భర్తతో భావనా- కోహ్లితో చిన్ననాటి ఫొటో (PC: bhawna dhingra instagram)
Who Is Bhawna Kohli Dhingra, The Only Sister Of Virat Kohli: విరాట్ కోహ్లి.. ఈ పేరు వినగానే రికార్డులే గుర్తుకువస్తాయి. ఆధునిక ప్రపంచ క్రికెట్‌లో మకుటం లేని మహరాజుగా కొనసాగుతున్న రన్‌మెషీన్ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. బ్యాట్ చేతబట్టి రికార్డుల అంతు తేల్చేందుకు సిద్ధమైన వేటగాడిలా రంగంలోకి దూకిన ఆటగాడు స్ఫురణకు వస్తాడు.
మరి.. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో పెరిగిన ఆ కుర్రాడు టీమిండియా రికార్డుల రారాజుగా ఎదిగేందుకు దోహదం చేసిన అంశాలేమిటి అంటే?.. ఆట పట్ల అంకితభావం, అసాధారణ ప్రతిభాపాటవాలు.. 35 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించే ఫిట్‌నెస్.. అభిమానుల నుంచి వచ్చే సమాధానాలు ఇవే.
అవును ఇవన్నీ నిజమే.. అయితే, అన్నిటికి మించి చిన్ననాటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా కోహ్లిని ప్రోత్సహించిన కుటుంబానికే ఈ జాబితాలో పెద్దపీట వేయాల్సి ఉంటుంది. కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. భావనా, వికాస్, విరాట్. అందరిలో భావనా పెద్దది.. విరాట్ చిన్నోడు.
PC: bhawna dhingra instagram
తమ్ముడితో పాటు క్రికెట్
ఇద్దరు తమ్ముళ్లపై ఆ అక్కకు ప్రేమ ఎక్కువే. అయితే, చిన్నోడు కాబట్టి విరాట్ అంటే మరింత ఇష్టం. మూడేళ్లకే క్రికెట్ బ్యాట్ చేతబట్టి తండ్రి బౌలింగ్‌లో ముద్దుముద్దుగా విరాట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే కుటుంబమంతా సంతోషపడిపోయేది. భావనా అయితే మరీనూ!! విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.
కొడుకును క్రికెటర్‌గా చూడాలనుకున్న తల్లిదండ్రుల నిర్ణయం కోహ్లి కెరీర్‌ను మలుపుతిప్పగా.. తోబుట్టువుగా తానేం చేయాలో అన్నీ చేసింది భావనా. తమ్ముడికి ఎల్లవేళ్లలా.. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత నైతికంగా మద్దతుగా నిలిచింది.
కోహ్లి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినప్పటికీ.. తల్లికి మద్దతుగా నిలుస్తూ తమ్ముడి గురించి అన్ని విషయాల్లో శ్రద్ధ వహించేది. తన తమ్ముడు రికార్డుల రారాజుగా ఎదిగినా తనకు మాత్రం ఇప్పటికీ చిన్నపిల్లాడే అని మురిసిపోతూ ఉంటుంది భావనా.
కోహ్లిల ఏకైక ఆడపడుచు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తల్లిదండ్రులతో తమ చిన్ననాటి ఫొటోలు పంచుకుంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాము మనుషులుగా దూరంగా ఉంటున్నా తమ మనసులు మాత్రం దగ్గరే అంటూ సందర్భాన్ని బట్టి ఇద్దరు తమ్ముళ్ల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటుంది.
ఇక వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కూడా విరాట్ కోహ్లిని అనునయిస్తూ.. గెలిచినా ఓడినా అభిమానులంతా టీమిండియా వెంటే అంటే సందేశం ఇచ్చింది భావనా. ఈ నేపథ్యంలో వార్తల్లో నిలిచిన భావనా గురించి నెట్టింట ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువైంది.
వ్యాపారవేత్తతో వివాహం
చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ ఉన్న భావనా ఢిల్లీలోని హన్స్‌రాజ్ మోడల్ స్కూళ్లో పాఠశాల విద్య పూర్తి చేసుకుంది. దౌలత్ రామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇక కోహ్లిల ఆడపడుచు అయిన భావనా వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను పెళ్లాడి.. భావనా కోహ్లి ధింగ్రాగా మారింది.
ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ రాణిస్తోంది. విరాట్ కోహ్లి ఫ్యాషన్ లేబుల్ వన్8సెలక్ట్‌తో భావనా కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. కేవలం విరాట్‌తోనే కాకుండా అతడి భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతోనూ ఆమెకు మంచి అనుబంధం ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.
అన్నట్లు భావనా- సంజయ్ దంపతులకు మెహక్ , ఆయుష్ సంతానం. మేనమామ విరాట్ కోహ్లి రిసెప్షన్ సందర్భంగా వీళ్లిద్దరు అప్పట్లో ఫొటోలకు ఫోజులిచ్చారు.
చదవండి: వరల్డ్‌కప్-2023 తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అభిమానులు ఖుషీ!
Comments
Please login to add a commentAdd a comment