జకర్తా : సాదు జీవులైన కుక్కలను, పిల్లులను పెంచుకుంటే బాగానే ఉంటుంది. కానీ పాములు, మొసళ్లు, పులులు వంటి క్రూర మృగాలను పెంచుకుంటే చివరకూ వాటి చేతిలోనే బలి అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో జరిగింది. ముద్దుగా పెంచుకుంటున్న మొసలి యాజమానురాలినే చంపేసింది.
వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ఓ 44 ఏళ్ల మహిళా సైంటిస్ట్ తన ఇంటిలో ఓ మొసలిని పెంచుకుంటుంది. ప్రస్తుతం దాని పొడవు 14 అడుగులు. ఎంత బాగా చూసుకున్నప్పటికి దాని అసలు స్వభావం మారదు కదా. ఫలితం ఏముంది.. పాలు పోసి పెంచిన చేతినే కాటేసిందన్నట్లు ఆ మొసలి యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది. మరుసటి రోజు ఉదయం మహిళ ఇంటికి వచ్చిన సహోద్యోగులకు దారుణంగా గాయపడిన సైంటిస్ట్ మృతదేహం దర్శనమిచ్చింది. మొసలి సదరు మహిళ మీద దాడి చేసి ఒక చేతిని పూర్తిగా తినేయడమే కాక.. ఆమె ఉదర భాగాన్ని కూడా గుర్తించడానికి వీలు లేనంతగా గాయపర్చింది.
వెంటనే వారు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, ఆర్మీ, పోలీసులతో పాటు మరి కొంతమంది జనాల సాయంతో ఆ భారీ మొసలిని సదరు శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment