సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల వైఫల్యంతోనే మునుగోడు ఉపఎన్నికలో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలా అయితే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఎన్నికల్లో అక్రమాలను నిర్మూలించగలమని స్పష్టం చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్‌లో 27 కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర పోలీసు, ఆబ్కారీ శాఖలపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఆబ్కారీ శాఖ పట్టుకున్న మద్యాన్నే పోలీసు శాఖ పట్టుకున్నట్లు చూపడంపట్ల అభ్యంతరం తెలిపింది. మద్యం, గంజాయి అక్రమ రవాణా నియంత్రణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది.
చదవండి: స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
ఇకపై గట్టి నిఘా పెట్టాలి: ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ కట్టడికి గట్టి నిఘా పెట్టాలని ఐటీ శాఖ, స్టేట్ జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ఈసీ బృందం సూచించింది. డిజిటల్ లావాదేవీలను ఐటీ పరిధిలోకి తేవాలని...ఈ–వే బిల్లుల ఆధారంగా సరుకు రవాణాపై నిఘా పెట్టి కానుకల పంపిణీని అడ్డుకోవాలని, కాలం చెల్లిన వాహనాలు సీజ్ చేయాలని కోరింది.
ఈ భేటీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తోపాటు రాష్ట్ర పోలీసు శాఖ, కేంద్ర సాయుధ బలగాల నోడ ల్ అధికారి, ఆబ్కారీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్బీఐ, కస్టమ్స్, ఎస్జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్సీబీ, ఈడీ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment