రాష్ట్రంలో పోటాపోటీ దాడులు, తనిఖీలు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల జోరుతో ఈ ఏడాది హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు లక్ష్యంగా కేసులు, విచార ణలు, నోటీసులు కలకలం రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకునపెట్టేలా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు తెరపైకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులు టార్గెట్‌గా లిక్కర్ స్కాం, ఐటీ, ఈడీ దాడులు రాజకీయ వేడిని రగిలించాయి.
మొత్తంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపరంగా పెద్ద సమస్యలేవీ ఎదురుకాలేదు. తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దేశంలో పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఉగ్ర లింకులు బయటికి రావడం గమనార్హం. 2022లో రాష్ట్రంలో పోలీసు, దర్యాప్తు విభాగాల పరిధిలో జరిగిన ప్రధాన ఘటనలు, అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం..
– సాక్షి, హైదరాబాద్
మంటలు రేపుతున్న లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు తెలంగాణలో బయటపడటం ఈ ఏడాది సంచలన కేసులలో ఒకటిగా నిలిచింది. ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. డిసెంబర్ తొలివారంలో కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వడం, తర్వాత హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి విచారించడం చర్చనీయాంశంగా మారింది. కవితకు దగ్గరి వ్యక్తిగా ప్రచారమున్న అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.
‘ఎమ్మెల్యేలకు ఎర’తో గరంగరం
నలుగురు బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో బేరసారాలు జరుగుతున్న సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు.
బీజేపీ తరఫున డీల్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్తున్న ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేయడం, బీఆర్‌ఎస్ నేతల ప్రతి సవాళ్లు, ఆరోపణలు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయగా.. అధికారులు కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసు నిందితులతో సంబంధాలున్న జగ్గు స్వామి, తుషార్, మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వరుస విచారణలు, మలుపులతో ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది.
చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా.. సీసీసీ
తెలంగాణ పోలీసుల రోజువారీ ఆపరేషన్స్‌లో సాంకేతికంగా కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది ఆగస్టు 5న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డిసెంబర్ 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘తెలంగాణ పోలీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ సైబర్ సేఫ్టీ విభాగంతో రాష్ట్ర పోలీసులు సైబర్ నేర పరిశోధనలో కీలక అడుగు వేసినట్టయింది.
పెరిగిన ‘మత్తు’.. కట్టడికి పోలీసుల పైఎత్తు..
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగిన విషయం ఈ ఏడాది పలు ఘటనల్లో బయటపడింది. ఏప్రిల్ 2న రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలున్నట్టు గుర్తించడం సంచలనం సృష్టించింది. పెరిగిన డ్రగ్స్, గంజాయి వంటివాటి వినియోగానికి అడ్డుకట్ట వేసి యువతను కాపాడాలన్న లక్ష్యంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ పోలీసు, ఎౖMð్సజ్‌శాఖ ఉన్నతాధికారులతో జనవరి 27న సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల కట్టడికి నార్కోటిక్స్ వింగ్‌ల ఏర్పాటుతోపాటు ఇటీవల ఆ విభాగాల బలోపేతానికి సిబ్బందిని కేటాయించారు. మరోవైపు రాష్ట్రంలో పోలీసు శాఖ బలోపేతం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశారు. నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది.
ఐటీ సోదాలు.. ఈడీ దాడులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులపై ఈ ఏడాది ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. గ్రానైట్ తవ్వకాల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో ఈడీ అధికారులు నవంబర్ 9న కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువుల నివాసాలు, పలు గ్రానైట్ కంపెనీల ఆఫీసులలో సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈడీ సోదాలు, తనిఖీల దూకుడు పెరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగింది.
నవంబర్ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. 65 ఐటీ బృందాల సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఓవైపు.. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లలో పరస్పర కేసులు మరోవైపు హాట్‌హాట్‌గా కొనసాగాయి.
అగ్నికి ప్రాణాలు ఆహుతి..
ఈ ఏడాది సెప్టెంబర్ 12న సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 16న మంచిర్యాల జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
లొంగుబాటలో మావోయిస్టులు
మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో ఈ ఏడాది సైతం పోలీసులు తమ పట్టు నిలుపుకొన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు మాధవి హడ్మే అలియాస్ సావిత్రి సెప్టెంబర్ 21న డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్కతోపాటు మరికొందరు కూడా లొంగిపోనున్నారు.
కలకలం రేపిన పీఎఫ్‌ఐ లింకులు
ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ మరోకేసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి సంబంధించినది. మత ఘర్షణలను ప్రేరేపించేలా ఓ వర్గం యువతకు శిక్షణ ఇస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో గుర్తించిన నిజామాబాద్ పోలీసులు.. పీఎఫ్‌ఐకి చెందిన కీలక వ్యక్తులు ఖదీర్, షాదుల్లా సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆగస్టు 26న మరోకేసు నమోదు చేసింది. తర్వాత ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా వరుస సోదాలు, అరెస్టులు చేపట్టడం కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment