న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి.
మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment