investigation agency
-
వివాహాల గూఢచారి...భావనా పాలివాల్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్‌ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.నమ్మకం కోసం:‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.పెళ్లికి ముందు జాగ్రత్త‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే. ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్‌గా మారానని అంటోంది.ఆధునిక పరికరాలుప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్‌లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.పెళ్లికి సిద్ధమయ్యి...అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్మెంట్, సహనం, అడ్జస్ట్మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది. -
ఈసీ అసహనం.. దర్యాప్తు సంస్థలపై సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల వైఫల్యంతోనే మునుగోడు ఉపఎన్నికలో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలా అయితే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఎన్నికల్లో అక్రమాలను నిర్మూలించగలమని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్‌లో 27 కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర పోలీసు, ఆబ్కారీ శాఖలపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఆబ్కారీ శాఖ పట్టుకున్న మద్యాన్నే పోలీసు శాఖ పట్టుకున్నట్లు చూపడంపట్ల అభ్యంతరం తెలిపింది. మద్యం, గంజాయి అక్రమ రవాణా నియంత్రణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. చదవండి: స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు ఇకపై గట్టి నిఘా పెట్టాలి: ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ కట్టడికి గట్టి నిఘా పెట్టాలని ఐటీ శాఖ, స్టేట్ జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ఈసీ బృందం సూచించింది. డిజిటల్ లావాదేవీలను ఐటీ పరిధిలోకి తేవాలని...ఈ–వే బిల్లుల ఆధారంగా సరుకు రవాణాపై నిఘా పెట్టి కానుకల పంపిణీని అడ్డుకోవాలని, కాలం చెల్లిన వాహనాలు సీజ్ చేయాలని కోరింది. ఈ భేటీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తోపాటు రాష్ట్ర పోలీసు శాఖ, కేంద్ర సాయుధ బలగాల నోడ ల్ అధికారి, ఆబ్కారీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్బీఐ, కస్టమ్స్, ఎస్జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్సీబీ, ఈడీ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్నారు
కోల్‌కతా: కొందరు నేతలు విద్వేష రాజకీయాలతో దేశాన్ని విభజించే కుట్రలకు తెరతీశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వారి కుట్రలను సాగనివ్వను. ఈ పోరాటంలో ప్రాణాలనైనా అర్పిస్తా’’ అని శనివారం కోల్‌కతాలో ఈద్ నమాజ్ సందర్భంగా ఆమె అన్నారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అయినా తలవంచే ప్రసక్తే లేదు’ అన్నారు. ‘‘ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం. ఒక్కటిగా ఓటేసి బీజేపీని గద్దె దింపుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం విఫలమైతే అంతా అయిపోయినట్లే’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలపై ఈ సందర్భంగా మమత విమర్శలు గుప్పించారు. -
కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ఏప్రిల్ 5న విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా వాడుకుంటోందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 5వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, టీఎంసీ, ఎన్సీపీ, జేఎంఎం, జేడీయూ, సీపీఎం ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం వాదనలు వింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలపై ఉన్నవేనని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి తెలిపారు. -
ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం!
రాష్ట్రంలో పోటాపోటీ దాడులు, తనిఖీలు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల జోరుతో ఈ ఏడాది హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు లక్ష్యంగా కేసులు, విచార ణలు, నోటీసులు కలకలం రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకునపెట్టేలా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు తెరపైకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులు టార్గెట్‌గా లిక్కర్ స్కాం, ఐటీ, ఈడీ దాడులు రాజకీయ వేడిని రగిలించాయి. మొత్తంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపరంగా పెద్ద సమస్యలేవీ ఎదురుకాలేదు. తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దేశంలో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఉగ్ర లింకులు బయటికి రావడం గమనార్హం. 2022లో రాష్ట్రంలో పోలీసు, దర్యాప్తు విభాగాల పరిధిలో జరిగిన ప్రధాన ఘటనలు, అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం.. – సాక్షి, హైదరాబాద్ మంటలు రేపుతున్న లిక్కర్ స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు తెలంగాణలో బయటపడటం ఈ ఏడాది సంచలన కేసులలో ఒకటిగా నిలిచింది. ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. డిసెంబర్ తొలివారంలో కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వడం, తర్వాత హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి విచారించడం చర్చనీయాంశంగా మారింది. కవితకు దగ్గరి వ్యక్తిగా ప్రచారమున్న అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’తో గరంగరం నలుగురు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో బేరసారాలు జరుగుతున్న సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బీజేపీ తరఫున డీల్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్తున్న ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేయడం, బీఆర్ఎస్ నేతల ప్రతి సవాళ్లు, ఆరోపణలు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయగా.. అధికారులు కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసు నిందితులతో సంబంధాలున్న జగ్గు స్వామి, తుషార్, మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వరుస విచారణలు, మలుపులతో ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా.. సీసీసీ తెలంగాణ పోలీసుల రోజువారీ ఆపరేషన్స్‌లో సాంకేతికంగా కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది ఆగస్టు 5న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డిసెంబర్ 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘తెలంగాణ పోలీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ సైబర్ సేఫ్టీ విభాగంతో రాష్ట్ర పోలీసులు సైబర్ నేర పరిశోధనలో కీలక అడుగు వేసినట్టయింది. పెరిగిన ‘మత్తు’.. కట్టడికి పోలీసుల పైఎత్తు.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగిన విషయం ఈ ఏడాది పలు ఘటనల్లో బయటపడింది. ఏప్రిల్ 2న రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలున్నట్టు గుర్తించడం సంచలనం సృష్టించింది. పెరిగిన డ్రగ్స్, గంజాయి వంటివాటి వినియోగానికి అడ్డుకట్ట వేసి యువతను కాపాడాలన్న లక్ష్యంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ పోలీసు, ఎౖMð్సజ్‌శాఖ ఉన్నతాధికారులతో జనవరి 27న సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల కట్టడికి నార్కోటిక్స్ వింగ్‌ల ఏర్పాటుతోపాటు ఇటీవల ఆ విభాగాల బలోపేతానికి సిబ్బందిని కేటాయించారు. మరోవైపు రాష్ట్రంలో పోలీసు శాఖ బలోపేతం కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశారు. నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ సోదాలు.. ఈడీ దాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులపై ఈ ఏడాది ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. గ్రానైట్ తవ్వకాల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో ఈడీ అధికారులు నవంబర్ 9న కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువుల నివాసాలు, పలు గ్రానైట్ కంపెనీల ఆఫీసులలో సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈడీ సోదాలు, తనిఖీల దూకుడు పెరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. 65 ఐటీ బృందాల సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఓవైపు.. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లలో పరస్పర కేసులు మరోవైపు హాట్‌హాట్‌గా కొనసాగాయి. అగ్నికి ప్రాణాలు ఆహుతి.. ఈ ఏడాది సెప్టెంబర్ 12న సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 16న మంచిర్యాల జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. లొంగుబాటలో మావోయిస్టులు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో ఈ ఏడాది సైతం పోలీసులు తమ పట్టు నిలుపుకొన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు మాధవి హడ్మే అలియాస్ సావిత్రి సెప్టెంబర్ 21న డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్కతోపాటు మరికొందరు కూడా లొంగిపోనున్నారు. కలకలం రేపిన పీఎఫ్ఐ లింకులు ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ మరోకేసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించినది. మత ఘర్షణలను ప్రేరేపించేలా ఓ వర్గం యువతకు శిక్షణ ఇస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో గుర్తించిన నిజామాబాద్ పోలీసులు.. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తులు ఖదీర్, షాదుల్లా సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆగస్టు 26న మరోకేసు నమోదు చేసింది. తర్వాత ఎన్ఐఏ దేశవ్యాప్తంగా వరుస సోదాలు, అరెస్టులు చేపట్టడం కలకలం సృష్టించింది. -
జమాతె ఆస్తులు సీల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) సీల్ వేసింది. బారాముల్లా, బందిపొరా, గందేర్బల్, కుప్వారా జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఈ ఆస్తుల్లోకి ప్రవేశించడానికి గానీ, ఎవరూ వినియోగించుకోవడానికి ఇక వీలుండదని అధికారులు తెలిపారు. జేఈఐ తన నిధులను వేర్పాటు వాద కార్యకలాపాల కోసం, జాతి వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జేఈఐకి సుమారు 188 ఆస్తులున్నట్లు ఎస్ఐఏ గుర్తించింది. వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటోంది. -
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
మోసాల్లో బ్యాం‘కింగ్స్’!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఆర్థిక నేరగాళ్లకు దోచిపెట్టడంలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహారం సంచలనం రేపుతోంది. బ్యాంకుల్లో మేనేజర్లుగా, ఆపై స్థాయిలో పనిచేసే కొందరు అధికారుల అవినీతి ఎంతటి స్థాయిలో ఉందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) నమోదు చేసిన బ్యాంకు మోసాల కేసుల్లో 75 శాతం వారి ప్రమేయం ఉన్నవే ఉండటం గమనార్హం. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. చేప పిల్లల పెంపకం, అమ్మకాల వ్యాపారం పేరుతో ఓ సంస్థ రూ. 6 కోట్లకుపైగా కొల్లగొట్టిన అభియోగాలపై కంపెనీ యజమాని, డైరెక్టర్లు సహా యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. కంపెనీ సమర్పించిన నకిలీ పత్రాలపై రూ. 6 కోట్లు లోన్ మంజూరు చేసి కమిషన్ తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. చేప పిల్లలు కాదు కదా.. కనీసం అక్కడ చేపల పెంపకానికి సంబంధించి చెరువు కూడా లేకపోవడం సంచలనం రేపింది. ఏకంగా రూ. 200 కోట్లు... హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ ఫైనాన్స్ లిమిటెడ్, వరుణ్ ఫైనాన్స్ బాధ్యులు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 200 కోట్ల రుణం పొందారు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్ అధికారుల పాత్రపై సీఐడీ విచారణ సాగిస్తోంది. కంపెనీ సమర్పించిన పత్రాలు అసలైనవా కాదా అని ధ్రువీకరించుకోకుండా లోన్లు జారీ చేసిన బ్యాంకు అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐ పరిశ్రమ భవన్‌లోనూ.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్బీఐ పరిశ్రమ భవన్ బ్రాంచీ మేనేజర్ నవీన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు రూ. 4 కోట్ల మేర రుణం మంజూరు చేశారు. సంస్థ సమర్పించిన బ్యాలెన్స్‌షీట్, కోలాటరల్ ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ధ్రువీకరించుకోకుండానే మేనేజర్ ఈ రుణం ఇచ్చారు. ఎస్బీఐ అంతర్గత ఆడిటింగ్‌లో కుట్ర బయటపడటంతో బ్యాంకు అధికా రులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 64 కోట్లకుపైగా ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేసిన నిందితులకు పలువురు బ్యాంక్ మేనేజర్లే సహకరించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విభాగాల్లో 75 శాతం కేసులు అవే... ఇప్పటివరకు సీఐడీ దగ్గర నమోదై దర్యాప్తు దశలో ఉన్న 107 కేసుల్లో 68 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సీబీ ఐ నమోదు చేసిన 17 ఎఫ్ఐఆర్లలో 9 కేసులు బ్యాంక్ చీటింగ్ కేసులే. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా సీసీఎస్ పో లీసులు ఈ తరహా మోసాలపై నమోదు చేసిన కేసులు వందల్లోనే ఉన్నాయి. ఇలా ఏ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మేర సొమ్మును బ్యాంక్ అధికారుల అవినీతి వల్ల దోచేసినట్టు సీఐడీ అంచనా వ్యక్తం చేసింది. కనిపించని సైబర్ నేరాల్లో రూ. కోట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తయితే... కళ్ల ముందు జరుగుతున్న ఆర్థిక నేరాల నియంత్రణలో కొందరు బ్యాంకు అధికారులే సూత్రధారులు కావడం ఆందోళన రేకేత్తిస్తోంది. -
‘ఆ మర్మాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేము’
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి. వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది. శత్రుదేశాల పనికాదు! వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం. కొత్తగా ఏముందంటే.. శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది. -
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్‌వీర్ షేర్గిల్ -
దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లోకి చొరబడవచ్చు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్‌నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్‌లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు. -
‘శ్రీదేవిని ప్లాన్ ప్రకారమే హత్య చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెంది మూడు నెలలు కావస్తున్నా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మరణించారు. మొదట శ్రీదేవి గుండెపోటుతో చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల ఆమె చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన వేద్ భూషణ్ అనే మాజీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదేవి మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆయన అన్నారు. బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువని, అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను పథకం ప్రకారం చంపేశారని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దుబాయ్ డాక్టర్లు ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదికపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఏసీపీగా రిటైర్డ్ అయి ప్రస్తుతం డిల్లీలో ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నడుపుతున్న వేద్ భూషణ్ శ్రీదేవి మృతి చెందిన హోటల్‌కు కూడా వెళ్లారని, కానీ శ్రీదేవి మృతి చెందిన గదిలో సిబ్బంది అనుమతించలేదని ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీంతో అదే హోటల్లో వేరొక గదిలో ఉన్న ఆయన, శ్రీదేవి మరణానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేసినట్టు తెలిపింది. కాగా, ఇదివరకే శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించారని సందేహం వ్యక్తం చేస్తూ.. స్వతంత్ర విచారణ చేపట్టాలని సునీల్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ మాత్రం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోలేమని దీపక్ మీశ్రా పేర్కొన్నారు.