న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు.
మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి.
‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు.
‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్‌నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు.
తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్‌లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment