న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ పేర్కొంది. కనీసం రాజ్యాంగపరమైన లేదా చట్టబద్దమైన హక్కు కూడా కాదని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్ మంజూరు కాలేదని తెలిపింది. తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు పంపడం జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడింది.
అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది.
అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment