న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు.
వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు.
స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి..
ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment