ఆమెను చూస్తే మనుషులు ఇంత నిగర్వంగా కూడా ఉండగలరా?అనిపిస్తుంది. ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ అంటూ అందరూఆకాశానికెత్తినా, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నా ఆమెసాదాసీదాగానే ఉంటారు. ఇదెలా సాధ్యమని అడిగితే.. ‘నేను నా పనితో బిజీగా ఉంటాను. అంతే..’ అని చెబుతారు డాక్టర్ టెస్సీ థామస్. రక్షణ రంగంలో తొలి మహిళా సైంటిస్ట్‌గా పేరొందిన ఆమె... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లేడీ పురస్కారం అందుకున్నారు. ఈమె సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనం.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం.
సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఇటీవల జీఈఎస్ సదస్సు జరిగినప్పుడు అత్యధికులు ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటే... హాజరైన అతిరథ మహారథులు మాత్రం టెస్సీ థామస్ గురించి గొప్పగా చర్చించుకున్నారు. ఆమె ఉపన్యాసాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు మన దేశ రక్షణ రంగానికే ప్రతిష్టాత్మకమైన ‘అగ్ని’ క్షిపణి రూపకల్పలోనూ పాలుపంచుకున్న మహిళ ఆమె మాత్రమే కాబట్టి. అంతేనా.. సంప్రదాయంగా పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్న రంగమనే నమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఎందరికో రోల్ మోడలైన ఏపీజేఅబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పని చేశారు. మరి కొందరు మహిళలు కీలకమైన ఆయుధ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారంటే ఆమె అందించిన స్ఫూర్తి ఓ కారణం.
రాకెట్ వైపు.. నిలిచిన చూపు..
నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లను అల్లంత దూరం నుంచి చూసిన టెస్సీ... ఆ తర్వాత వాటితోనే తన జీవితాన్ని ముడివేసుకుంది. 1963లో కేరళలోని అల్లాపుఝా జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. ఇంటికి దగ్గర్లోని తుంబా స్పేస్ లాంచింగ్ స్టేషన్ నుంచి దూసుకుపోయే రాకెట్లను గమనిస్తూ పెరిగారు. పుణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో ఎంటెక్ పూర్తి చేసి, గైడెడ్ వెపన్ కోర్సు కోసం నగరంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి వచ్చారు. 1988లో సైంటిస్ట్‌గా మారి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం డీఆర్‌డీఓలోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఎదురుదెబ్బలే తిరుగులేని విజయాలు...
అగ్ని క్షిపణి ప్రయోగ సమయంలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు, వైఫల్యాలు వేధించాయి. అగ్ని మిస్‌సైల్ 2006లో తన ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె బృందం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆమె దీన్నో చాలెంజ్‌గా తీసుకొనివారాంతాలు సహా రోజుకు 16 గంటలు పని చేశారు. విజయం సాధించారు. హోమ్‌మేకర్‌గా, సైంటిస్ట్‌గా జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు. మతాంతర వివాహం దగ్గర్నుంచి మిస్‌సైల్ రీసెర్చ్ వర్క్ వరకు అన్నింట్లోనూ తన కుటుంబం మద్దతు మరువలేనిదంటారు టెస్సీ.
ఆమే స్ఫూర్తి..
జీఈఎస్ సమయంలో తొలుత టెస్సీ గురించి నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. అది చూసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ఆనంద్ మహీంద్రా ‘మీట్ టెస్సీ థామస్. జీఈఎస్ 2017 స్పీకర్.మిస్‌సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా. దేశంలోనే మిస్‌సైల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ’ అంటూ ట్వీట్‌లో పరిచయం చేశారు. ప్రతిపాఠశాలలో ఆమె పోస్టర్‌ను ఉంచాలని, అది ఆడిపిల్లలకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు.
వెనుకడుగొద్దు...
‘ఇంటలిజెన్స్‌లో మహిళలు ఒకడుగు ముందే ఉంటారు. అయితే ఎమోషనల్ ఇంటలిజెన్స్ దగ్గరే వీరు ఇరుక్కుపోతారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు 3డీ (డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్) తప్పనిసరిగా ఉండాలి. సైంటిస్ట్‌గా కొనసాగాలంటే అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు. అంకితభావంతో ముందుకెళ్లాలి. ప్రపంచాన్ని ఫేస్ చేయండి.. రిస్క్ తీసుకోండి.. మీ పూర్తి సామర్థ్యాన్ని చూపండి’ అంటూ టెస్సీ జీఈఎస్ సదస్సులో సందేశమిచ్చారు.
ఎన్నో అవార్డులు...
♦ డీఆర్‌డీఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2008
♦ ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2009
♦ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2011, 2012
♦ లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ 2012
♦ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు(సీఎన్‌ఎన్ ఐబీఎన్) 2012
Comments
Please login to add a commentAdd a comment