
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి.
వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది.
శత్రుదేశాల పనికాదు!
వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం.
కొత్తగా ఏముందంటే..
శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్‌వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది.