పలికిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్‌ను వీడినట్లు రూబీన్ వివరణ ఇచ్చారు. -
ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
ఆండ్రాయిడ్ మొబైళ్ల రూపకర్తల్లో ఒకరైన ఆండీ రూబిన్ తను రూపొందించిన తొలి స్మార్ట్‌ఫోన్ ఎసెన్షియల్పై భారీగా ధర తగ్గించారు. గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల షిప్పింగ్ ప్రారంభమైన క్రమంలో ఆండీ రూబీన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 699 డాలర్లుగా(సుమారు రూ.45,460గా) ఉన్న తమ స్మార్ట్‌ఫోన్ ధరను, 499 డాలర్లకు(సుమారు రూ.32,457కు) తగ్గించారు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,003 మేర తగ్గిపోయింది. సమీక్షించిన ధరల్లో తమ హ్యాండ్‌సెట్‌ను యూజర్లు ఎసెన్షియల్.కామ్‌లో కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ నికోలో డే మాసి చెప్పారు. ఈ తగ్గింపు ఆపిల్ ఐఫోన్ ఎక్స్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్లను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లను ఆకట్టుకోవడంలో సాయపడుతుందని పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్ ధర 999 డాలర్లు కాగ, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర 849 డాలర్లు. ఐఫోన్ ఎక్స్ నవంబర్ 3 నుంచి విక్రయానికి వస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఎసెన్షియల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల పరంగా అంత ఆశించిన రీతిలో లేదని, గత నెలలో కేవలం 5000 యూనిట్లు మాత్రమే విక్రమమైనట్టు బేస్ట్రీట్ రీసెర్చ్ తెలిపింది. ఎసెన్షియల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... ఇంటెలిజెంట్ హోమ్ స్మార్ట్ స్పీకర్, 360 కెమెరా ఈ మొబైల్ ప్రత్యేకతలు 5.7 అంగుళాల ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే 3040 ఎంఏహెచ్ బ్యాటరీ వెనుకవైపు రెండు 13 ఎంపీ కెమెరాలు ముందువైపు 8 ఎంపీ కెమెరా టైప్‌సీ యూఎస్బీ పోర్టు 1.9 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ప్రోసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ 4కె రిజల్యూషన్‌లో వీడియోలు చిత్రీకరించొచ్చు టైటానియం, సెరామిక్ మెటీరియల్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు. -
భూమండలాన్ని శాసించనున్న ఏఐ
శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేథస్సు (ఏఐ) మనకు కావాల్సిన వంటచేసి పెడుతుంది. కాలక్షేపానికి మనకు కబుర్లు చెబుతుంది. మనకు నచ్చే ఆట ఆడుతుంది. మనతో గెలుస్తోంది. ఈ భూమండలంపైనా ఇంటర్నెట్తో అనుసంధానించిన ప్రతి పరికరాన్ని నియంత్రిస్తోంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. నేడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ పోటాపోటీగా అభివృద్ధిలో దిశలో దూసుకుపోతున్నాయి. కొన్ని వందల ఏళ్లకు కృత్రిమ మేథస్సుకు సహజత్వం సిద్ధించి యజమాని ఎవరో, సర్వెంట్ ఎవరో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ భవిష్యత్ వాణిని వినిపించిందీ మరెవరో కాదు. ఏఐ పరిశోధనలపై భారీ పెట్టుబడులు పెడుతున్న ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్. ఆయన కాలిఫోర్నియాలో జరిగిన బ్లూమ్‌బర్గ్ టెక్ సదస్సులో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. కృత్రిమ మేథస్సుకు సంబంధించి తాను చెబుతున్న మాటలు ప్రస్తుతానికి థియరీనేనని, కానీ సమీప భవిష్యత్తులోనే ఇది నిజమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ అభివృద్ధి సంస్థలో 3,000 లక్షల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. కృత్రిమ మేథస్సు పెరగడం వల్ల ఐటీ పరిశ్రమలో భారీగా ఉద్యోగావకాశాలు పడిపోతాయని, ఐటీ టెక్కులు చేసే పనులను రోబోలే ఎక్కువగా చేస్తాయని ఎంతోమంది ఏఐ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. బాస్ ఎవరో, సర్వెంట్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడితే మాత్రం మనిషి, తాను సాధించిన సాంకేతిక ప్రగతితోనే యుద్ధం చేయాల్సి వస్తుందేమో!