షిర్లాక్‌హోమ్స్‌ | Article On Delhi Detective Akriti Khatri | Sakshi
Sakshi News home page

షిర్లాక్‌హోమ్స్‌

Published Tue, Dec 24 2019 12:11 AM | Last Updated on Tue, Dec 24 2019 12:11 AM

Article On Delhi Detective Akriti Khatri - Sakshi

ఆకృతి ఖత్రి

ఢిల్లీ.. ఒక రోజు సాయంకాలం. ఇండియా గేట్‌ దగ్గరి గార్డెన్‌లో బెంచ్‌ మీద కూర్చొని ఏదో సీరియస్‌గా డిస్కస్‌ చేసుకుంటోంది ఓ యువ జంట. కాసేటికి సన్నగా పొడుగ్గా... నూనుగు మీసాలు, తల మీద క్యాప్, ఒక చేతి వేళ్ల మధ్య వేడి వేడి వేరుశనక్కాయల పొట్లాలు, ఇంకో చేతిలో చాయ్‌ ఫ్లాస్క్‌తో ‘చాయ్‌.. మూంగ్‌ఫలీ.. ఆ చాయ్‌.. ఎ మూంగ్‌ఫల్లే..’ అంటూ ఆ జంట ముందుకు వచ్చింది ఆ ఆకారం. పట్టించుకోనంత తీవ్రమైన చర్చలో ఉన్నారు  ఆ ఇద్దరూ. కాసేపు ఆ బెంచి వెనకాలే తచ్చాడి మళ్లీ  ‘ఆ చాయ్‌ భాయ్‌.. చాయ్‌.. దీదీ.. మూంగ్‌ఫలీ..’ అంటూ వాళ్ల ముందు మళ్లీ ప్రత్యక్షమైంది ఆ చాయ్‌వాలా ఆకారం. 

‘అరే.. వద్దు భాయ్‌.. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనీ..’ అంటూ చిరాకు పడ్డాడు  జంటలోని అతను. 
‘క్యా పరేషానీ హై భాయ్‌ ఆప్‌కో.. ’ అడిగింది ఆ ఆకారం కాస్త వంగి అతని ముఖంలోకి ముఖం పెడుతూ.
‘ఛల్‌ హఠ్..’ అని కోపగించుకుంటూ విసురుగా బెంచీ మీద నుంచి  లేచి... ఆ అమ్మాయి చెయ్యి అందుకొని అక్కడి నుంచి విసావిసా వెళ్లిపోయాడు అతను ఆ అమ్మాయితో.
వాళ్లు వెళ్తున్నవైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని బెంచి మీద ఫ్లాస్క్‌ను పెట్టి, పైజామా జేబులోంచి ఫోన్‌ తీసి ఎవరికో ఫోన్‌ చేసి... ‘ఆప్‌ సహీ హై మామ్‌’అని చెప్పి పెట్టేసింది ఆ ఆకారం.
ఆ చాయ్‌వాలా.. సారీ.. చాయ్‌వాలీ.. ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌.  పేరు ఆకృతి ఖత్రి. వయసు  ముప్పైఐదు లోపే. అందుకే దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళా డిటెక్టివ్‌ అనే పేరు తెచ్చుకుంది. అయిదేళ్ల కిందట ఢిల్లీలో  ‘వీనస్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ’ని ప్రారంభించింది. అపరాధ పరిశోధనలో అగ్రగణ్యుడు షెర్లాక్‌హోమ్స్‌ బాటను ఎంచుకున్న ఈ ఇండియన్‌ షిర్లాక్‌హోమ్స్‌  దేశరాజధానిలోనే పుట్టిపెరిగింది.  బీఎస్సీ (సైన్స్‌) గ్యాడ్యూయేట్, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ అయిన ఆకృతి ఈ ఫీల్డ్‌లోకి రావడం చాలా ఆసక్తికరం. 

ఎలాగంటే... 
ఏంబీఏలో ఉన్నప్పుడు పేపర్లో డిటెక్టివ్‌ ఉద్యోగ ప్రకటన చూసి సరదాగా దరఖాస్తు చేసింది ఆకృతి. సీరియస్‌గానే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ అయిపోయాక తర్వాత కాల్‌ చేస్తామని చెప్పి పంపించేశారు ఆమెను. ఎప్పుడో చూసిన ఒకట్రెండు డిటెక్టివ్‌ సినిమాలు తప్ప... అసలా వృత్తి ఎలా ఉంటుందో తెలియదు. అలాంటిది ఇంటర్వ్యూ బాగానే అటెండ్‌ చేశానని మనసులో తనకు తానే కితాబు ఇచ్చుకున్నంతసేపు పట్టలేదు వాళ్ల జవాబుతో నిరాశపడ్డానికి. ఇక అప్పటినుంచి వరసబెట్టి వార్తా పత్రికల్లో వాంటెడ్‌ కాలమ్‌ చూడ్డం మొదలుపెట్టింది. ఇంకొన్ని డిటెక్టివ్‌ ఏజన్సీలకూ అప్లయ్‌ చేసుకుంది. రెండో ఇంటర్వూ్యలో ‘రేపు వచ్చి కలవండి’అని చెప్పి పంపేశారు.

కాళ్లీడ్చుకుంటూ ఇంటికొచ్చిందో లేదో మొదటి ఇంటర్వ్యూ తాలూకు ఏజెన్సీ నుంచి ఫోన్‌ కాల్‌... ఉన్నపళంగా ఆఫీస్‌కొచ్చి కలవమని. అంతే పెంచిన టూ వీలర్‌ యాక్సలేటర్‌ను  ఢిల్లీ ఆ మూలన ఉన్న  ఆ ఆఫీస్‌ దగ్గరే ఆపేసింది. అంత ఉత్సాహం ఆమెలో. ‘తను పెళ్లిచేసుకోబోయే వరుడి ప్రవర్తన గురించి ఆరా తీయమని  ఓ అమ్మాయి ఒక అసైన్‌మెంట్‌ ఇచ్చింది. నువ్వు ఎలా ఇన్వెస్టిగేట్‌ చేస్తావో చెక్‌ లిస్ట్‌ రాసివ్వు’ అడిగాడు బాస్‌ ఆమె రావడంతోనే. అయిదు నిమిషాల్లో రాసిచ్చింది. మొహంలో మెరిసిన చిరునవ్వును ఆమెకు కనిపించనివ్వకుండా ‘ఓకే... ఈ రోజు నుంచి నీ ఇంటర్న్‌షిప్‌ మొదలు’ అని చెప్పి తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు బాస్‌. పిడికిలి బిగించి ‘యెస్‌’ అంది ఆమె సంతోషం. 

మొదట్లో ఖాళీగానే...
అయితే నెల రోజులు ఖాళీగానే కూర్చోబెట్టారు. విసుగుపుట్టిన ఆమె ఒకరోజు కోపంగా బాస్‌ క్యాబిన్‌లోకి వెళ్లి.. ‘ఏ పనీ లేకుండా ఇలా రికామీగా కూర్చోనే ఉద్యోగం నేను చేయలేను. ఇంత ఖాళీగా మా ఇంట్లో కూర్చున్నా దోమలనైనా చంపుకునేదాన్ని’ అంది. ‘నువ్వు ఖాళీగా ఏం లేవు. పరీక్షలో ఉన్నావ్‌. నీ సహనాన్ని టెస్ట్‌ చేస్తున్నాం’ చెప్పాడు బాస్‌ కూల్‌గా. ఆకృతి ఇంకోమాట మాట్లాడకుండానే వెంటనే అసైన్‌మెంట్‌ ఇచ్చాడు బాస్‌. జుట్టును క్యాప్‌లో దాచి.. మాసిపోయిన పైజామా.. వెలిసిపోయిన టీషర్ట్‌ వేసుకొని.. నూనుగు మీసాలు అతికించుకొని ఇండియా గేట్‌ దగ్గర చాయ్‌వాలా వేషం వేసి ఓ జంట డీప్‌ డిస్కషన్‌ను డిస్టర్బ్‌ చేసిందే... అదే తన తొలి అసైన్‌మెంట్‌. అప్పగించిన రెండు రోజుల్లోనే వరుడు మోసగాడు అని తేల్చి వివరాల కవరును అమ్మాయి చేతిలో పెట్టేసింది. 

వీనస్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ
మొదటి కేస్‌లోనే విజయం సాధించిన ఆకృతి... ఒకవైపు ఏంబీఏ చేస్తూనే ఇంకో వైపు ఈ ఉద్యోగంలో బిజీ అయిపోయింది. చదువు అయిపోయేనాటికి ఇన్వెస్టిగేషన్‌ ఫీల్డ్‌లో ఓ మోస్తరు పేరూ సంపాదించుకుంది. కేవలం పెళ్లి సంబంధాలు, వివాహ బంధాల అంశాల్లోనే కాక కార్పొరెట్‌ ఇష్యూస్‌ అయిన బ్రాండ్‌ కాపీరైట్స్, ట్రేడ్‌ మార్క్స్‌ నుంచి హానీ ట్రాప్, లేబర్‌ కోర్ట్‌కేసులు, మోసం, భూ తగాదాలు వంటి విషయాల్లో కూడా పరిశోధన చేసి విజయవంతం అయింది. ఈ క్రమంలోనే తన బాస్‌తో కొంచెం మాటపట్టింపు వచ్చి ఆ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చేసింది. 2014లో వీనస్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ పేరుతో సొంతంగా ఏజెన్సీని స్థాపించింది. మొదట్లో తన టాస్క్‌ను ఢిల్లీ వరకే పరిమితం చేసుకున్నా తర్వాతర్వాత ముంబై, పుణె, చండీగఢ్, జైపూర్‌లతోపాటు హైదరాబాద్‌లోనూ తన పరిశోధనా సేవలను అందిస్తోంది... కొందరు ఫ్రీలాన్సర్స్‌ను నియమించి. తన ఏజెన్సీలో 75 మంది వరకు ఉద్యోగులున్నారు. వీళ్లలో మహిళలే ఎక్కువ. 

ఇదీ ఓ పనేనా? 
‘మన దగ్గర లేడీ డిటెక్టివ్‌లు ఎక్కువగా లేరు. మామూలుగానే స్కూళ్లకు, కాలేజ్‌లకు, ఆఫీస్‌లకు వెళ్లిన ఆమ్మాయిలు సురక్షితంగా ఇళ్లకు తిరిగొచ్చే పరిస్థితి లేదు. అలాంటిది చాలా రిస్క్, ఎంతో ప్రమాదంతో కూడిన ఇలాంటి ఫీల్డ్‌లోకి అమ్మాయిలను పంపేందుకు ఏ తల్లిదండ్రులు ఇష్టపడ్తారు? అయినా నాలాంటి వాళ్లు ఉత్సాహపడ్తూనే ఉంటారు జీవితంలో ఏదో సాహసం చేయాలని (నవ్వుతూ). అలాంటి వాళ్లకు ఒకటే సలహా... ముందు మీ చదువు పూర్తి చేసుకోండి. తర్వాతే ఈ ఫీల్డ్‌లోకి రండి. దీనికి కావల్సిన అర్హత... సూక్షా్మన్ని గ్రహించడం,  ఆత్మవిశ్వాసం. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడం. ఇదీ ఒక పనేనా అని వెక్కిరించేవాళ్లూ ఉంటారు. నవ్వుతూ మన పని మనం చేసుకుపోవడమే’ అంటుంది ఆకృతి ఖత్రి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement