క్వీన్స్‌లండ్, ఆస్ట్రేలియన్ బుష్‌లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.
కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్‌ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.
అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.
అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.
అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.
మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.
మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.
ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment