woman scientist
-
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
V R Lalithambika : వీఆర్ అంటే విజయ సంకేతం
ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ‘ఫెయిల్యూర్’ ఎదురొచ్చి భయపెట్టాలని చూసింది. ‘అంతా గందరగోళం’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సందేహం వచ్చినప్పుడు ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే భయం ఉండేది. అయినా సరే... ‘ఇస్రో’ రహదారిలో లలితాంబిక ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు. అడుగడుగునా పాఠం నేర్చుకుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో టాప్ ఇంజనీర్లలో ఒకరిగా ఎదిగింది. తాజాగా... అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ‘ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్’ను అందుకుంది వీఆర్ లలితాంబిక... కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది లలితాంబిక. తండ్రితో సహా చుట్టాలలో ఎక్కువమంది ఇంజినీర్లు. గణితశాస్త్రంలో దిట్టగా పేరున్న తాత వల్ల లలితకు శాస్త్రీయ విషయాలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తే ఇస్రో వరకు తీసుకువెళ్లింది.చదువు పూర్తికాగానే పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత కూడా చదువుకు విరామం ఇవ్వలేదు లలిత. ఎంటెక్ చేస్తున్న కాలంలో ఆమెకు కూతురు జన్మించింది. కాలేజీకి విరామం ఇచ్చినప్పటికి స్నేహితురాలు తెచ్చి ఇచ్చిన క్లాసులకు నోట్స్ ఇంట్లోనే చదువుకునేది. 1998లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరింది. కొద్దిరోజుల్లోనే తాను పనిచేస్తున్న ఏరియాలో కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల ఫెయిల్యూర్ ఎదురైంది. ‘ఆ రోజుల్లో ప్రతిదీ కొత్తగానే అనిపించేది. ప్రతిరోజూ ఒక సవాలుగానే ఉండేది. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఉండేవి కాదు. సీనియర్లను అడగాలంటే భయంగా ఉండేది. ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగానే ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లలిత. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు లలిత యంగ్ మదర్. ఒకవైపు... ఏ టైమ్‌కు ఇంటికి వెళతారో తెలియనంత ఊపిరి సలపని పని. మరోవైపు... పని విరామంలో పదే పదే గుర్తుకు వచ్చే బిడ్డ. 1993లో పీఎస్ఎల్వీ లాంచ్ ఫెయిల్ అయింది. అదే సంవత్సరం రెండో ప్రయత్నానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. పని ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి క్లిష్టమైన కీలక సమయంలోనూ ఎప్పుడూ ‘ఇక చాలు. ఈ ఉద్యోగం చేయడం మన వల్ల కాదు’ అనుకోలేదు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంది. ‘ఆ సమయంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నాం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఇస్రో సంస్కృతిలో ఒకటి’ అంటుంది లలిత. సెకండ్ పీఎస్ఎల్వీ లాంచ్ సక్సెస్‌కు సంబంధించిన ఆనందం లలితకు ఆత్మస్థైర్యం, అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘పీఎస్ఎల్వీలో ఆటోపైలట్ సిస్టమ్ విభాగంలో చాలాకాలం నుంచి ఉన్నాను. లాంచ్ రోజులు ఉత్కంఠభరితమైనవి. అదే సమయంలో సంతోషం రూపంలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేవి. ప్రతి ఫెయిల్యూర్ కొత్త పాఠం నేర్పేది. ప్రతి సక్సెస్ కొత్త శక్తిని ఇచ్చేది’ అంటుంది లలిత. ‘మీ విజయరహస్యం?’ అనే ప్రశ్నకు లలిత చెప్పే మాట... ‘ఫ్యామిలీ సపోర్ట్’ ‘లాంచ్‌కు సంబంధించిన రోజుల్లో పనే లోకంగా ఉండేవాళ్లం. ఏ టైమ్‌కు ఇంటికి చేరుతామో తెలియదు. ఇలాంటి సమయంలోనూ నాకు కుటుంబ మద్దతు రూపంలో ప్రోత్సాహం, బలం లభించాయి. వ్యక్తిగత త్యాగాలను కూడా ఇష్టపూర్వకంగా చేసే రోజులు అవి. స్త్రీ, పురుషులను వేరు వేరుగా చూడడం అనే సంస్కృతి ఇస్రోలో కనిపించేది కాదు. ఎవరైనా ఒక్కటే అన్నట్లుగానే ఉండేది. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు’ అంటుంది లలిత. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం విషయానికి వస్తే... ఫ్రాన్సు, మన దేశం మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడంలో చేసిన విశేష కృషికి ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగామ్ మాజీ డైరెక్టర్ అయిన వీఆర్ లలితాంబికను ఫ్రెంచ్ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి మాథ్యూ నుంచి ఈ అవార్డ్ అందుకుంది లలిత. ‘అంతరిక్ష సాంకేతికతలో విశిష్ట శాస్త్రవేత్త’ అని మాథ్యూ లలితాంబికను కొనియాడారు. ‘ఈ గౌరవం మరింత మంది మహిళలు స్టెమ్ రంగాలలోకి రావడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటుంది వీఆర్ లలితాంబిక. -
జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్
చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్ మిషన్‌కు చంద్రయాన్-3ని చేరువ చేసేందుకుద్దేశించిన బాహుబలి రాకెట్ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత, శాస్త్రవేత్తలపై అభినందలు ప్రకటించారు. (తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? ) ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి,చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే ఆసక్తి, వీటన్నింటికీ సవాల్‌ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది. చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై ఉన్న మక్కువ నవంబర్ 1997లో ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో యావద్దేశం గర్వపడేలా చేశారు. సంబరాల్లో కుటుంబం: చంద్రయాన్ 2 ప్రాజెక్టు సఫలం కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు. (DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు) #WATCH | Lucknow: Chandrayaan-3 mission director Ritu Karidhal's family celebrates, and distributes sweets as ISRO's LVM3 M4 vehicle successfully launched it into orbit. Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. pic.twitter.com/qcalBIjjN7 — ANI (@ANI) July 14, 2023 #WATCH |ISRO chief S Somanath and the team behind #Chandrayaan3 share their delight after the LVM3 M4 vehicle successfully launched it into orbit. "Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal," says ISRO. pic.twitter.com/cRlegcsgHI — ANI (@ANI) July 14, 2023 రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్ శ్రీవాస్తవ, ఇంట్రస్టింగ్ సంగతులు ⇒ చంద్రయాన్ 3 మిషన్‌కు ఇస్రో శాస్త్రవేత్త , లక్నోకుచెందిన రీతూ కరిధాల్ శ్రీవాస్తవ నాయకత్వం వహించారు. ⇒ చిన్నప్పటినుంచి అంతరిక్షం అంటే ఆసక్తి, పలు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆమె 20కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు. ⇒ ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియాగాపాపులర్ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ⇒ రీతూ 1997 నుండి ISROలో పని చేస్తున్నారు. ⇒ చంద్రయాన్- 2 ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ కూడా ⇒ మంగళ్ యాన్’ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు. ⇒ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు ⇒ మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ ⇒ 2017లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారం ⇒ కరిధాల్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గ్లాస్ సీలింగ్ బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు..మరోసారి ఘనతను చాటుకున్న సైంటిస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి మహిళా సైంటిస్టుగా రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం కీలక బాధత్యలను చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CECRI)కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా అవతరించిన ఘనత కూడా కలైసెల్వికే దక్కింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి శనివారం నియమితు లయ్యారు. ఆమె నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల కాలం, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన వారు కలైసెల్వి. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసిన ఆమె ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా కరియర్‌ను ప్రారంభించడం విశేషం. 125కిపైగా ఎక్కువ పరిశోధనా పత్రాలు, ఆరు పేటెంట్లు ఆమె ఖాతాలోఉన్నాయి. పురుషాధిపత్య సవాళ్లను అధిగమించి అనేక ఉన్నత పదవులను చేపట్టిన కలైసెల్వి తాజాగా మరో అత్యున్నత సంస్థకు హెడ్‌గా ఎంపిక కావడంపై నారీశక్తి అంటూ పలువురు అభినందనలు ప్రకటిస్తున్నారు. Dr N Kalaiselvi has been appointed as the DG, CSIR & Secretary, DSIR. Hearty congratulations to Dr Kalaiselvi from the CSIR Family.@PMOIndia @DrJitendraSingh @PIB_India @DDNewslive pic.twitter.com/oHIZr9uoMG — CSIR (@CSIR_IND) August 6, 2022 -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
ఓటమిని కాదు..సవాళ్లను స్వీకరించండి
ప్రతిష్టాత్మక లండన్ రాయల్ సొసైటీలో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ ఎంపికయ్యారు. అంతేకాదు రాయల్ సోసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళా సైంటిస్ట్‌గా కాంగ్ ఘనతను దక్కించుకున్నారు. సైన్స్ రంగంలో వారి అసాధారణమైన రచనలు చేసిన ప్రపంచవ్యాప్తంగా 51 ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాను ఏప్రిల్ 16న ప్రకటించింది. వీరిలో కాంగ్ ఒకరు. రాయల్ సొసైటీ విజ్ఞాన శాస్త్రంలో శ్రేష్ఠమైనది. తన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్. వెల్లూరులోని ప్రముఖ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూర్ గాస్ట్రో ఇంటెస్టినల్ సైన్స్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న కాంగ్, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (బయోటెక్నాలజీ సెన్సెస్, సాంకేతిక మంత్రిత్వ విభాగానికి అనుబంధ సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ప్రాణాంతకమైన రోటా వైరస్ అంటువ్యాధుల నిరోధంపై ఆమె చేసిన కృషికిఈ గుర్తింపును గడించారు. భారతీయ పిల్లల్లో సహజంగా రోగనిరోధక శక్తే తక్కువగా ఉండటమే రోటా వైరస్ అంటురోగాలకు కారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో రోటా వైరస్ టీకా ఎందుకు సమర్థవంతమైంది కాదు అనే అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఆమె ఏర్పాటు చేసిన క్లినికల్ లాబ్ పరిశోధనలు సహకరించాయి. భారతదేశం సహా చైనా, బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలకు, టీకా తయారీ దారులకు ఈ ల్యాబ్ శిక్షణ ఇస్తుండటం విశేషం. అందుకున్న అవార్డులు 2010లో అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీ ఫెలోషిప్, 2011లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2013లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2015లో పబ్లిక్ హెల్త్ ఫ్యాకల్టీ, 2006లో భారత ప్రభుత్వం నుంచి విమెన్ బయోసైంటిస్టు ఆఫ్ ది ఇయర్ , 2016 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డున, అవార్డును కూడా గెలుచుకున్నారు. 2016 లో (లైఫ్ సైన్సెస్) ఇన్ఫోసిస్ సైన్స్ బహుమతిని అందుకున్నారు. మహిళలకు ఆమె ఇచ్చే సలహా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోని మహిళలకుఏ సలహా ఇస్తారు అని అడిగినపుడు ‘పెద్ద ఛాలెంజెస్ను స్వీకరించండి..మీకు మీరే గానీ, ఇతరుల సహకారంతోగానీ ప్రతి అంశాన్ని పూర్తిగా అన్వేషించండి..ఎట్టి పరిస్థితులలోనూ ఓటమిని అంగీకరించకండి’ అని చెప్పారు. నిజానికి ప్రొఫెషనల్ సలహా విషయంలో మహిళలకు, పురుషులకు పెద్ద వ్యత్యాసం ఉండదన్నారు. అయితే మహిళలను వెనక్కి నెట్టకుండా సాధికారిత వైపు నడిపించాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందనన్నారు. అలాగే నాయకత్వం స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళల సాధికారతకు మద్దతు అందించడం చాలా అవసరమని కాంగ్ అభిప్రాయపడ్డారు. -
పెంపుడు మొసలి చేతిలో బలైన మహిళ
జకర్తా : సాదు జీవులైన కుక్కలను, పిల్లులను పెంచుకుంటే బాగానే ఉంటుంది. కానీ పాములు, మొసళ్లు, పులులు వంటి క్రూర మృగాలను పెంచుకుంటే చివరకూ వాటి చేతిలోనే బలి అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో జరిగింది. ముద్దుగా పెంచుకుంటున్న మొసలి యాజమానురాలినే చంపేసింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ఓ 44 ఏళ్ల మహిళా సైంటిస్ట్ తన ఇంటిలో ఓ మొసలిని పెంచుకుంటుంది. ప్రస్తుతం దాని పొడవు 14 అడుగులు. ఎంత బాగా చూసుకున్నప్పటికి దాని అసలు స్వభావం మారదు కదా. ఫలితం ఏముంది.. పాలు పోసి పెంచిన చేతినే కాటేసిందన్నట్లు ఆ మొసలి యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది. మరుసటి రోజు ఉదయం మహిళ ఇంటికి వచ్చిన సహోద్యోగులకు దారుణంగా గాయపడిన సైంటిస్ట్ మృతదేహం దర్శనమిచ్చింది. మొసలి సదరు మహిళ మీద దాడి చేసి ఒక చేతిని పూర్తిగా తినేయడమే కాక.. ఆమె ఉదర భాగాన్ని కూడా గుర్తించడానికి వీలు లేనంతగా గాయపర్చింది. వెంటనే వారు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, ఆర్మీ, పోలీసులతో పాటు మరి కొంతమంది జనాల సాయంతో ఆ భారీ మొసలిని సదరు శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు. -
అగ్నిపుత్రి మిస్సైల్ తో మైత్రి
ఆమెను చూస్తే మనుషులు ఇంత నిగర్వంగా కూడా ఉండగలరా?అనిపిస్తుంది. ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ అంటూ అందరూఆకాశానికెత్తినా, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నా ఆమెసాదాసీదాగానే ఉంటారు. ఇదెలా సాధ్యమని అడిగితే.. ‘నేను నా పనితో బిజీగా ఉంటాను. అంతే..’ అని చెబుతారు డాక్టర్ టెస్సీ థామస్. రక్షణ రంగంలో తొలి మహిళా సైంటిస్ట్‌గా పేరొందిన ఆమె... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లేడీ పురస్కారం అందుకున్నారు. ఈమె సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనం.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఇటీవల జీఈఎస్ సదస్సు జరిగినప్పుడు అత్యధికులు ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటే... హాజరైన అతిరథ మహారథులు మాత్రం టెస్సీ థామస్ గురించి గొప్పగా చర్చించుకున్నారు. ఆమె ఉపన్యాసాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు మన దేశ రక్షణ రంగానికే ప్రతిష్టాత్మకమైన ‘అగ్ని’ క్షిపణి రూపకల్పలోనూ పాలుపంచుకున్న మహిళ ఆమె మాత్రమే కాబట్టి. అంతేనా.. సంప్రదాయంగా పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్న రంగమనే నమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఎందరికో రోల్ మోడలైన ఏపీజేఅబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పని చేశారు. మరి కొందరు మహిళలు కీలకమైన ఆయుధ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారంటే ఆమె అందించిన స్ఫూర్తి ఓ కారణం. రాకెట్ వైపు.. నిలిచిన చూపు.. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లను అల్లంత దూరం నుంచి చూసిన టెస్సీ... ఆ తర్వాత వాటితోనే తన జీవితాన్ని ముడివేసుకుంది. 1963లో కేరళలోని అల్లాపుఝా జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. ఇంటికి దగ్గర్లోని తుంబా స్పేస్ లాంచింగ్ స్టేషన్ నుంచి దూసుకుపోయే రాకెట్లను గమనిస్తూ పెరిగారు. పుణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో ఎంటెక్ పూర్తి చేసి, గైడెడ్ వెపన్ కోర్సు కోసం నగరంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి వచ్చారు. 1988లో సైంటిస్ట్‌గా మారి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం డీఆర్డీఓలోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎదురుదెబ్బలే తిరుగులేని విజయాలు... అగ్ని క్షిపణి ప్రయోగ సమయంలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు, వైఫల్యాలు వేధించాయి. అగ్ని మిస్సైల్ 2006లో తన ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె బృందం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆమె దీన్నో చాలెంజ్‌గా తీసుకొనివారాంతాలు సహా రోజుకు 16 గంటలు పని చేశారు. విజయం సాధించారు. హోమ్మేకర్గా, సైంటిస్ట్‌గా జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు. మతాంతర వివాహం దగ్గర్నుంచి మిస్సైల్ రీసెర్చ్ వర్క్ వరకు అన్నింట్లోనూ తన కుటుంబం మద్దతు మరువలేనిదంటారు టెస్సీ. ఆమే స్ఫూర్తి.. జీఈఎస్ సమయంలో తొలుత టెస్సీ గురించి నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. అది చూసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ఆనంద్ మహీంద్రా ‘మీట్ టెస్సీ థామస్. జీఈఎస్ 2017 స్పీకర్.మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా. దేశంలోనే మిస్సైల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ’ అంటూ ట్వీట్లో పరిచయం చేశారు. ప్రతిపాఠశాలలో ఆమె పోస్టర్‌ను ఉంచాలని, అది ఆడిపిల్లలకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. వెనుకడుగొద్దు... ‘ఇంటలిజెన్స్‌లో మహిళలు ఒకడుగు ముందే ఉంటారు. అయితే ఎమోషనల్ ఇంటలిజెన్స్ దగ్గరే వీరు ఇరుక్కుపోతారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు 3డీ (డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్) తప్పనిసరిగా ఉండాలి. సైంటిస్ట్‌గా కొనసాగాలంటే అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు. అంకితభావంతో ముందుకెళ్లాలి. ప్రపంచాన్ని ఫేస్ చేయండి.. రిస్క్ తీసుకోండి.. మీ పూర్తి సామర్థ్యాన్ని చూపండి’ అంటూ టెస్సీ జీఈఎస్ సదస్సులో సందేశమిచ్చారు. ఎన్నో అవార్డులు... ♦ డీఆర్డీఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2008 ♦ ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2009 ♦ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2011, 2012 ♦ లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ 2012 ♦ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ అచీవ్మెంట్ అవార్డు(సీఎన్ఎన్ ఐబీఎన్) 2012 -
డీఆర్డీవో మహిళా శాస్త్రవేత్తకు పద్మావతి వర్సిటీ డాక్టరేట్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): హైదరాబాద్లోనిరక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మహిళా శాస్త్రవేత్త, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్‌కు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో వైస్ చాన్స్‌లర్ ఎస్.రత్నకుమారి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకాక పోవడంతో వీసీనే చాన్స్‌లర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేశారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న టెస్సీ థామస్ మాట్లాడుతూ... దేశంలో నాణ్యమైన విద్యను అందించే అంశాన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు మౌలిక వసతులు, అధ్యాపకుల లేమి, పరిశోధకులకు ప్రోత్సాహం లేకపోవడం, ఉపాధి కల్పించలేకపోవడం తదితర సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. విద్యార్థులకు ఉపాధి పొందగలిగే సామర్థ్యాలను అందించాల్సిన బాధ్యత వీటిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.