పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి....
అలహాబాద్‌లోని హరీష్‌చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి.
కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్‌సీ చేసిన అదితి పోలాండ్‌లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది.
‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్‌లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది.
కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్‌లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి.
ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్‌సిస్టమ్, క్వాంటమ్ ఇన్‌ఫర్‌మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్‌వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్‌లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్‌ఫర్‌మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది.
క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్‌లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది.
సమన్వయం చేసుకుంటూ...
కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు.
– అదితి సేన్
Comments
Please login to add a commentAdd a comment