
చాలామంది పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్‌లు తీసుకుని చదువుతుంటారు. అయినా కూడా అనుకున్న ర్యాంకు సాధించలేక చతికిల పడుతుంటారు. తల్లిందండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నామనే బాధ ఓ పక్క, చదవలేక మరోవైపు నానాఇబ్బందులు పడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటి వాళ్లకు ఈ కుర్రాడే స్ఫూర్తి. ఎలాంటి కోచింగ్ లేకుండానే నూటికి నూరు శాతం మార్చులు తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సక్సెస్ అంటే ఇది అని చూపించాడు.
ఆ కుర్రాడే బీహార్‌లోని మధుబనిలోని ఆంధ్రాతర్హి గ్రామానికి చెందిన తథాగత్ అవతార్. అతడు నీట్ పరీక్షలో 720/720 మార్కుల స్కోరు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. అతడు కూడా అందరిలానే తొలి ప్రయత్నంలో కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ 611 మార్కులు సాధించాడు.
అయితే మంచి కాలేజ్‌లో ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి మరింత కష్టపడి చదివాడు. అతడి కృషి ఫలించి నీట్ 2024లో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంకు తెచ్చుకున్న ఇతర అభ్యర్థుల సరసన నిలిచాడు.
అయితే నీట్ యూజీ తాత్కాలికి సమాధాన కీ ఆధారంగా తొలుత 715 మార్కులు స్కోర్ చేయగా, జూన్ 4న విడుదల చేసిన సవరించిన కీ ఆధారంగా అతని స్కోరు 720 రావడం జరిగింది. ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకులో నిలచాడు. అతను ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు.
కుటుంబ నేపథ్యం..
తథాగత్ విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లి కవితా నారాయణ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి మిడిల్ స్కూల్‌లో టీచర్. తల్లి తరుఫు తాత అశోక్ చౌదరి మధుబనిలోని జూనియర్ కళాశాల లైబ్రేరియన్. అతని తాత ఇప్పటికీ తన పూర్వీకుల గ్రామమైన గెహుమాబెరియాలో నివశిస్తున్నారు. కానీ తథాగత్, అతని కుటుంబం ప్రస్తుతం అతని తాత గ్రామమైన ఆంధ్రతార్హిలో నివసిస్తున్నారు.
గ్రామంలోనే ఉండి నీట్‌కి ప్రిపేరయ్యాడు..
తథాగత్ తన గ్రామంలోనే ప్రిపరేషన్ కొనసాగించాడు. ఆన్‌లైన్ తరగతులకు హాజరవ్వుతూ ప్రిపేరయ్యాడు. అతడు చిన్ననాటి నుంచే స్వతహాగా తెలివైన విద్యార్థి అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అతడు ఇంతలా మంచి మార్కుల తెచ్చుకున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని అతడి కుటుంబం చెబుతోంది. ఎయిమ్స్‌లో చదవాలనేది తన జీవితకాల కల అని అందుకే ఇంతలా కష్టపడ్డానని, తన కృషి ఫలించిందని ఆనందంగా చెబుతున్నాడు తథాగత్.
అయితే భారతదేశంలో ఉన్న వైద్యుల కొరత, ఆర్థిక పరిమితులు దృష్ట్యా ఎంతమంది విద్యార్థులు డాక్టర్ చదువు అభ్యసించలేక ఇబ్బందులు పడుతున్నారో చూస్తే బాధనిపించిందని, అదే తనకు డాక్టర్ అయ్యేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు.
ముందుకు ఖర్చు గురించి విద్యార్థులు చింతించకుండా మంచి ర్యాంకు తెచ్చుకోవడంపై దృష్టిపెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోగలుగుతారని తథాగత్ చెబుతున్నాడు. ఈ విధంగా మరింతమంది అర్హులైన విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్యులుగా మారి దేశానికి సేవ చేస్తారని చెబుతున్నాడు తథాగత్.
(చదవండి: కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment