జిమ్ కల్చర్ కూడా బాగానే ఉన్నప్పటికీ కొందరు నేచురాలిటికే సై..
కేబీఆర్, ఓయూ, గచ్చిబౌలి లేక్, మృగవాణి పార్కు తదితర స్పాట్స్
సిటీ నలుమూలలా ప్రకృతి పరవశంతో ఉద్యానవనాలు, పార్కులు
కుటుంబ సమేతంగా ఆదరణ పొందుతున్న ఈ జాగింగ్‌పై కథనం
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్‌లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్‌లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్‌లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్‌ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!!
హిల్ పార్క్.. కేబీఆర్
చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని
పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్‌కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.
ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులు
ప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్‌గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్‌ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్‌కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్‌లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.
వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో..
నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్‌నగర్‌కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మినీ ఫారెస్ట్.. జింకల సందడి
రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్‌బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్‌కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment