న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ సందర్బంగా కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.
‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.
పీఎంఎల్‌ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment