ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) పేరు వినగానే త్రివేణి సంగమం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ఆనందభవన్ గుర్తు వస్తుంది. గూగుల్‌లో వెతికితే అలహాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో ఆజాద్ పార్క్ కనిపిస్తుంది. టూర్ ప్లాన్‌లో పార్కులెందుకు, టైమ్ వేస్ట్ అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆజాద్ పార్కును చూసి తీరాలి.
నగరం మధ్యలో 133 ఎకరాల విశాలమైన పార్కు, పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. వాహనాల రణగొణ ధ్వనులు వినిపంచనంత ప్రశాంత వాతావరణం అలరించి తీరుతుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కళ్లు చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ కోసం వెతుకుతాయి. ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారీ, ఆజాద్ అనేది ఆయన బిరుదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశమే ఈ పార్కు.
చదువరుల పార్కు
ఆజాద్ పార్క్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైంది. అప్పుడు దాని పేరు ఆల్ఫ్రెడ్ పార్క్. జాతీయోద్యమవాదులు ఈ పార్కులో తలదాచుకుని ఉద్యమవ్యూహాలు రచించేవారు. అలా చంద్రశేఖర్ ఈ పార్కులో ఉన్న సమయంలో ఆ సమాచారం తెలుసుకున బ్రిటిష్ పోలిస్ అధికారి, తన బృందంతో మోహరించాడు. ఆజాద్ తన తుపాకీతో ముగ్గురు పోలీసులను చంపేశాడు. ఆ కాల్పుల్లో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
పోలిసుల చేతిలో చిక్కకుండా తన తుపాకీతో కణత మీద కాల్చుకుని ప్రాణత్యాగం చేశాడు ఆజాద్. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆజాద్ విగ్రహాన్ని స్థాపించి ఆజాద్ మెమోరియల్‌గా తీర్చిదిద్దారు. ఆ పార్కుకు ఆజాద్ పేరు పెట్టారు. విగ్రహం దగ్గర నిలబడి ఆజాద్‌కి సెల్యూట్ చేసి మౌనంగా నివాళి అర్పించి బరువెక్కిన గుండెతో ముందుకు సాగిపోతారు పర్యాటకులు.
పార్కులో లైబ్రరీ!
ఆజాద్ పార్కులో ఆజాద్ మెమోరియల్‌తోపాటు విక్టోరియా మెమోరియల్ కూడా ఉంది. అయితే అందులో ఇప్పుడు విక్టోరియా స్టాచ్యూ లేదు. ప్రయాగ్‌రాజ్ సంగీత్ సమితి, మదన్ మోహన్ మాలవ్యా స్టేడియం, అలహాబాద్ మ్యూజియం ఉన్నాయి. అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ స్లైట్ నిర్మాణాలు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో 5వేల మందికి పైగా సందర్శిస్తారని అంచనా.
టికెట్ ఐదు రూపాయలు మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఇక్కడకు నగరవాసులు రెగ్యులర్‌గా వస్తుంటారు. మంత్లీ టికెట్ వంద రూపాయలు. ఏడాదికి పాస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు. పార్కులోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం. రెగ్యులర్‌గా వాకింగ్‌కి వచ్చే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ నడక వేగం తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు.
కోచ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. లైబ్రరీలో సివిల్స్‌కి ప్రిపేరయ్యే వాళ్లు కనిపిస్తారు. ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కో చోట దుప్పటి పరుచుకుని పుస్తకాలు పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. వారి ఏకాగ్రత స్థాయి ఎంతలా ఉంటుందంటే పర్యాటకులు వారి పక్కనే నడిచి వెళ్తున్నా సరే... పుస్తకంలో నుంచి తలతిప్పి చూడరు. వారి చదువుకు భంగం కలిగించకూడదనే పర్యాటకులే ఒకరికొకరు సైగ చేసుకుంటూ శబ్ధం చేయకుండా దూరంగా వెళ్లిపోతుంటారు.
ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు ఐదు రూపాయలే కానీ పార్కు గేటు దగ్గర కొబ్బరిబోండా డెబ్బై రూపాయలు. లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది. 45 నిమిషాలపాటు సాగే ఈ షోలో మోతీలాల్ నెహ్రూ ఇల్లు ఆనందభవన్, అందులో సాగిన స్వాతంత్య ఉద్యమ రచన వివరాలు, ఆజాద్ పార్కులో సాగిన ఉద్యమ ఘట్టాలతో షో నడుస్తుంది.
ఆజాద్ మరణంతో ముగిసే ఈ షో మరోసారి మనసును బరువెక్కిస్తుంది. ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువుల వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో? లైట్ అండ్ సౌండ్ పూర్తయి పార్కులో నుంచి బయటపడేటప్పటికి ఎనిమిది గంటలవుతుంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..)
Comments
Please login to add a commentAdd a comment