న్యూస్‌మేకర్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్‌ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?
పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.
నమ్మకం కోసం:
‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.
పెళ్లికి ముందు జాగ్రత్త
‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే.
ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్‌గా మారానని అంటోంది.
ఆధునిక పరికరాలు
ప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్‌లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్‌లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్‌మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.
పెళ్లికి సిద్ధమయ్యి...
అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్‌మెంట్, సహనం, అడ్జస్ట్‌మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్‌లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment