ఇంతవరకు సైబర్ నేరస్తులు ఏదో ఒక ఎర వేసి లేదా ఆశ చూపో వారి ట్రాప్‌లోకి దించి డబ్బులు దుండుకునేవారు. అదీ కుదరకపోతే ఏకంగా అత్యున్నత హోదా అధికారి పేరు చెప్పి ట్రాప్ చేసేవారు. ఇక వాటన్నింటిని అధిగమించి కొత్త తరహాలో నేరాలకు తెగబడుతున్నారు. అందుకోసం ఆయా వ్యక్తుల నేపథ్యం గురించి తెలుసుకుని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. అచ్చం అలానే ఓ కుటుంబం రూ. 4 లక్షలు పొగొట్టుకుంది.
వివరాల్లోకెళ్తే..ఉత్తర ఢిల్లీలోని ఓ కుటుంబం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. 29 ఏళ్ల గుర్సిమ్రాన్ సింగ్ ఈ విషయమై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వ్యక్తి తన తల్లికి ఓ అంతర్జాతీయ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపాడు. వారి బంధువు నౌనిహాల్ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు అతడి పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఆ కుటంబాన్ని దోచుకున్నారు. ఓ రోజు తన తల్లికి నౌనిహాల్ సింగ్ అని పరిచయం చేసుకుంటూ ఓ కాల్ వచ్చింది.
అతడు తమ బంధువే కదా అని అతడి తల్లి ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిరోజుల అనంతరం నైనిహాల్ స్నేహితులందరూ జైల్లో ఉన్నారని, వారంతా ఓ వ్యక్తితో గొడపడ్డట్టు చెప్పుకొచ్చాడు. నైనిహాల్ మాత్రమే బయటే ఉన్నట్లు తెలిపాడు. కేసు గురించి మరింతగా విచారించడానికి ఒక న్యాయవాది ఆమెను పిలుస్తారని అతను తన తల్లికి చెప్పాడని పోలీసులకు వెల్లడించాడు. కొద్ది వ్యవధిలోనే ఓ న్యాయవాది ఫోన్ చేసి నౌనిహాల్‌ని జైలుకు పంపారని, బెయిల్ పొందడానికి పోలీసులకు డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు. చెల్లించకపోతే సుమారు 15 నుంచి 20 ఏళ్ల వరకు కటకటాల్లోనే ఉంటాడని చెప్పాడు.
పైగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు రాంచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి సంబంధించి విక్రమ్ కుమార్ ముండా పేరిట ఉన్న ఖాతా నెంబర్‌ను ఇచ్చాడు. మొదట రెండు లక్షలు అని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు రూ. 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ కుటుంబం విడతలు వారీగా ఆర్టీజీఎస్ ద్వారా నగదును అతడిచ్చిన ఖాతా నెంబర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువుల్ని విచారించగా..నౌనిహాల్ క్షేమంగా ఉన్నాడని, తనపై అతడి స్నేహితులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
తాము సైబర్ మోసానికి బలయ్యినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్సిమ్రాన్ సింగ్ పేర్కొన్నాడు. ఉత్తర ఢిల్లీకి చెందిన మరో కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసేందుకు యత్నించి నేరగాళ్లు విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఆ కేసులో కూడా..ఆ కుటుంబానికి కెనడాలో బంధువులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మీ బంధువులు జైలులో ఉన్నారని వారిని బెయిల్‌పై విడుదల చేయడానికి డబ్బు అవసరమంటూ ట్రాప్ చేసేందుకు యత్నించారు. అయితే వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి ఎంక్వైయిరీ చేస్తే అది నకిలీ ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment