ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. సాంకేతిక లోపాలు, ప్రయాణికుల చేష్టలు, ఎమర్జెన్సీ ల్యాండిగ్ వంటి వివిధ తప్పిదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా తన కుటుంబంతో కలిసి సంతోషంగా ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు ఎయిర్ ఇండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. రూ. 4.50 లక్షలు పెట్టి టికెట్లు కొని ప్రయాణిస్తే.. విమానయాన సంస్థ సౌకర్యాలు చూసి షాకైంది. తనకు ఎదరైన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.
ఇటీవల శ్రేతి గార్గ్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ నుంచి టొరొంటోకు ఎయిర్ ఇండియా విమానంలో బయలు దేరింది. తన ప్రయాణంలో ఆమె అనేక సమస్యలను ఎదుర్కొంది. తమకు కేటాయించిన సీట్ల హ్యాండిల్స్ విరిగిపోయి వైర్లు బయటకి వచ్చి ఉన్నాయని, ఎదురుగా ఉన్న స్క్రీన్లు సైతం పని చేయలేదని తెలిపింది. సిబ్బంది వాటిని రీబూట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది.
ఇవన్నీ చాలవన్నట్టు ఓవర్ హెడ్ లైట్లు పని చేయలేదు. దీంతో ఆమె తన చిన్నారులతో చీకట్లో గడపాల్సి వచ్చింది. వెలుతురు కోసం తన ఫోన్ టార్చ్‌లైట్‌ను ఉపయోగించింది. అయితే టిక్కెట్ల కోసం రూ.4.5 లక్షలు చెల్లించినప్పటికీ, నాసిరకం సేవలు అందించడంపై సదరు మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
‘ఎయిర్ ఇండియాలో ముందుగానే టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రయాణికుల జర్నీని సాఫీగా సాగేలా చేయకుండా.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మాలాంటి తల్లిదండ్రులకు అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేశారు. తెగిన వైర్ల కారణంగా మా చిన్నారుల రక్షణపై ఆందోళన చెందాం. ఈ జర్నీ మాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ’ అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మూడు మిలియన్ల వ్యూస్ లభించాయి. ఆమె పోస్ట్‌పై ఎయిర్ ఇండియా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment