KBR Park
-
కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుము పెంపు
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం (కేబీఆర్) వాకర్లు, సందర్శకులకు అటవీ శాఖ అధికారులకు న్యూ ఇయర్‌గా గిఫ్ట్‌గా ఎంట్రీ ఫీజును పెంచారు. ప్రతియేటా ప్రవేశ రుసుము పెరుగుతుండగా ఆ మేరకు పార్కు లోపల సౌకర్యాలు పెంచడంలో మాత్రం అధికారులు విఫమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవేమీ పట్టని అధికారులు పార్కు ప్రవేశ రుసుమును ఇష్టానుసారంగా పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి కేబీఆర్ పార్కుకు వెళ్లాలంటే పెద్దలకు రూ.50 (ప్రస్తుతం రూ.45 ఉంది), పిల్లలకు రూ.30 (ప్రస్తుతం రూ.25 ఉంది)కి పెంచారు. అలాగే నెలవారీ పాస్ ప్రస్తుతం రూ.850 ఉండగా, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రూ.1000కి పెంచారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రవేశ రుసుము పెంచుతున్నట్లుగా ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు. -
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్‌లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్‌లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్‌ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్‌కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్‌గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్‌ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్‌కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్‌లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్‌నగర్‌కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్‌కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం
-
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
KBR Park Flyovers: స్పీడ్ పెరిగింది..
బంజారాహిల్స్: ట్రాఫిక్ కష్టాలు లేకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వైపు రయ్ రయ్‌మంటూ వాహనాలు దూసుకెళ్లేందుకే ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిరి్మంచేందుకు పచ్చజెండా ఊపిని విషయం విదితమే. ఇప్పటికే ఎక్కడెక్కడ అండర్‌పాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు అనే విషయాలపై ప్రాజెక్టŠస్ అధికారులు భారీ మ్యాప్‌లు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మ్యాప్‌ల ఆధారంగా ఇప్పుడు జలమండలి, అర్బన్ బయో డైవర్సిటీ, జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. జలమండలి, యూబీడీ అధికారులు సర్వే పూర్తయిన తర్వాత పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇక్కడ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టినట్లు అవుతుంది. ఆరు జంక్షన్లలో పైప్లైన్లపై... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 మీదుగా సాగే ఈ అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిరి్మంచే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ మంచినీటి పైప్లైన్లతో పాటు మరికొన్ని చోట్ల సీవరేజి లైన్లు ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ వచ్చే ఆరు జంక్షన్లలో ఎక్కడెక్కడ ఏఏ లైన్లు ఉన్నాయో వాటిని సర్వే చేసే పనిలో జలమండలి జీఎం హరి శంకర్ ఆయా సెక్షన్ల మేనేజర్లు, ఇంజనీర్లతో సమీక్షిస్తున్నారు. ఈ జంక్షన్ల ప్రాంతంలో 1200, 1000, 900 ఎంఎం ఎంఎస్ వ్యాసార్థంలో భారీ మంచినీటి పైప్లైన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఆయా జంక్షన్ల నుంచి పక్కకు తప్పించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి తోడు వెంకటగిరి నుంచి తట్టికాన వాటర్ సెక్షన్‌కు నీళ్లు పంపింగ్ చేసే భారీ పైప్‌లైన్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. మ్యాప్‌ల ఆధారంగా ఇక్కడున్న మంచినీటి భారీ లైన్లు ఏ విధంగా ఎటు వైపు మారిస్తే బాగుంటుంది అనే అంశంపై ఇప్పటికే అధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. -
Hyderabad: కేబీఆర్ పార్కు, హుస్సేన్‌సాగర్‌ల చుట్టూ సైకిల్ ట్రాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంటే ఒకప్పుడు సైకిళ్ల నగరం. వాహనాలు పెద్దగా రోడ్డెక్కని ఆ రోజుల్లో ప్రజలు సైకిళ్లనే అత్యధికంగా వినియోగించారు. బహుశా మరే నగరంలో లేనన్ని సైకిళ్లు హైదరాబాద్‌లో వినియోగంలో ఉన్నందుకే నిజాం కాలంలో దీన్ని సైకిళ్ల నగరం అని పిలిచారు. అలాంటి నగరం ఇప్పుడు వాహనాల నగరంగా మారింది. సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు సిటీ రోడ్లపైన పరుగులు తీస్తున్నాయి. దీంతో సైకిల్‌కు చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాన్‌మోటరైజ్డ్ రవాణా సదుపాయాలపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఉమ్టా అధికారులు తెలిపారు. మొదటి దశలో సుమారు 50 కిలోమీటర్ల వరకు సరికొత్త సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సైకిలిస్టులకు పూర్తి భద్రత ఉండేవిధంగా ఈ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోస్టేషన్లు, సిటీ బస్స్టేషన్లు, జంక్షన్లలో సైకిళ్లను వినియోగించే విధంగా పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాక్... ఈ ప్రణాళికలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు, నెక్లెస్‌రోడ్ సందర్శనకు వచ్చేవారు సరదాగా సైకిళ్లపైన విహరించవచ్చు. అలాగే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాక్‌లను విస్తరించడం వల్ల వాకింగ్‌తో పాటు సైకిలింగ్ కూడా ఒక వ్యాయామంగా మారనుంది. మరోవైపు పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా వాహనాల వల్ల సైకిలిస్టులకు ప్రమాదాలు వాటిల్లకుండా ఫుట్‌పాత్‌ల మధ్యలో ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. మెట్రో స్టేషన్లకు సైకిళ్లు... కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లానింగ్‌లో భాగంగా మెట్రో స్టేషన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం నాన్‌మోటరైజ్డ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మెట్రో స్టేషన్లకు 2 కిలోమీటర్ల పరిధిలో సైకిళ్లను వినియోగించేవిధంగా ట్రాక్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అవకాశం ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రోత్సహించడంతో పాటు సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే నగరం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల్లో సైకిళ్ల కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో అవకాశం ఉన్న చోట 50 కిలోమీటర్ల వరకు ట్రాక్‌లను విస్తరించి దశల వారీగా ట్రాక్‌ల సంఖ్యను పెంచనున్నారు. గత సంవత్సరం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, ఇటు కొల్లూరు వరకు హెచ్ఎండీఏ అధునాతన సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్...⇒ హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్టా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్‌పైన దృష్టి సారించింది. ఇందుకోసం వినియోగంలో ఉన్న ప్రజా, ప్రైవేట్, వ్యక్తిగత రవాణా సదుపాయాలపైన అధ్యయనం చేసి 2050 నాటికి అవసరమైన రహదారుల విస్తరణ, రవాణా,మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసి ఉంది. ⇒ ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ లీ అసోసియేట్స్‌కు అధ్యయన బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఈ పరిధి 10 వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనుంది. అలాగే నగర జనాభా కూడా 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఈ మేరకు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ను రూపొందించవలసి ఉంది. ఇందులో భాగంగా సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధిని చేపడతారు. -
Hyderabad: కేబీఆర్ చుట్టూ 6 ఫ్లై ఓవర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన ఎస్సార్డీపీ లో భాగంగా గత ప్రభుత్వం చేయలేకపోయిన కొన్ని పనుల్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిచి్చంది. హెచ్ఎండీఏ పరిధి వరకు ట్రాఫిక్ చిక్కులు లేని సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఆ పనుల్ని ఐదు ఫేజ్‌ల్లో చేయాలని భావించింది. అందులో భాగంగా తొలిదశలో కేబీఆర్ పార్కు కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చేసేందుకు ఆరు పనులకు దాదాపు రూ.586 కోట్ల అంచనాతో ప్రణాళిక రూపొందించింది. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి, ఎదురైన ఆటంకాలతో మెజార్టీ పనుల్ని వాయిదా వేసింది. ఆయా ఫేజ్ల్లోని పనులు మారిపోయాయి. ఐదు ఫేజ్‌లు సైతం మారిపోయాయి. అయినా ఐదు ఫేజ్‌ల్లో పేర్కొన్న పనుల్లో చాలా పనుల్ని ఆ ప్రభుత్వం పూర్తిచేసింది. ⇒ అప్పుడు ఫేజ్–1లో భాగంగా కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్–కేబీఆర్‌పార్కు ఎంట్రన్స్, రోడ్‌నెంబర్ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనుకున్నారు. కానీ.. వీటిలో రోడ్‌నెంబర్ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే పూర్తయింది. మిగతావి పూర్తికాలేదు. అందుకు కారణం కేబీఆర్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావాల్సి ఉండటంతో పాటు పర్యావేరణ వేత్తల అభ్యంతరాలు వంటి వాటితో ఆ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు హైకోర్టులోనూ కేసులున్నట్లు సమాచారం. 1. జూబ్లీ చెక్‌పోస్ట్ 2. రోడ్ నెంబర్– 45 3. ఎల్వీ ప్రసాద్ 4. బసవతారకం కేన్సర్ హాస్పిటల్ 5.మహారాజా అగ్రసేన్ 6. ఫిల్మ్‌నగర్ .. వీటిలో బసవతారకం కేన్సర్ హాస్పిటల్ వద్ద తొలుత ప్రతిపాదనలున్నప్పటికీ, అనంతరం తొలగించారు. తిరిగి ఇప్పుడు మళ్లీ అక్కడ కూడా ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ⇒ ఫ్లై ఓవర్లతో పాటు అండర్‌పాస్‌లు సైతం నిర్మించనున్నారు. ట్రాఫిక్ ఫ్రీ కోసం చేపట్టే పనులకు ఎక్కువ నిధులు ఖర్చు కాకుండా ఉండేందుకు అండర్‌పాస్‌లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సిటీ హార్ట్‌గా .. కేబీఆర్ పార్కు అనేది నగరానికి హార్ట్‌లా ఉండటంతో పాటు సంపన్న వర్గాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు, తదితర వీఐపీలు నిత్యం సంచరించే ప్రాంతం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ జంక్షన్‌పై దృష్టి సారించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులకు సైతం అభ్యంతరాలు ఉండవనే ధీమాతో ప్రభుత్వం ఉంది.సీఎం రేవంత్ చొరవతో..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేబీఆర్ చుట్టూ ఆగిపోయిన ప్రాజెక్టుల్ని చేపట్టే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఆయన వద్దే ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి దిగువ ప్రాంతాల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కన్సల్టెంట్ సేవల్ని జీహెచ్ఎంసీ కోరుతోంది. త్రీడీ డిజైన్‌లో వాటిని అందజేయాల్సిందిగా తెలిపింది. అంటే ప్రస్తుతం ఆయా జంక్షన్లలో పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, ఫ్లై ఓవర్లు పూర్తయితే ఎలా ఉంటాయి.. ట్రాఫిక్ చిక్కులు ఎలా తగ్గుతాయి.. సిగ్నల్ ఫ్రీగా ఎలా సదుపాయంగా ఉంటుంది అనే అంశాల్ని యానియేషన్ ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది. -
కేబీఆర్ పార్కులో యాచకుల బెడదపై ‘ఎక్స్’లో ఫిర్యాదు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో యాచకుల బెడద వాకర్లకు ఇబ్బందిగా మారుతున్నదని, ఇక్కడ యాచించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని భానుమూర్తి అనే వాకర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఆదివారం ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ తక్షణమే తనిఖీలు చేపట్టి వాక్‌వేలో యాచిస్తున్న వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని జీహెచ్ఎంసీ సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులను ఆదేశించారు. దీంతో సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులు ఆదివారం రాత్రి వాక్‌వేలో తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ ఇక్కడకు వస్తున్న వాకర్లతో పాటు పక్కనే ఉన్న హోటల్‌వద్ద టీ తాగేందుకు వచ్చిన కస్టమర్ల వద్ద యాచిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను బంజారాహిల్స్‌రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక నివాసం ఉంటున్న కుమారుడి వద్దకు చేర్చారు. అయితే ఆమె బెగ్గర్ కాదని, సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిందని కుమారుడు ఽఅధికారులకు చెప్పారు. మరోసారి బయటకు రాకుండా చూసుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని తల్లీకొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
మహిళా నిర్మాతకు కేబీఆర్ పార్క్‌లో చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా నిర్మాతకు కేబీఆర్ పార్కులో చేదు అనుభవం ఎదురైంది. పార్కు వద్ద జాగింగ్ చేస్తున్న నిర్మాతను ఓ పోకిరి లైంగిక వేధింపులకు గురి చేశాడు. తాను జాగింగ్ చేస్తుంటే ఆమెను కారులో వెంబడిస్తూ వేధించాడు. అశ్లీల హావభావాలతో తనను ఇబ్బందిపెట్టడమే కాకుండా తన ఫోన్లో ఆమెను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంటన్నరపాటు ఆమె వెంటపడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక సదరు 32 ఏళ్ల నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 354ఎ, 354డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన జూలై 9న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు నలుపు రంగులో కారులో వచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కలిసిన కాసేపటికే ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లి ఉండాల్సింది: హీరోయిన్ -
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
జంక్షన్ క్లోజ్.. ట్రాఫిక్ జామ్
బంజారాహిల్స్: ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాలకు తెరలేపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు సిగ్నళ్ల వద్ద జంక్షన్లను మూసివేయడంతో పాటు యూ టర్న్‌లను కొనసాగిస్తున్నారు. అదే పంథాను ఇప్పుడు బంజారాహిల్స్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఎంతో కీలకమైన సాగర్ సొసైటీ సిగ్నల్ జంక్షన్‌ను అధికారులు మంగళవారం మూడు గంటల పాటు మూసివేశారు. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ట్రయల్ రన్‌గా ఈ జంక్షన్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పాటు బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు పరిశీలించారు. నాన్ పీక్ హవర్స్‌లో వాహనాల రాకపోకలు జంక్షన్ మూసివేత వల్ల ఎంత వరకు ఒత్తిడి పెరుగుతుంది, తగ్గుతుంది అనేది పరిశీలించారు. అయితే ఈ మూడు గంటల్లో రద్దీ లేని సమయాలు కాబట్టి వాహనాలు ముందుకు సాగాయని ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. టీవీ9 జంక్షన్ నుంచి సాగర్ సొసైటీ వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్కు చౌరస్తాలో యూ టర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పటికే కేబీఆర్ పార్కు చౌరస్తాలో వందల సంఖ్యలో బారులు తీరిన వాహనాలకు తోడు ఈ వాహనాలు కూడా కలిపి చుక్కలు కనిపించాయి. ఇక కేబీఆర్ పార్కు వైపు సాగర్ సొసైటీ వైపు నుంచి వచ్చే వాహనాలు టీవీ 9 చౌరస్తాలో యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది కూడా వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డు విస్తరించకుండా ఫుట్‌పాత్‌లు లేకుండా చేస్తున్న ఈ ట్రయల్ రన్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తమకు తోచినట్లుగా ప్రయోగాలు చేస్తూ వాహనదారులపై రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ మళ్లింపులతో చుట్టూ తిరిగి వస్తున్న వాహనదారులు ఒక వైపు అసహనం వ్యక్తం చేస్తుండగానే తాజాగా సాగర్ సొసైటీ చౌరస్తాలో మరో ప్రయోగానికి తెరలేపి గందరగోళం సృష్టించారు. ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల్లో ఉండి నియంత్రిస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని, అందుకు విరుద్ధంగా జంక్షన్లు మూసివేసి మీ దారిన మీరు పోండి అనే విధంగా ప్రయోగాలు చేస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ సొసైటీ జంక్షన్ మూసివేత విఫల ప్రయోగమని మొదటి రోజే తేటతెల్లమైంది. -
అసలే ఇరుకు..ఆపై సైకిల్ ట్రాక్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ప్రధాన రహదారిని కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్(సీఆర్ఎంపీ) ఏజెన్సీ నిర్వహిస్తోంది. రోడ్లపై గుంతలు పడినా, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నా కొత్తగా రోడ్డు వేయాలన్నా, తవ్వాలన్నా సీఆర్ఎంపీ నిర్వహణలోనే చేపట్టాలి. అయితే గత కొంత కాలంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌లను ఆనుకుని సైకిల్ ట్రాక్ బొల్లార్డ్స్ కోసం గుంతలు తీశారు. వర్షాలకు ఈ గుంతలు నిండిపోయి పార్కుకు వచ్చే వాకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకిల్ ట్రాక్ నిర్మాణం పేరుతో పార్కు చుట్టూ సదరు సంస్థ రోడ్డును ఛిద్రం చేసింది. నాలుగైదు సార్లు గుంతలు తీసి పూడ్చి రూ. లక్షల్లో నిధులు వృథా చేశారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే పార్కు చుట్టూ రోడ్డు ఇరుగ్గా ఉందని ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపడితే సమస్య జఠిలంగా మారుతుందని, వాహహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తక్షణం పార్కుచుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు నిలిపివేయాలని తీసిన గుంతలను పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఆర్ఎంపీ నిర్వాకంతో పార్కు చుట్టూ రోడ్డు అధ్వానంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
HYD: కేబీఆర్ పార్క్‌లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో సినీ నటికి చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం పూట వాకింగ్‌కి వచ్చిన ఆమెను ఓ వ్యక్తి వెంబడించి చుక్కలు చూపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు సమాచారం ప్రకారం వివరాలు.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసించే ఈ యువ నటి బుధవారం రాత్రి కేబీఆర్ పార్క్‌కు నడక కోసం వచ్చింది. చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె పార్క్‌లో నడుస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. తను ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాడు. నడిస్తే నడుస్తున్నాడని ఆమె గమనించింది. ఇలా దాదాపు ఐదు సార్లు పరిక్షించిన ఆమె వెంటనే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న స్థానికులకు, పార్క్ సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. దీంతో అందరు కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని కొండాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పార్క్ సిబ్బంది ఆరా తీయగా పొందన లేని సమాధానాలు చెప్పాడు. చదవండి: కృష్ణవంశీకి పిచ్చా, ఈమె హీరోయిన్ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత దీంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నటికి గతంలోనూ కేబీఆర్ పార్క్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2021 ఏడాదిలో ఓ రోజు సాయంత్రం వాక్ వచ్చిన ఆమెను ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి యత్నించాడు. అది కుదరకపోవడంతో బండరాయితో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. ఇప్పుడు తాజాగా అదే నటిని ఆగంతకుడు వెంటాడటం పలు అనుమానాలనున రేకెత్తిస్తోంది. అయితే ఆ నటి పేరు షాలూ చౌరాసియా అని తెలుస్తోంది. -
కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు. Telangana | BRS MLC K Kavitha participated in the Bhogi celebrations organised by Bharat Jagruthi at KBR park in Hyderabad. pic.twitter.com/n31mFG4Sxy — ANI (@ANI) January 14, 2023 -
Hyderabad: హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు ఉద్దేశించిన సొరంగ మార్గానికి (రోడ్‌టన్నెల్) ఫీజిబిలిటీ స్టడీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసిన అధికారులు ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ అంతర్జాతీయస్థాయి టెండర్లు పిలిచారు. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా ఎల్1గా నిలిచిన ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రై వేట్ లిమిటెడ్‌కు పనులు అప్పగిచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు. దాదాపు నాలుగు నెలలైనప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని ఒక దశలో భావించారు. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో తదుపరి కార్యాచరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్‌లు రెండు దశలుగా చేపట్టాలని ఆదేశించింది. తొలిదశలోని ఫీజిబిలిటీ స్టడీ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతినిచ్చాకే డీపీఆర్ తయారీ చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టుకయ్యే వ్యయం, ప్రజలకు కలిగే సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫీజిబిలిటీ స్టడీ నివేదికను ఆర్నెళ్లలోపు అందించాల్సి ఉంది. అనంతరం డీపీఆర్‌కోసం మరో మూడునెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఫీజిబిలిటీ నివేదిక అందిస్తే సొరంగం తవ్వేందుకు సాధ్యాసాధ్యాలు.. అందుకయ్యే వ్యయం తదితర వివరాలు తెలుస్తాయి. చదవండి: ('నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటా') మేజర్ కారిడార్‌లో సాఫీ ప్రయాణం ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి వయా కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 జంక్షన్, అక్కడినుంచి దుర్గం చెరువు వరకు ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే మేజర్ కారిడార్‌గా అధికారులు గుర్తించారు. ఈ కారిడార్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీ సాఫీ ప్రయాణానికి సొరంగం మార్గం ఆలోచన చేశారు. రాష్ట్రంలో హైవేమార్గంలో ఇప్పటివరకెక్కడా లేని విధంగా సొరంగమార్గం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా దీన్ని నిర్మించనున్నారు. టన్నెల్ నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్, డిజైన్, అప్రోచ్ మార్గాలతోపాటు టెక్నికల్, ఎకనామికల్, సోషల్, ఫైనాన్సియల్ వయబిలిటీ, ట్రాఫిక్ తదితరమైనవి డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీ నివేదికలో వెల్లడిస్తారు. టన్నెల్లో క్యారేజ్‌వే ఎన్ని లేన్లలో ఉండాలో కూడా నివేదికలో సూచించనున్నారు. దేశంలో జమ్మూ కశ్మీర్‌లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ టన్నెల్ పొడవు 9.20 కి.మీ. ఇప్పటి వరకు అదే అత్యంత పొడవైనది. ముంబైలోనూ రోడ్ టన్నెల్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. సొరంగమార్గం 6.3 కి.మీ తొలి ప్రతిపాదనల మేరకు దాదాపు 10 కి.మీ మేర సొరంగమార్గం నిర్మించాలనుకున్నప్పటికీ, అనంతరం 6.30 కి.మీకు తగ్గించారు. ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ►రోడ్‌నెంబర్ 45 జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వరకు : 1.70 కి.మీ. ►రోడ్‌నెంబర్ 12 నుంచి టన్నెల్ జాయినింగ్ పాయింట్ వరకు: 1.10 కి.మీ. ►కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు: 2 కి.మీ. ►మూడు అప్రోచెస్ 0.50 కి.మీ చొప్పున 1.5 కి.మీ. -
నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో గతేడాది నవంబర్ 14న వాకింగ్ చేస్తున్న సినీనటి షాలూ చౌరాసియాపై కొమ్ము బాబు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. ఆ తర్వాత మరో ఘటనలోనూ మరో నిందితుడు వాకర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి కోసం ఎంత గాలించినా ఆధారాలు లభించలేదు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడి జాడ క్షణాల్లో తెలిసి ఉండేది. సీసీ కెమెరాలు అక్కడ లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ► నాలుగేళ్ల క్రితం కేబీఆర్ పార్కులో నాటకారి నరసింహ అనే చైన్‌స్నాచర్ వాకింగ్ వచ్చిన మహిళల గొలుసులు తస్కరిస్తూ గోడ దూకి వాక్‌వే నుంచి పరారయ్యేవాడు. ఇలా అయిదుసార్లు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితు డిని పట్టుకోవడానికి పోలీసులకు కష్టతరమైంది. ► ఓ సూడో పోలీస్ ఈ ఏడాది జనవరిలో ఓ ప్రేమ జంటను జీహెచ్ఎంసీ వాక్‌వేలో బెదిరించి తాను పోలీసునని అడిగినంత ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానని వారిని బెదిరించారు. తన బైక్‌పై ప్రేమికుడిని కూర్చుండబెట్టుకొని అమీర్‌పేట్‌కు వెళ్లి ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేయించి ఉడాయించాడు. ఆ సూడో పోలీసు గురించి ఆరా తీయగా అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. .. నిత్యం వేలాది మంది వాకింగ్ చేసే కేబీఆర్ పార్కు వాక్‌వేలో జరిగిన ఉదంతాలివి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాకర్లు మూడేళ్లుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. తాజాగా కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడింది. వాకర్లకు భద్రతను కల్పిస్తూ అసాంఘిక శక్తులకు, స్నాచర్లకు, ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఒక్కటే మార్గమని భావించిన పోలీసులు పార్కు చుట్టూ 150 కెమెరాలకు శ్రీకారం చుట్టారు. ► మొదటి విడతగా 70 కెమెరాలు ఇప్పటికే బిగించారు. మొదటి విడతలో బిగించిన 70 కెమెరాలు త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనున్నాయి. ఇక రెండో విడతలో ఇంకో 80 కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలు కేబీఆర్ పార్కు ప్రధాన గేటు నుంచి అటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వరకు ఏర్పాటు చేశారు. రెండో విడతలో బసవతారకం ఆస్పత్రి నుంచి జానారెడ్డి నివాసం, స్టార్‌బక్స్, సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ నివాసం మీదుగా మంత్రి డెవలపర్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 80 కెమెరాలు ఫిక్స్ చేస్తారు. వీటి ఏర్పాటుతో వాక్‌వే మొత్తం నిఘా నేత్రంలోకి వెళ్తుంది. (క్లిక్: అమ్నేషియా పబ్ కేసు.. మరీ ఇంత దారుణామా..?) జీహెచ్ఎంసీ వైఫల్యం... కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో వరుస సంఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీలో మాత్రం చలనం ఉండటం లేదు. పలుచోట్ల గేట్లు విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల ఫెన్సింగ్ దొంగిలించారు. ఆరు నెలల క్రితం సంఘటన జరిగినప్పుడు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఒక్క హామీ నెరవేరలేదు. కనీసం వాక్‌వేలో స్ట్రీట్‌లైట్లు కూడా చాలా చోట్ల వెలగడం లేదు. ఏదైనా ఘటన జరిగితే పోలీసులపైనే భారం పడుతుంది తప్పితే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. (క్లిక్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం) -
విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు...సొరంగ ‘మార్గం
సాక్షి హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, కేబుల్ బ్రిడ్జి, అండర్‌పాస్‌లు, స్టీల్‌బ్రిడ్జిలు వంటి పనులు విజయవంతంగా పూర్తిచేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడిక సొరంగ మార్గాలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో గతంలో లేనటువంటి వివిధ మార్గాలను అందుబాటులోకి తెస్తున్న వారు ప్రస్తుతం సొరంగ మార్గాల నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నుంచి పంజగుట్ట వరకు భూగర్భంలో సొరంగ మార్గానికి (వయా కేబీఆర్ పార్క్) టెక్నికల్ కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు. ఖాజాగూడ గుట్టను తొలిచి అక్కడ మరో సొరంగ మార్గానికి సమాయత్తమవుతున్నారు. మంత్రి కేటీఆర్ ఆసక్తితో.. కేబీఆర్ పార్కు కింద నుంచి సొరంగమార్గానికి మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరచడంతో, ఖాజాగూడ సొరంగానికీ నిధులు కోరుతూ ప్రభుత్వం ముందుంచారు. ఎస్సార్డీపీ పనులకు సంబంధించి తొలి ప్రతిపాదనల మేరకు అయిదు ఫేజ్‌ల్లో ప్రణాళికలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు ఇతరత్రా కారణాలతో వివిధ ఫేజ్‌ల్లో ఉన్న పనుల్లో ఆటంకాలు లేని పనుల్ని చేపట్టారు. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఫేజ్– 1 గానే పరిగణిస్తూ, కొత్తగా ఫేజ్–2లో చేపట్టేందుకు 14 పనుల్ని ప్రతిపాదించారు. వాటిలో ఖాజాగూడ సొరంగమార్గం ప్రముఖంగా ఉంది. ఫేజ్– 2లోని పనుల మొత్తం అంచనా వ్యయం రూ.3515 కోట్లు కాగా, అందులో రూ. 1080 కోట్లు ఈ సొరంగ మారానికే ఖర్చు కానుంది. మిగతా 13 పనుల్లో పాతబస్తీకీ తగిన ప్రాధాన్యమిచ్చారు. శాస్త్రిపురం జంక్షన్‌నుంచి ఇంజన్‌బౌలి వరకు రూ.250 కోట్లతో రోడ్డు విస్తరణ, బెంగళూర్ హైవే నుంచి శాస్త్రిపురం వరకు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ పనుల్ని కొత్తగా చేర్చారు. వీటితోపాటు కొన్ని పాత ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం కోసం ఈ నెల 12న జరగనున్న సభలో వీటిని ఉంచే అవకాశం ఉంది. (చదవండి: ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!) -
నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం
-
కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం
బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో భద్రత చర్యల వైఫల్యం వాకర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న ఓ మహిళా వాకర్ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాకర్లు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో మహిళా వారర్ పల్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆగంతకుడి కోసం అటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకోసం పార్కు చుట్టూ ఉన్న రహదారులకు ఇరువైపులా వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ► మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వైపు ఆగంతకుడు మహిళా వాకర్పట్ల అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారైన ఘటన పోలీసు వర్గాలను షాక్‌కు గురి చేసింది. నాలుగు నెలలు తిరగకుండానే వాక్‌వేలో మరో ఘటన చోటు చేసుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ► ఒక వైపు ఇంటర్సెప్టార్ పోలీసులు మరోవైపు ఫుట్ పెట్రోలింగ్ పోలీసులు దీనికి తోడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 20 మంది కానిస్టేబుళ్లు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాక్‌వేలో కాపలా కాస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఉన్నతాధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి తోడు వాక్‌వేలో ఉన్న ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడం పోలీసులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. సీసీ కెమెరాను వంచేశాడు.. మహిళా వాకర్‌ను వెనుక నుంచి వచ్చి ఇబ్బంది పెట్టిన ఘటనలో ఆగంతకుడు అక్కడ అంతకుముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాను నేలకు వంచినట్లు గుర్తించారు. ముందస్తు పథకంతోనే ఆగంతకుడు అక్కడ కాపుకాసి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. విరిగిన గేట్లకు మరమ్మతులేవి? జీహెచ్ఎంసీ వాక్‌వేలో నాలుగైదు చోట్ల గేట్లు విరిగాయి. వీటికి మరమ్మతులు చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు.గతేడాది నవంబర్ 11వ తేదీన సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి జరిగిన అనంతరం జీహెచ్ఎంసీ, పోలీసులు, అటవీ శాఖాధికారులు సమీక్ష నిర్వహించి సీసీ కెమెరాలతో పాటు వీధి దీపాలు, గేట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. సీసీ కెమెరాలేవి? నటి షాలూచౌరాసియాపై ఘటన జరిగిన సమయంలో వాక్‌వేలో 64 సీసీ కెమెరాలు ఉన్నట్లు తేలింది. ఆ కెమెరాల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదని అప్పుడే గుర్తించారు. అనంతరం డీసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయడమే కాకుండా కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయకపోగా ఒక్క సీసీ కెమెరా కూడా కొత్తది ఏర్పాటు చేయలేదు. హడావుడి తప్పితే సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టలేదు. (క్లిక్: గూగుల్ మ్యాప్స్‌లోకి ‘ట్రాఫిక్ అడ్డంకుల’ అప్డేట్) రూ. కోటి నిధులు అవసరం జీహెచ్ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే రూ. కోటి నిధులు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సంబంధిత సంస్థను కూడా పిలిపించి అంచనాలు రూపొందించారు. తీరా చూస్తే కోటి రూపాయలు ఎవరు ఇవ్వాలి అన్నదగ్గర నిర్ణయాలు ఆగిపోయాయి. ప్రభుత్వమే రూ. కోటి వెచ్చించి పార్కు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుండేది. దాతలను గుర్తించి వారి నుంచి విరాళాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆర్డర్లు పాస్ చేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. (చదవండి: హైదరాబాద్.. ఫలించిన యాభై ఏళ్ల కల! ) వెలగని వీధి దీపాలు పార్కు చుట్టూ వాక్‌వేలో చీకటి రాజ్యమేలుతున్నది. నటిపై ఆగంతకుడి దాడికి అక్కడ చీకటి ఉండటమే కారణమని గుర్తించారు. అనంతరం ఇక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తూతూ మంత్రంగా 30 చోట్ల తాత్కాలిక వీధి దీపాలు ఏర్పాటు చేసి నెల తిరగకుండానే వాటిని పట్టుకెళ్లారు. పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నిర్వాకంతోనే పార్కు చుట్టూ ఆగంతకుల దాడులు, అసాంఘిక కార్యకలాపాలు, వాకర్లకు భద్రత లేకపోవడం చోటు చేసుకుంటున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
వాక్‌వేలో కుక్క పిల్లలను చంపిన బాలుడు
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో తిరుగుతున్న ఓ బాలుడు గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఇక్కడి పెంపుడు కుక్కలపై దాడి చేస్తూ వాటిని కొడుతూ చంపేందుకు యత్నిస్తున్నాడంటూ ఓ వాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ విధుల్లో ఉన్న ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వివరాలివీ... కేబీఆర్ పార్కు సమీపంలోని ఓ బస్తీలో నివసించే 16 ఏళ్ల బాలుడు కుక్కలను రాళ్లతో కొట్టి చంపేస్తున్నాడని ఓ మహిళా వాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... అక్కడే ఉన్న ఇంటర్ సెప్టర్ వెహికిల్ కానిస్టేబుల్ కె.బి.అక్షయ్‌కుమార్, నరేష్‌తో పాటు హోంగార్డులు జి.నారాయణరెడ్డి, వెంకటేష్ తదితరులు ఘటన స్థలానికి వెళ్లి మూడు కుక్క పిల్లలు చనిపోయినట్లుగా గుర్తించారు. మరో కుక్కపిల్ల దాడిలో గాయపడగా దాన్ని రక్షించారు. ఈ కుక్క పిల్లలపై దాడి చేసి చంపేసిన బాలుడు కొద్దిదూరంలోనే కర్రలతో పావురాల గుంపుపై దాడి చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Tomato Price In Hyderabad: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారం రోజుల తర్వాతా బాలుడి మానసిక స్థితిలో మార్పు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఈ బాలుడు పార్కు లోపల, బయట ఆవారాగా తిరుగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాళ్లతో, కర్రలతో జంతువులు, పక్షులపై దాడి చేస్తున్నట్లుగా వాకర్లు తెలిపారు. -
కేబీఆర్ పార్కు: ప్లీజ్ ఇక్కడ నేనున్నానని అందరికీ చెప్పరూ!
ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అవతలి వారికి ఆ విషయం తెలియజేసేందుకు పూర్వకాలంలో గ్రామాలు, ఇతర చారిత్రక ప్రాంతాల్లో ధర్మ గంటలు ఏర్పాటు చేసేవారు. సమస్య ఉన్న వారు ఇక్కడికి వచ్చి ధర్మ గంటను మోగిస్తే సంబంధిత అధికారులు లేదా గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి వారి సమస్యను విని పరిష్కరించేవారు. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘సేవ్ అవర్ సోల్’ (ఎస్‌వోఎస్) టవర్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు ప్రధాన గేటు ముందు ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి పైన ఒక కెమెరా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక బటన్ ఏర్పాటు చేసి అది నొక్కి మాట్లాడితే సంబంధిత కమాండ్ కంట్రోల్లో వారు చెప్పేది వినడమే కాకుండా వారు ఎవరో చూసేందుకు కూడా కెమెరాలు బిగించారు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ► అయితే ఇక్కడొక ధర్మగంట ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ► వారం క్రితం ఇదే కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై, ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతిపై, జనవరి 22వ తేదీన ఓ వైద్యురాలిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆ సమయంలో ఇలాంటి ధర్మగంట ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఉంటే వీరు క్షణాల్లో తమ సమస్యను చెప్పుకొని పోలీసుల దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లే ఆస్కారం ఉండేది. ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం గురించి చాలా మందికి తెలియదు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఈ ఎస్‌వోఎస్‌కు సంబంధించి కనెక్షన్ కూడా బిగించారు. ► ఎవరైనా తమ సమస్యను చెప్పుకోగానే క్షణాల్లో సమీపంలోని పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితులకు న్యాయంచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చదవండి: టీఎస్ఆర్టీసీపై కిన్నెరసాని మొగులయ్య పాట.. ► తీరా లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఎవరికీ తెలియని దుస్థితిలో ఉండిపోయింది. ► కనీసం ఆ స్తంభం విషయంలో అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేకుండా పోయింది. పలుమార్లు ఈ ఎస్‌వోఎస్ స్తంభంపై అవగాహన కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ► కేబీఆర్ పార్కుతో పాటు పీవీఎన్‌ఆర్‌మార్గ్‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ► బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నం. 92 సీవీఆర్ న్యూస్ వద్ద, స్టార్ బక్స్ హోటల్ వద్ద, కళింగ కల్చరల్ ట్రస్ట్ అగ్రసేన్ చౌరస్తాలో, బాలకృష్ణ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాకర్లకు, సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడి కొమ్ముబాబు అరాచాకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు ముందు గతంలోనూ ఇలాంటి నేరానికే పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా మరో యువతి తనపై బాబు దాడి చేశాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నవంబర్ 2న కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 6 వద్ద తనను అడ్డుకొని డబ్బులు లాక్కున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు అరెస్ట్ కావడంతో బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కొమ్ము బాబు బాధితులు ఇంకా ఎవరైనా ఉన్న ఉంటే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు. కాగా నవంబర్ 14న రాత్రి బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్‌కు వెళ్లిన చౌరిసియాపై దాడి చేసిన నిందితుడు.. లైంగిక దాడికి యత్నించి ఆమె యాపిల్ ఫోన్ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ చేసి.. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు నిందితుడు వెల్లడించినట్లుగా తేలింది. ఘటన జరిగిన నాటికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
నటి చౌరాసియాపై దాడి.. మిస్టరీ వీడింది..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సినీ నటిపై దుండగుడి దాడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలు చౌరాసియా వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి..లైంగికి దాడికి యత్నించి సెల్‌ఫోన్ తస్కరించి పరారైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సెల్‌ఫోనే నిందితుడిని పట్టించడం గమనార్హం. ఆదివారం రాత్రి వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న బాధిత నటి తన మోచేతితో దుండుగుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీసింది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న వెస్ట్ జోన్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి అటు సీసీ కెమెరాలతో పాటు ఇటు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను జల్లెడ పట్టాయి. ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో నిందితుడు ఇందిరానగర్ ప్రాంతంలో సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా గుర్తించిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. కృష్ణానగర్, ఇందిరానగర్ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు ఆ రోజు వేసుకున్న షర్ట్, ప్యాంట్ కలర్ ఆధారంగా ఊహా చిత్రాన్ని తయారు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు ఆరోజు నిందితుడు వేసుకున్న షర్ట్‌ను గుర్తించిన సహచరులు పోలీసులకు తగిన ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు నిందితుడి గదిలో ఉండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెల్‌ఫోన్ దొరకడంతో అతడే నిందితుడని నిర్ధారించారు. రెక్కీ చేసి.. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు నిందితుడు వెల్లడించినట్లుగా తేలింది. ఘటన జరిగిన నాటికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
నటి చౌరాసియాపై దాడి: సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా?
సంచలనం కల్గించిన సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆగంతకుడిని పోలీసులు గుర్తించలేకపోయారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో నడక సాగిస్తున్న నటి చౌరాసియాపై గత ఆదివారం రాత్రి దుండగుడు దాడి చేసి కొట్టి, హత్యాయత్నానికి పాల్పడి పరారైన విషయం పాఠకులకు విదితమే. అదే రోజు రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నటిపై దాడి కేసులో నిందితుడిని గుర్తించేందుకు బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సమీపంలోని మైలాన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో మాత్రం నిందితుడి ఆనవాలు అస్పష్టంగా నిక్షిప్తమైనట్లు తెలుస్తున్నది. అక్కడి నుంచి కళింగ ఫంక్షన్ హాల్ చౌరస్తా, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలించగా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. కేబీఆర్ పార్కు వాక్‌వేలో ఉన్న 64 సీసీ కెమెరాలు పనిచేయకపోవడంలో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. ఇప్పటికే పార్కు చుట్టూ 76 సీసీ కెమెరాల ఫుటేజేలను వడపోశారు. ఒక్క దాంట్లో కూడా నిందితుడు ఆచూకీ నమోదు కాలేదు. సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా? సీసీ కెమెరాలను తప్పించుకుంటూ నిందితుడు పార్కు చుట్టూ తిరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని చిచ్చాస్ హోటల్ వద్ద కూడా సీసీ కెమెరాలు పరిశీలించగా అవి పార్కింగ్ వైపు ఫోకస్ లేకపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ► గడిచిన మూడు రోజులుగా 20 మంది పోలీసులు చుట్టూ సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. నటి వద్ద నుంచి నిందితుడు ఫోన్ తస్కరించడంతో ఆ ఫోన్ సిగ్నల్స్ కోసం కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఫోన్లో ఉన్న నటి సిమ్ కార్డు తొలగించి నిందితుడు కొత్త సిమ్‌కార్డు వేసుకుంటాడేమోనన్న ఆలోచనతో పోలీసులు ఎప్పటికప్పుడు సిగ్నల్స్‌పై దృష్టి పెట్టారు. ► జీహెచ్ఎంసీ వాక్‌వేలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత పోలీసులు ఏనాడూ దృష్టి పెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు పనిచేసేలా చేసి ఉంటే నిందితుడిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇక్కడి పోలీసులు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా అయిపోయాక పార్కు చుట్టూ డజన్ల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇంకా మొదలు కానీ మరమ్మతులు... నటిపై ఆదివారం రాత్రి జీహెచ్ఎంసీ వాక్‌వేలో దాడి జరగగా మూడు రోజులు గడుస్తున్నా వాక్‌వేలో ఉన్న 64 సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టగా కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దాతల నుంచి విరాళాలు సేకరించి పార్కు చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేశారు. ► ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన సంస్థకు రూ. 15 లక్షలు బాకీ పడ్డట్లుగా తేలింది. ఫలితంగానే సదరు సంస్థ ఈ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేసింది. నగర పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. తక్షణం రూ. 15 లక్షలు అందజేసేందుకు ముందుకొచ్చారు. పని చేయని కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే సదరు సంస్థ మరమ్మతులకు ఇంకా ముందుకు రాలేదు. కొత్తవి కూడా... కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీ వాక్‌వేలో ఇప్పుడున్న సీసీ కెమెరాలను బాగు చేసి అదనంగా మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో సర్వే చేయాలని కూడా నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో పార్కు చుట్టూ ఒక బృందం పర్యటించి కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనుంది. సీసీ కెమెరాలే దిక్కా..! సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు లేని కాలంలో అప్పటి పోలీసులు ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తు ఎలా చేసేవారు..? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతున్నది. తాజాగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై దుండగుడు దాడి చేసి పరారు కాగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఇంకా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే ఆధారపడుతున్నారు. ఇవి లేని కాలంలో అప్పటి పోలీసులు మిస్టరీని ఎలా ఛేదించేవారని ఓ ఉన్నతాధికారి పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఎంతసేపూ నేరం జరిగినప్పుడు సీసీ కెమెరాలు, సెల్ఫోన్లపైనే ఆధారపడుతున్నారని శాస్త్రీయ దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ఆయన నిలదీసినట్లుగా కూడా సమాచారం. నగరంలో ఏ ఘటన జరిగినా పోలీసులు హుటాహుటిన సీసీ కెమెరాలు పరశీలిస్తున్నారు. ఇది ఒకందుకు నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నా ఒక వేళ అక్కడ కెమెరా లేకపోతే ఇక ఆ నిందితుడిని పట్టుకోవడానికి మార్గమే లేదా అని ఉన్నతాధికారులు కొంత కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ దిశలో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు ఘటనలో ఇక్కడి పోలీసులకు సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు ఉపయోగపడటం లేదు. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే మరింత శాస్త్రీయమైన పద్ధతులను అవలంభించాల్సిన పరిస్థితులు తలెత్తగా ఆ దిశగా ఉన్నతాధికారులు కూడా నిర్దేశం చేస్తున్నారు. -
చంపి కాల్చేస్తానన్నాడు.. మోచేతితో కొట్టి.. రెయిలింగ్ పైనుంచి దూకి..
గచ్చిబౌలి: దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించినట్లు సినీనటి షాలూ చౌరాసియా అన్నారు. బుధవారం కొండాపూర్‌లో మీడియాతో కేబీఆర్ పార్కు ఘటనను వివరించారు. కేబీఆర్ పార్కు సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. మెయిన్ గేట్ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు. తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడని.. ఫోన్ పే చేస్తానని డయల్ 100కు రెండుసార్లు ఫోన్ చేశాని చెప్పారు. గమనించిన దుండగుడు తన సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడని పేర్కొన్నారు. హెల్ప్ అంటూ అరుస్తుండగా అదే పనిగా చేతులు, ముఖంపై దాడి చేశాడని వివరించారు. బండరాయిపైకి తోసివేయడంతో స్పృహ తప్పానని, కొద్ది సేపటికి తేరుకున్నానని చెప్పారు. బండరాయితో ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా మోచేతితో ప్రైవేట్ పార్ట్‌పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకున్నానని తెలిపారు. ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్ అని అరవడంతో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపై అనుమానం లేదన్నారు. కేబీఆర్ పార్క్‌లో లైటింగ్ అమర్చాలని ఎఫ్డీసీ అధికారులకు సూచించారు. పోలీసులు బాగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి
-
కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలోని కేబీఆర్ పార్కులో సినీ నటిపై ఒక ఆగంతకుడు దాడిచేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి సెల్‌ఫోన్ తస్కరించి పరారయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్‌లో నివసించే నటి షాలూ చౌరాసియా (24) (సైకో, కాలింగ్ సహస్ర ఫేమ్) ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వచ్చారు. పార్కు చుట్టూ ఉన్న వాక్‌వేలో నడుస్తుండగా 8.45 గంటల సమయంలో వెనకాల అనుసరిస్తున్న దుండగుడు ఆమెను అడ్డగించి గట్టిగా పట్టుకొని కిందికి తోసేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తేరుకొని అరవడానికి ప్రయత్నిస్తుండగా నోట్లో గుడ్డలు కుక్కాడు. రెండు చేతులూ వెనక్కి విరిచి బండరాయి పెట్టాడు. కాళ్లు కదపకుండా దుండగుడు తన కాలును గట్టిగా ఒత్తిపెట్టాడు. మరో కాలును ఆమె మెడపై నొక్కి పెట్టి ఓ రాయితో కొట్టాడు. పది నిమిషాలపాటు పెనుగులాడుతూ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు యత్నించినా విడిచిపెట్టలేదు. అరిస్తే చంపేస్తానంటూ ఓ బండరాయిని ఎత్తి బెదిరించాడు. దాడిలో నటి కాళ్లు, చేతులు, ముఖంపైన గాయాలయ్యాయి. ఆమె సెల్‌ఫోన్ తీసి ఫోన్ చేసే క్రమంలో దాన్ని లాక్కొని జేబులో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా శక్తిని కూడదీసుకున్న ఆమె ఒక్క ఉదుటన లేచి కేకలు వేస్తూ పరుగులు తీశారు. పార్కు వాక్‌వేను ఆనుకొని ఉన్న ఫెన్సింగ్ పైనుంచి రోడ్డువైపు ఫుట్‌పాత్‌పైకి దూకారు. నటి అరుపులు విని ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్ హోటల్ వ్యాలెట్ పార్కింగ్ డ్రైవర్లు పరిగెత్తుకొచ్చారు. దీంతో దుండగుడు పరారయ్యాడు. చౌరాసియా డ్రైవర్ల ఫోన్ తీసుకొని తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌరాసియాను చికిత్స నిమిత్తం స్టార్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు, నగదు ఇవ్వాలని దుండగుడు అడిగాడని, మూడుసార్లు రాళ్లతో దాడి చేశాడని అందులో పేర్కొన్నారు. బండరాయితో మోది చంపేస్తానని బెదిరించాడన్నారు. 4 బృందాలతో గాలింపు నటి షాలూ చౌరాసియాపై ఆగంతకుడి దాడి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నిందితుడిని పట్టుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఒకవైపు బంజారా హిల్స్ లా అండ్ ఆర్డర్, క్రైం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా.. ఇంకోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులూ జల్లెడ పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే గాలింపు ముమ్మరం చేశారు. వాకింగ్ వచ్చిన వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు. పార్కు చుట్టూ వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకున్న 73 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా స్పష్టత లేకపోవడంతో పార్కు చుట్టూ రోడ్లపై ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారి వివరాలను ఆరా తీస్తూ వారి కదలికలను గమనిస్తున్నారు. ఇంకోవైపు బాధిత నటి సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. నిందితుడు ఫోన్ చోరీ చేసిన కొద్దిసేపట్లోనే స్విచ్చాఫ్ చేశాడు. ఎక్కడ స్విచ్చాఫ్ చేశాడో ఆ ప్రాంతాన్ని గుర్తించారు. అటువైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ సెల్ఫోన్లో మరో సిమ్‌కార్డు వేసుకుంటే సెల్‌టవర్ ఆధారంగా గుర్తించేందుకు అవకాశం ఉండటంతో సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. -
Hyderabad: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే..
ఏపుగా పెరిగిన చెట్లతో రంగురంగుల పూల మొక్కలతో పరుచుకున్న పచ్చదనం ఒక వైపు... అందమైన ఆకృతులలో రాళ్ల వరుసలు మరోవైపు... ఇదీ జూబ్లీహిల్స్ కాలనీలో ఆకట్టుకునే తీరు. నాణ్యమైన ప్రాణవాయువుకు జూబ్లీహిల్స్ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెలువరించిన నివేదికలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో నాణ్యమైన వాయువు ప్రజలకు అందుతోందని వెల్లడించింది. – బంజారాహిల్స్ క్రమం తప్పకుండా... సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటీ, మానిటరింగ్ ప్రోగ్రామ్‌లలో ఎక్కడెక్కడ గాలి ఎలా ఉందన్నదాన్ని అంచనా వేస్తుంటారు. ప్రతినెలా ఈ లెక్కింపు ఉంటుంది. దీని ప్రకారమే నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి గాలి లభిస్తుందన్నది నివేదిక ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రతిసారి జూబ్లీహిల్స్ స్వచ్ఛమైన గాలికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, కాలనీల్లో కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేకపోవడం, కాంక్రీట్ జంగిల్‌గా మారకపోవడంతో ఇక్కడ ప్రతిసారి స్వచ్ఛమైన లభించేందుకు కారణమవుతున్నాయి. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్(ఎక్యూఐ) నివేదిక ప్రకారం నగరంలోని స్వచ్ఛమైన గాలి జూబ్లీహిల్స్‌లో లభిస్తున్నట్లుగా గుర్తించారు. నగరంలో 32 చోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ ప్రోగ్రామ్ (ఎన్ఏఎంపీ)ల ద్వారా ఎక్కడెక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. గుడ్, సాటిస్‌ఫ్యాక్టరీ, మాడరేట్, పూర్, వెరీపూర్, సెవర్ తదితర అంశాలలో ఎక్కడెక్కడ ఏ రకమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. దీని ప్రకారమే జూబ్లీహిల్స్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నెల మొదటి వారంలో గుర్తించిన జాబితాలో జూబ్లీహిల్స్ మొదటి స్థానం దక్కించుకుంది. పచ్చదనమే కారణం... జూబ్లీహిల్స్ కాలనీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పచ్చదనం ఎక్కువ. ఇక్కడ అపార్ట్మెంట్ల కంటే వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా ఉండటం, ఆ నివాసాల్లో మొక్కలు, చెట్లతో పాటు రోడ్లకు రెండువైపులా భారీ వృక్షాలు కూడా స్వచ్ఛమైన గాలి రావడానికి కారణమని కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్‌లు పేర్కొంటున్నారు. కేబీఆర్ పార్కు కూడా... జూబ్లీహిల్స్ కాలనీని ఆనుకొని 360 ఎకరాల్లో కేబీఆర్ పార్కు విస్తరించి ఉన్నది. పార్కులో 70 శాతం దట్టమైన అడవి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్వచ్ఛమైన గాలితో ఉంటున్నాయి. జూబ్లీహిల్స్ కాలనీకి కేబీఆర్ పార్కు పచ్చదనం కూడా ఒక వరంగా మారిందనే చెప్పాలి. చదవండి: Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
కేబీఆర్ పార్క్ వద్ద విషాదం.. మార్నింగ్ వాక్కు వచ్చి
సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వచ్చిన ఓ కానిస్టేబుల్ హఠాత్తుగా మరణించాడు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కోసం పార్క్‌కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. సూర్యనారాయణ సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
కన్న ఒడి.. కన్నీటి తడి!
సాక్షి, హైదరాబాద్: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డునంబర్– 10లోని ఫుట్‌పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద కేబీఆర్ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది. వెంకమ్మది మరో దీనగాథ.. నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. ఆదుకోని నైట్‌షెల్లర్లు జీహెచ్ఎంసీ సర్కిల్– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు. – బంజారాహిల్స్ -
హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినూత్నంగా ‘లూ కేఫ్’ పేరుతో మొట్టమొదటి ఫ్రీ చాయ్, బిస్కెట్ కౌంటర్ ప్రారంభమైనది. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కుకి ఎదురుగా ప్రారంభించిన ఈ స్టాల్‌ను రవీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇగ్జోరా కార్పొరేట్ సేవల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లూ కేఫ్ హెడ్ అభిషేక్ బంది వాడేకర్ మాట్లాడుతూ.. కేబీఅర్ పార్కు, దానికి సమీపంలో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం చాలా మంది నగరవాసులు వస్తుంటారు. వారందరికి ఉచితంగా చాయ్ బిస్కెట్, మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్ ను ప్రారంభించామని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా పరిశుభ్రమైన వాష్ రూమ్ అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి: మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్ ఇచ్చి -
కమలంలో లుకలుకలు!
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు వేదికగా బీజేపీలో నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద శనివారం వాకర్లను ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కూడా వచ్చారు. చింతల రావడంతోనే అప్పటికే అక్కడికి వచ్చిన పార్టీ నేత గోవర్ధన్‌ను పక్కకు జరగాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గోవర్ధన్ చింతలపై విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాహాబాహికి దిగేందుకూ యత్నించారు. కాగా,పరిస్థితి చేయిదాటుతుండటంతో వెంట నే పక్కనే ఉన్న నేతలు కలగజేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. మొన్నటి కార్పొరేటర్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ టిక్కెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని పల్లపు గోవర్ధన్ కోపంతో ఉన్నారు. దీంతో చింతలతో విభేదాలు తలెత్తాయి. -
‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!
జూబ్లీహిల్స్: సోషల్ మీడియాలో బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రి వైపు కేబీఆర్ పార్కు పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు వైరల్ అయిన వీడియో అవాస్తవం అని అధికారులు తేల్చేశారు. మంగళవారం తెలంగాణ యాంటీ పోచింగ్ స్క్వాడ్ బృందం కేబీఆర్ పార్కు పరిసరాల్లో విచారణ జరిపి ఈ వీడియో ఆకతాయిలు చేసిన పని అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ వీడియో తిరుమల కొండల్లోని సీసీ ఫుటేజీ వీడియో అని అనవసరంగా ఇక్కడి వీడియో అని కొంత మంది ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వైరల్ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు కౌసర్ అలీ, యాసిన్, మహేష్, సతీష్, శ్రీను పాల్గొన్నారు. -
పట్టుకో చూద్దాం...
లాక్డౌన్ ఉండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఓ నెమలి కేబీఆర్ పార్కులోంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్క నెమలిని చూసి వెంటపడింది. ఇది గమనించి నెమలి నేను.. దొరకనుపో అన్నట్లు పార్కులోకి ఎగిరి వెళ్లిపోయింది. (మనుషులు కనిపించగానే వెర్రెత్తినట్లు దూకుడు) -
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
-
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో అరుదైన జంతువులు అటు సందర్శకులు.. ఇటు వాకర్లకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయనడం అతిశయోక్తికాదు. ఆ కోవలోకే వస్తుంది అలుగు. చూస్తూనే చిన్న డైనోసార్ గుర్తుకొచ్చేలా ఉన్న తొండజాతికి చెందిన జంతువు అలుగు. దీని ముక్కు సూటిగా పొడవుగా ఉండి చీడ పురుగులు, చీమలను మాత్రమే తింటుంది. పొలుసుల్లా.. రాయిని పోలినట్లు మందంగా దీని చర్మం ఉంటుంది. ఈ జంతువు ఎవరికీ హాని తలపెట్టదని.. చాలా అరుదుగా కనిపిస్తుంటుందని పార్కు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా వాక్ వేలో మెల్లగా వెళ్తున్న ఈ జంతువును వాకర్లు తమ కెమెరాల్లో బంధించారు. -
‘డిక్కీ’ దొంగ ఆటకట్టు
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వచ్చేవారి వాహనాల నుంచి చాకచక్యంగా నగదు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న వ్యక్తిని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ క్రైం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు తమ బైక్‌లను పార్కు సమీపంలో పార్కింగ్ చేస్తుంటారు. వీరిలో కొందరు యాక్టీవా బైక్‌ల సీట్ల కింద తమ పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులను భద్రపరిచి లోపలికి వెళ్తుంటారు. దీనిని అదునుగా తీసుకుని గత కొంత కాలంగా అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ స్క్రూడ్రైవర్‌తో సీటు తొలగిస్తూ అందులో ఉన్న వస్తువులు తస్కరిస్తున్నాడు. గత నెల రోజుల్లో ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. గురువారం ధరంకరం రోడ్డుకు చెందిన రఘు అనే వ్యక్తి తన బైక్‌ను పార్కింగ్ చేసి లోపలికి వెళ్లగా దీనిని గుర్తిం,ఇన సత్యనారాయణ డిక్కీలో నుంచి రూ. 4,800 నగదు తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా పార్కు ముందు డ్యూటీలో ఉన్న ఇంటర్‌సెప్టర్ వెహికిల్ కానిస్టేబుళ్లు ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్ యాదవ్, హోంగార్డు రాజేశ్వర్‌జీ అతడిని గుర్తించారు. దీనిని పసిగట్టిన సత్యనారాయణ పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా సందులోకి పరిగెత్తుతుండగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులకు అప్పగించారు. గత కొంత కాలంగా పార్కింగ్ చేసిన వాహనాల్లోంచి సెల్ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఐడియా.. బాగుందయా
‘వాట్ యాన్ ఐడియా సర్జీ’.. ఓ యాడ్‌లో జూనియర్ బచ్చన్ డైలాగ్ ఇదీ.. ఇప్పుడు సీనియర్ బచ్చన్.. అదేనండి అమితాబ్ బచ్చన్ కూడా అదే అంటున్నారు.. జీహెచ్ఎంసీ, నగర పోలీసుల యత్నాన్ని ‘సూపర్ ఐడియా’ అంటూ కొనియాడుతున్నారు.. మహారాష్ట్రలోని పుణే ట్రాఫిక్ పోలీసులు కూడా దీన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు.. కోయంబత్తూరూ ఇదే దారిలో ఉంది.. అటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. ఇంతమందిని ఆకర్షించిన ఆ ఐడియా.. ఇంతకీ ఏంటి? – సాక్షి, హైదరాబాద్ ఏం చేశారు.. నగరంలో కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ స్టాప్ లైన్ ఏర్పాటు చేశారు. అంటే సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్టాప్‌లైన్ కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో దాన్ని చూపే విధంగా డిజైన్ చేశారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్ఈడీ లైన్ కూడా ఆరంగులో కనిపిస్తుందన్నమాట. వాహనాలు దీనిపై నుంచి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందీ లేని సామగ్రితో తయారుచేశారు. రాత్రి వేళల్లో ఇవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎందుకు పెట్టారు.. సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చాలా మంది ఓ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదేంటంటే.. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నచోట్ల మినహాయిస్తే జంక్షన్లలో కుడివైపునే సిగ్నల్స్ ఉంటున్నాయి. దీంతో ఎడమ వైపుగా వెళ్ళే వారికి పక్కగా భారీ వాహనం ఉంటే.. సిగ్నల్ సరిగా కనిపించడం లేదు.. దీంతో రెడ్‌సిగ్నల్ పడిన విషయం గుర్తించలేక స్టాప్‌లైన్ క్రాసింగ్ జరుగుతోంది. ఫలితంగా జరిమానానే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అటు పాదచారులు రోడ్డు దాటే లైన్స్ పరిస్థితీ అంతే. పగటి వేళల్లోనే వీటిని గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. రాత్రిపూట అయితే, రోడ్డు దాటే పాదచారులకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ సంస్థ ట్రాఫిక్ పోలీసుల్ని సంప్రదించింది. ఎల్ఈడీ లైట్లతో కూడిన స్టాప్‌లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేసింది. ఈ ఎల్ఈడీ లైన్ ఏర్పాటు చేయడానికి మీటర్‌కు రూ.6500 వరకు ఖర్చు అవుతోంది. బాగుందిగా మరి.. విస్తరిస్తోనో.. ఇలా చేయాలంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) అనుమతి అవసరం. ఎందుకంటే దేశంలో రహదారి నిర్వహణ, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలంటే ఐఆర్సీ అనుమతి ఉండాల్సిందే. ఎవరైనా చేపట్టిన/చేపట్టనున్న ప్రయోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఆర్సీకి పంపిస్తే.. దాని వల్ల కలిగే లాభాలు, లోపాలు తదితరాలను అధ్య యనం చేసిన తర్వాత ఐఆర్సీ తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆ తర్వాతే కొత్త విధానం పూర్తిగా అమలు చేయవచ్చు. నగరానికి ఎల్ఈడీ స్టాప్లైన్స్ను ఏర్పాటు చేసిన సంస్థే ఐఆర్సీ అనుమతి కోసం ఆ విభాగంతో సంప్రదింపులు జరుపుతోంది. అంతా ఒకే అయితే.. సిటీ అంతా ఎల్ఈడీ స్టాప్ లైన్లు జిగేలుమననున్నాయి. -
మద్యం మత్తులో యువతుల హల్చల్
-
మద్యం మత్తులో యువతుల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం అర్థరాత్రి యువతులు హల్చల్ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై రాళ్లతో దాడి చేశారు. వీరి వెంట మరో నలుగు యువకులు కూడా ఉన్నారు. యువతుల ఘర్షణతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని బంజారాహిల్స్‌లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
కేబీఆర్ పార్కు పాస్‌ల ధర పెంపు
బంజారాహిల్స్: నగరంలోని కేబీఆర్ పార్కు వార్షిక పాస్‌ల రెన్యువల్ తేదీని ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు వాకర్లు తమ వార్షిక ప్రవేశ పాసులను పార్కు వెబ్సైట్లో రెన్యువల్ చేసుకోవాలని డీఎఫ్ఓ విజ్ఞప్తి చేశారు. కాగా.. 2019–20 సంవత్సరానికి వార్షిక పాస్‌లతో పాటు అన్ని కేటగిరీల పాసుల ధరలను పెంచారు. గతేడాది వార్షిక పాస్ రుసుం రూ.1,850 ఉండగా ఈసారి రూ.2,035కు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పాస్ గతేడాది రూ.1,200 ఉండగా దాన్ని రూ.1,320కి పెంచారు. ఇక నెలవారీ పాసులను సైతం రూ.550 చేశారు. రోజువారీ ఎంట్రీ టికెట్ ధర రూ.25 నుంచి రూ.30కి, పిల్లలకు రూ.10 నుంచి రూ.15కు పెరిగాయి. -
‘కేబీఆర్’లో రన్నింగ్, జాగింగ్ నిషేధం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని కేబీఆర్ పార్కును కేవలం వాకింగ్‌కు మాత్రమే వినియోగించుకోవాలని... ఇక్కడ రన్నింగ్, జాగింగ్ చేయరాదంటూ జిల్లా అటవీ శాఖాధికారి సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో రన్నింగ్, జాగింగ్‌ను నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 3వేల మందికి పైగా, సాయంత్రం 1500 మందికి పైగా వాకర్లు పార్కులో వాకింగ్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ట్రైనర్లుగా నియమించుకొని పార్కులో రన్నింగ్, జాగింగ్ చేస్తున్నారు. దీంతో అసలే ఇరుగ్గా ఉండే వాకింగ్ ట్రాక్‌పై వాకర్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పార్కులో వెయ్యి మందికి పైగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా పరుగెత్తుకొస్తున్న వారితో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్నిసార్లు పరుగెత్తుకొస్తున్న వారు పొరపాటున వీరికి తగులుతుండడంతో కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాగింగ్, రన్నింగ్‌ను అధికారులు నిషేధించారు. -
ఆ నిర్ణయం పర్యావరణానికి చేటే!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ జాతీయ పార్క్‌తోపాటు మృగవని, హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనాల చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ (పర్యావరణ పరంగా సున్నితప్రాంతం)పరిధి కుదింపుపై పర్యావరణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేబీఆర్ పార్క్ వద్ద ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా బహుళ వరుసల దారుల నిర్మాణం కోసం జోన్ పరిధిని కొన్ని చోట్ల మూడు మీటర్లు..మరికొన్ని చోట్ల 28 మీటర్లకు కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోందని..ఈ మేరకు అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు సైతం సర్కారు నివేదించినట్లు వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు నవంబరునెలలో ఆశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి తమ అభ్యంతరాలను కూడా నివేదించామని చెబుతున్నారు. పర్యావరణవాదుల అభ్యంతరాలివే.. దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు జాతీయ పార్కుల చుట్టూ పర్యావరణ పరంగా సున్నితప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్) సుమారు 10 కిలోమీటర్ల మేర ఉండాలి. మన నగరంలో ఈ పరిస్థితి లేనందున ప్రస్తుతం ఉన్న జోన్ పరిధిని సైతం తగ్గించే ప్రయత్నం చేయడంతో సుమారు 400 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న కేబీఆర్ పార్క్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ జాతీయ ఉద్యానవనంలోని సుమారు 200 వృక్ష, జంతుజాలం, పక్షుల మనుగడ కష్టసాధ్యమౌతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు, ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, ప్రధాన రహదారులున్నప్పటికీ నగరం నడిబొడ్డున ఉన్న ఈపార్క్ నగరవాసులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తోందని..ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పార్క్‌లో వాకింగ్, ఇతర శారీరక వ్యాయామాలు చేసేవారికి ఆనందం, ఆరోగ్యం కల్పిస్తోందంటున్నారు. ఈ తరుణంలో పార్క్ చుట్టూ సున్నిత ప్రాంత పరిధిని 28 మీటర్లకు తగ్గించడం శోచనీయమని పర్యావరణ వేత్తలు లుబ్నాసర్వత్, దొంతి నరసింహారెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై తాము కేంద్ర, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల వివరాలను సైతం గోప్యంగా ఉంచడం పట్ల వారు ఆక్షేపించారు. మరోవైపు చిలుకూరులోని మృగవని, వనస్థలిపురంలోని హరిణ వనస్థలి జాతీయ పార్కుల చుట్టూ ఎకోసెన్సిటివ్ జోన్ పరిధిని ఒక కిలోమీటరుకు కుదించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం తాము అడ్డుకుంటామని..ఈ విషయమై న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టంచేశారు. ప్రభుత్వ వర్గాల వాదన ఇదీ... కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు చోట్ల ఉన్న ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు సుమారు రూ.586 కోట్లతో బహుళ వరుసల దారులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వీలుగా పరిధిని కుదించాల్సిన అవసరం ఉందని బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం జోన్ పరిధిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ విషయమై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి తుది నోటిఫికేషన్ వెలువడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇరు వర్గాల వాదనలను ఆ శాఖ పరిశీలిస్తుందని..త్వరలో ఈవిషయమై స్పష్టత రానుందని పేర్కొన్నారు. -
కిం కర్తవ్యం?
సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్కు చుట్టూ రూ.586 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకున్న ఫ్లై ఓవర్ల పనులు అగమ్య గోచరంగా మారాయి. టెండర్లు పూర్తయి కూడా దాదాపు రెండున్నరేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లతో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు చేపట్టిన ఆందోళన లతో పనులకు బ్రేక్ పడటం తెలిసిందే. అక్కడ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ అంశానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అప్పటి దాకా ఏమీ చేయ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేసుకునే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే దాదాపు నాలుగునెలల క్రితం లేఖ రాసినట్లు సమాచారం. టెండరు పొందిన కాంట్రాక్టరుకు 24 నెలల్లో పనులు చేసేందుకు స్థలాన్ని అప్పగించని పక్షంలో నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సిగ్నల్ ఫ్రీ కోసం... ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రణాళికలు రూపొం దించడం తెలిసిందే. ఎస్సార్డీపీలో మొత్తం ఐదు దశలుండగా, తొలిదశలో తొలిప్యాకేజీ కేబీఆర్‌చుట్టూ ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. అందులో ఆరు ముఖ్యమైన పనులున్నాయి. అవి.. 1. కేబీఆర్‌పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ 2. ఫిల్మ్‌నగర్ జంక్షన్ 3. రోడ్ నెంబర్ 45 జంక్షన్ 4. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ (ఇక్కడ రోడ్డు వెడల్పుతోపాటు పాదచారులకు సదుపాయాలు, ప్రత్యేక బస్‌బేలు, జాగింగ్‌ట్రాక్ తదితరమైనవి ఉన్నాయి) 5. ఎన్ఎఫ్సీఎల్– కేబీఆర్పార్క్ ఎంట్రెన్స్ 6. రోడ్ నెంబర్ 45 – దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్. వీటిల్లో దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు మాత్రం ప్రారంభం కాగా, ఎకో సెన్సిటివ్‌జోన్ అంశంతో ముడిపడి ఉన్నందున మిగతా ఐదు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వీటి రద్దు కోసం ప్రభుత్వానికి రాయడంతో ఇవి కార్యరూపం దాలుస్తాయా.. లేదా అనే సంశయాలు నెలకొన్నాయి. అన్నీ అనుకూలిస్తే కార్యరూపం దాల్చేందుకు ఎంత సమయం పడుతుందన్నది కూడా అంతుపట్టకుండా ఉంది. దాదాపు రూ. 25వేల కోట్ల ఎస్సార్డీపీ పనుల్లో దిగువ పనులున్నాయి. 7 స్కైవేలు : 135 కి.మీ. 11 మేజర్ కారిడార్లు: 166 కి.మీ. 68 మేజర్ రోడ్లు: 348 కి.మీ. ఇతర రోడ్లు: 1400 కి.మీ. గ్రేడ్ సెపరేటర్లు: 54 ♦ ఇవి పూర్తయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ కారిడార్లలో సమస్యలు పరిష్కారమవుతాయి. ♦ చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ జంక్షన్ల ఫ్లై ఓవర్ల పనులు పూర్తయి ఇప్పటికే అందుబాటులోకి రాగా, షేక్‌పేట, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్లలో రూ.333.55 కోట్ల పనులు, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో రూ.263.09 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు వివిధ ప్రక్రియల్లో ఉన్నాయి. -
పెద్దమ్మ తల్లి స్టిక్కర్ పట్టించింది..
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కువచ్చిన ప్రముఖ వ్యాపారి బెంజ్ కారు నుంచి రూ.10 లక్షలు అపహరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళంకు చెందిన అంబాటి శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తూ మాదాపూర్ సమీపంలోని గుట్టలబేగంపేటలో ఉంటున్నాడు. ఖరీదైన కార్లపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ఈ నెల 18న కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వచ్చిన వ్యాపారి చెరుకూరి కృష్ణమూర్తి అనంతరం తన బెంజ్ కారు ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 47లోని ప్లాట్ నెంబర్ 717 ముందు నిలిపి తన స్నేహితుడు అనూప్ కుమార్ ఇంట్లోకి వెళ్లాడు. గంట తర్వాత బయటికి వచ్చి చూడగా వెనుక సీట్లో ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యాక్టీవా బైక్‌పై ఓ యువకుడు వచ్చినట్లు గుర్తించారు సదరు బైక్ నెంబర్ కనిపించకపోవడంతో షోరూంలో అదే కలర్ బైక్‌ల వివరాలు తీసుకున్నారు. బైక్‌పై ఉన్న పెద్దమ్మతల్లి స్టిక్కర్ ఆధారంగా సదరు బైక్‌ను గుర్తించారు. అనంతరం బైక్ నడిపిన వ్యక్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై నిఘా ఉంచి ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించగా తాళం వేయకుండా ఉన్న ఆ కారులోంచి డబ్బు తీసినట్లు అంగీకరించాడు. తన భార్యకు తెలియకుండా నగదు బ్యాగ్‌ను ఇంట్లో బీరువాపై దాచినట్లు తెలిపారు. రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకొని బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
తింటే షిండే దోసే తినాలి
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కి రెండు సందుల అవతల చూస్తే ఓ షాప్ ముందు జనం గుమిగూడి కనిపిస్తారు. అదేంటా అని మరికాస్త ముందుకు వెళ్లి చూస్తే.. బ్రాండ్ న్యూ రామ్స్ దోసె హౌస్ అని తెలుస్తుంది. అంత జనం ఉన్నారంటే అక్కడి దోసెకు ఎంత గిరాకీ ఉందో ఇట్టే తెలిసి పోతుంది. ఆ దోసె బండి ముందర బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ కార్లు క్యూ కడతాయి. ఎంతో ఓపికగా ఇచ్చిన ఆర్డరు కోసం నిరీక్షిస్తారు జనం. అక్కడి వస్తువుల ఖరీదు వంద రూపాయల కంటె తక్కువే. కాని లక్షల ఖరీదు చేసే కార్లలో వారు నిరీక్షించేలా చేస్తుంది రామ్స్ దోసె. వారి నిరీక్షణ ఫలితం చాలా ఖరీదైనదే అనుకుంటారు వారు. ఈ రెస్టారెంట్ విజయం వెనుక రహస్యం రామ్ షిండే చిరునవ్వులే. ఇది రామ్ షిండే పెట్టుకున్న రెండో బ్రాంచ్. మొదటిది నాంపల్లిలో ఉంది. దానికి రామ్ కీ బండి అని పేరు. ఇది కూడా రోడ్ పక్కనే ఉంటుంది. పదేళ్ల క్రితం ఈ దోసెల వ్యాపారం మొదలుపెట్టారు షిండే. రామ్ కీ బండి ప్రారంభించిన కొత్తల్లో దోసె పిండి రుబ్బుకుని, పెద్ద పెనం మీద దోసెలు వేసి, గిన్నెలన్నీ తనే కడుక్కునేవాడు. తను ఈ రోజు స్థాపించిన రెస్టారెంట్ చూసుకుంటే, ఆ రోజు అంత కష్టపడ్డానా అనుకుంటారు రామ్. అది నిజం కాదేమో అని కూడా అనుకుంటారు. అర్ధరాత్రి నడుపుతున్న ఆహార పదార్థాల బండ్లలో రామ్ కీ బండి కూడా ఒకటి. దీనికి ఐదుకి 4.2 రేటింగ్ ఇచ్చారు ఫుడ్ లవర్స్. నోరూరించే బటర్ దోసె కొబ్బరి చట్నీతో కలిపి తినడానికి అలవాటు పడ్డ భోజన ప్రియులు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దోసె తినడానికి వస్తుంటారు. 1989 నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా రామ్ కీ బండి దిగ్విజయంగా దోసెలు వేస్తూనే ఉంది. రామ్ కి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి ఈ బండి ప్రారంభించారు. ‘నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పడు నాన్న వెంటే తిరుగుతుండేవాడిని. దోసెలు ఎలా తయారుచేస్తున్నారు, ఇడ్లీలు ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు వంటివి చూసేవాడిని. పదేళ్ల క్రితం బండి నా చేతిలోకి వచ్చింది. నేను నాంపల్లిలో ప్రారంభించాను’ అని తెలియజేశారు రామ్‌షిండే. ఈరోజు ఈ దోసె బండి గురించి గూగుల్ సెర్చ్‌లో కొడితే వెంటనే కనపడుతుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి రామ్ జీవితమే ఒక పెద్ద ప్రేరణ. కొత్తల్లో తాను సరిగ్గా నడపలేనేమోనని చాలా భయపడ్డారట రామ్. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకున్నాడు. తాను చదువుకున్న ఎంబీఏని లెక్క చేయకుండా ఈ వ్యాపారంలోకి దిగాడు. రెస్టారెంట్ ప్రారంభించిన కొత్తల్లో రెండేళ్ల పాటు కస్టమర్లు చాలా తక్కువగా వచ్చేవారు. పెట్టుబడి డబ్బులు క్రమేపీ తరిగిపోసాగాయి. కొన్నిరోజులైతే రోజుకు కేవలం వంద రూపాయలే వచ్చేవి. కుటుంబ సభ్యులు సాయం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. చాలాసార్లు వ్యాపారం విడిచిపోవాలనిపించింది రామ్‌కి. కాని అకుంఠిత దీక్షతో నష్టాల్లోనే నడుపుతూ వచ్చాడు. అప్పుడే వచ్చింది రామ్‌కి ఒక మంచి ఆలోచన. ‘నగరంలో చాలా చోట్ల టేస్టీ దోసెలు దొరుకుతుండగా నా దగ్గరకే ఎందుకు వస్తారు? కొత్తరకం దోసెను కనిపెట్టాలి’ అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి వచ్చినవే చీజ్ దోసె, బటర్ దోసె, పనీర్ దోసె. అంతే క్రమేపీ ఆహారప్రియులు ఈ దోసెలకు ఆకర్షితులవడం ప్రారంభించారు. పిజ్జా దోసె దొరికే మొట్టమొదటి చోటు ఇదే. ‘నేను ఇచ్చే క్వాలిటీ చూసి మరింత మంది నా దగ్గరకు వస్తున్నారు’ అంటారు రామ్ షిండే. నాంపల్లి తర్వాత జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన దోసె హౌజ్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక్కడకు సినీనటులు, వీఐపీలు, యువత అధికంగా వస్తుంటారు. ‘యువత వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటారు, ఆ ప్రచారమే చాలు’ అంటూ సరదాగా అంటారు. ఈ రోజుకీ రామ్తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేస్తారు. మూడు గంటలకల్లా నాంపల్లి బండి దగ్గరకు వెళ్తారు. రెస్టారెంట్లో రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటారు. నాకిది కష్టంగా అనిపించదు. క్యాంటీన్లో వారంతా సంతోషంగా తింటుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది’ అంటారు రామ్ షిండే. -
కేబీఆర్ పార్కులో ఐపీఎస్ అధికారి భార్యపై దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి భార్యపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితికి గురైన ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్చారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్లో నివసించే ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ భార్య సుజాత మంగళవారం సాయంత్రం 5:30 ప్రాంతంలో కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారు. గౌని వెంకటరమణ (40) అనే వ్యక్తి ఆమెను అనుసరిస్తూ ఓ కర్రతో తలపై బలంగా కొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయమై, ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే చుట్టుపక్కల వాకర్లు బాధితురాలిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో అక్కడి నుంచి పరారవుతున్న వెంకటరమణను వాకర్లతో పాటు సెక్యూరిటీ గార్డులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వాకర్లను భయాందోళనకు గురిచేసింది. కర్రతో పరుగులు తీస్తున్న వ్యక్తిని చూసి కొందరు వాకర్లు బయటకు పరుగులు తీశారు. కాగా బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితుని మానసిక స్థితిపై బంజారాహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు గత 20 రోజుల నుంచి రెక్కీ నిర్వహించి ఆమెను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడని వారి విచారణలో తేలింది. ఘటనాస్థలాన్ని పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రస్తుతానికి పచ్చదనం సేఫ్
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తున్న కేబీఆర్ పార్కు చుట్టూ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పర్యావర ణానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తొలిదశ లో మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పనులకు అనుమతించాల్సిందిగా కోరుతూ జీహెచ్ఎంసీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. దసరా తర్వాత మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టను న్నారు. అన్ని జంక్షన్ల వద్ద ఒకేసారి పనులు చేపడితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతోపాటు, పర్యావరణ ప్రేమికుల నుంచి ఎదురయ్యే అభ్యంతరాలతోపాటు వెచ్చించాల్సిన నిధులు తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతానికి మూడు జంక్షన్ల వద్ద మాత్రం పనులు చేయాలని భావించారు. తద్వారా భూసేకరణ అవసరం తగ్గడంతోపాటు ట్రాన్స్ లొకేట్ చేయాల్సిన/ తొలగించాల్సిన చెట్లు సైతం సగానికి పైగా తగ్గనుండటం తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటూ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ల వద్ద జరిగిన సమావేశాల సందర్భంగానూ వీటి నిర్మాణ పనుల సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బం దుల్లేకుండా చూడాలని వారు ఆదేశించడంతో అందుకనుగుణంగా కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టేందుకు ఎవరి నుంచీ, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపో వడంతో వీలైనంత త్వరితంగా ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆటంకాలివీ.. మొత్తం 6 జంక్షన్లలో పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ, భూసేకరణ, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, క్యాన్సర్ ఆస్ప త్రి జంక్షన్ల వద్ద పనుల్ని పెండింగ్‌లో పెట్టారు. మిగతా 4 ప్రాంతాల్లో పనులకు పర్యావరణ ప్రేమికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎన్జీటీ స్టేతో పనులను నిలిపి వేశారు. తుది తీర్పుని చ్చిన ఎన్జీటీ ఎకో సెన్సిటివ్ జోన్‌కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ తుది నోటిఫికేషన్ అ నంతరం పనులు చేపట్టాల్సిందిగా సూచించింది. దీంతో ఏడాదికి పైగా పనులు ఆగిపోయాయి. మూడు జంక్షన్లలో పనులకు నో అబ్జెక్షన్.. ఎకో సెన్సిటివ్ జోన్‌తో సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ ఆటంకాలు వ్యక్తం కాకుండా, పెద్దగా భూసేకరణ అవసరం లేకుండా 3 ప్రాంతాల్లో పనులు చేపట్టవచ్చని భావించారు. ఆ మేరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 45, పార్కు ప్రవేశ ద్వారం వద్ద పనులు చేయాలని ప్రతిపాదించారు. జీహెచ్ఎంసీ వద్ద తగినన్ని నిధులు కూడా లేకపోవడంతో తొలుత ఈ పనులు చేస్తే చాలనే నిర్ణయానికి వచ్చారు. తొలగించా ల్సిన 1,400 చెట్లలో సగం చెట్లు కూడా తొలగించాల్సిన అవసరం లేదని గుర్తించారు. చేపట్టబోయే పనులు ఇలా.. కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ వద్ద.. ⇒ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి క్యాన్సర్ ఆస్పత్రి వైపు రెండు లేన్లతో మొదటి వరుస ఫ్లైఓవర్ ⇒ పంజగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మూడు లేన్లతో రెండో వరుస ఫ్లైఓవర్ ⇒ తొలుత రెండో వరుస ఫ్లైఓవర్ నిర్మిస్తారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద.. ⇒ సినీమ్యాక్స్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం.36 వైపు ఆరులేన్లతో మొదటి వరుస ఫ్లైఓవర్. దీనిపై రెండు వైపులా వెళ్లవచ్చు. ⇒ జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు నుంచి సినీమ్యాక్స్ వైపు రెండు లేన్లతో రెండో వరుస ఫ్లైఓవర్ ⇒ ఇక్కడ మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాక రెండో వరుస పనులు చేపడతారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 వద్ద.. ⇒ ఫిల్మ్‌నగర్ వైపు నుంచి చెక్‌పోస్ట్ వైపు మొదటి వరుస ఫ్లై ఓవర్. ⇒ చెక్‌పోస్ట్ వైపు నుంచి రోడ్ నంబర్ 45 వైపు రెండో వరుస ఫ్లైఓవర్. ⇒ రెండో వరుస ఫ్లైఓవర్ తొలుత పూర్తిచేస్తారు. తొలుత ప్రతిపాదించిన జంక్షన్లు ⇒ కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ ⇒ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ⇒ జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 ⇒ మహరాజ అగ్రసేన్ విగ్రహం ⇒ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ⇒ ఫిల్మ్‌నగర్ -
ఒక్క ‘నమస్తే’తో దొరికిపోయాడు
►ఆ కవలలు రియల్ హీరోలు ►చిన్న అనుమానమే పెద్ద దొంగను పట్టించింది. ►ఈ సారి థాయ్ మసాజ్‌కు ప్లాన్ ►మూడుసార్లు పోలీసులకు బురిడీ సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో గత పదేళ్లుగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేస్తే కచ్చితంగా పని చేసుకెళ్లే ఓ చైన్‌స్నాచర్ పదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పార్కు బ్లూ ప్రింట్ తీసుకుని, దొంగతనాలు జరిగిన తీరుపై సమీక్షించారు.. అయినా ఖాకీలను బురిడీ కొట్టిస్తూ ఎప్పటికప్పుడూ తనదైన రీతిలో పని కానిచ్చేస్తున్నాడు. దీంతో అతడి కోసమే ప్రత్యేకంగా పార్కు చుట్టూ 60 కెమెరాలు ఏర్పాటు చేయడమేగాక పార్కులో ఉన్న మరో 25 కెమెరాలపై నిఘా ఉంచారు. అయినా స్నాచింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉండటంతో మరో 20 కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇన్ని కెమెరాలకు చిక్కని నిందితుడు కేవలం ఒక ‘‘నమస్తే’’కు దొరికిపోయాడు. ఇద్దరు సినీ కవలలైన స్టంట్ మాస్టర్లు అతడిని పట్టించి రియల్ హీరోలుగా మిగిలారు.. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకట్వేర్‌రావు మంగళవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కార్మికనగర్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అలియాస్, నర్సింహ అలియాస్ రిషీ చిన్నా(25) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన కేబీఆర్ పార్కులో ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు బంగారు గొలుసులు (250 గ్రాములు), ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినప్పటికీ పోలీసులను బురిడీ కొట్టించి బయట పడినట్లు తెలిపారు. నిందితుడితోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన ఓం నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణచారిని కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. రిచ్‌గా ఉండాలని... నర్సింహ అలియాస్ రిషీచిన్నా చదివింది పదో తరగతి. విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకనే అతను అందుకోసం చోరీల బాట పట్టాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను దానికి సమీపంలోనే ఉన్న సుజాత హైస్కూల్లో చదివినట్లు చెప్పుకొనేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని బీటెక్ చదివానంటూ అందరినీ నమ్మించేవాడు. పబ్బులకు వెళ్లాలని, గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగాలని, విదేశీ టూర్లు, బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. అదే ఆలోచన నర్సింహను రిషీగా మార్చింది. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకొనేలా చేసింది. కేబీఆర్ పార్క్ కొట్టిన పిండి నర్సింహకు పోలీసులు సేకరించిన కేబీఆర్ బ్లూప్రింట్ కంటే ఎక్కువగా పార్కు చుట్టూ ఉన్న కెమెరాలు, ఎక్కడి నుంచి వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికి రావాలి అనే ప్రతి విషయం తెలుసు. దీంతో అతను కేబీఆర్ పార్కు చాలా సేఫ్ ప్లేస్‌గా భావించాడు. ఇక్కడే రెండు నెలల వ్యవధిలో స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ పార్క్‌కు వచ్చేవాడు. వాకింగ్ చేసినట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. తోటి వాకర్లకు అనుమానం రాకుండా మసలుకునేవాడు. పట్టించిన నమస్తే.. పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వాకర్లను గుర్తుపెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో అతను రోజూ పార్కుకు వస్తున్న కవల స్టంట్ మాస్టర్లకు నమస్తే పెట్టేవాడు. ఈ క్రమంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కున అతను అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా వారు ఎదురయ్యారు. ఎప్పటిలానే నర్సింహ వారికి నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం ముందుకు వచ్చిన వారికి స్నాచింగ్ జరిగిందని తెలియడం, ఆ సమయంలో అటువైపు అతనొక్కడే వెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. తాజాగా నాలుగు రోజుల క్రితం పార్కుకు వచ్చిన నర్సింహను గుర్తించిన వారు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సింహను అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. థాయ్ మసాజ్‌కు వెళ్లాలని.. నర్సింహకు థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఈ నేపథ్యంలో అతను నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్కుకు వచ్చాడు. అక్కడ స్నాచింగ్‌కు పాల్పడి తరువాత దసరాకు ముందు మరోసారి పంజా విసరాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. బంగారాన్ని డబ్బులుగా మార్చుకొని థాయిలాండ్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు. మూడుసార్లు టోకరా.. కేపీహెచ్‌బీలోనూ అతను గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని నమ్మించి బురిడీ కొట్టించాడు. మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్ కేసులోనూ అలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోనూ స్నాచింగ్‌కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోనూ ఇలాగే చెప్పడంతో పోలీసులు నమ్మి వదిలేశారు. చివరికి ఇలా కేబీఆర్ పార్కులో వాకర్లా నటించి స్నాచింగ్‌లకు పాల్పడుతూ వాకర్లు ఇచ్చిన సమాచారంతో నాటకార్ నర్సింహ నాటకానికి తెరపడింది. సంబంధిత వార్త.. ఇంట్లో నర్సింహ.. బయట రిషి! -
ఇంట్లో నర్సింహ.. బయట రిషి!
‘కేబీఆర్ పార్క్’ స్నాచర్ విచారణలో ఆసక్తికర విషయాలు ► దసరా సందర్భంగా మరో స్నాచింగ్‌కు ప్లాన్ ► అంతలోనే పోలీసులకు చిక్కిన వైనం ► జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్ బాట ► కుటుంబ సభ్యులకు తెలిసే చోరీలు సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కులో 12 ఏళ్లుగా స్నాచింగ్‌లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న స్నాచర్ నర్సింహ అలియాస్ రిషిని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి రెండు నెలలకోసారి కేబీఆర్ పార్కులో స్నాచింగ్‌లకు పాల్పడటమే కాక.. జీహెచ్ఎంసీ వాక్‌వేకు వచ్చే ప్రేమ జంటలను బెదిరించి వారి నుంచి నగదు, నగలు తస్కరించేవాడని తేలింది. కార్మికనగర్ లో నివసించే నర్సింహ జల్సాలకు అలవాటు పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన నగలను జేబులో వేసుకుని పరారు కాకుండా పార్క్ గ్రిల్ దూకి అక్కడే ఓ బండ కిందనో, చెట్టు చాటునో దాచి వెళ్లిపోయేవాడు. రెండు, మూడు గంటల తర్వాత అక్కడికి వచ్చి వాటిని తీసుకెళ్లేవాడు. పొరపాటున పోలీసులకు దొరికినా వెతికితే తన వద్ద ఏదీ ఉండదని అలా చేసేవాడు. కుటుంబ సభ్యులకు తెలిసే నర్సింహ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నగలను తల్లికే ఇచ్చేవాడని, ఆమే వాటిని విక్రయించేదని తెలుస్తోంది. దసరా ఖర్చుల కోసం మరోసారి స్నాచింగ్ చేద్దామని ప్లాన్ వేస్తున్న సమయంలోనే నర్సింహ పోలీసులకు దొరికిపోయాడు. స్నాచర్ కోసం ముమ్మరవేట.. సెలబ్రిటీలు వాకింగ్ చేసే కేబీఆర్ పార్కులో ఏకంగా 12 స్నాచింగ్‌లు జరగడం, నిందితు డు కళ్లుగప్పి పారిపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు పకడ్బందీ వ్యూహం పన్నారు. 15 మంది పోలీసులు గత 25 రోజులుగా సివిల్ డ్రెస్‌లో వాకర్లలాగా స్నాచర్ కోసం జల్లెడ పట్టారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వారిని వెంబడించేవారు. అంతేకాక పార్కు లోపల, జీహెచ్ఎంసీ వాక్‌వేలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఖర్చుల కోసం మళ్లీ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు కేబీఆర్ పార్కు వద్ద బందోబస్తును పెంచారు. ఇంకోవైపు స్నాచర్ నర్సింహ కూడా ఎప్పటికప్పుడు తన రూట్ మార్చేసే వాడు. స్నాచింగ్‌కు రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించేవాడు. సెల్‌ఫోన్‌తో పార్క్ లోపలికి వెళ్లే నర్సింహ అక్కడే ఉన్న బెంచీ లపై కూర్చొని సెల్‌ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్లు నటిస్తూ జంటగా వెళ్లే వారిని అనుసరించే వాడు. ఆ సమయంలో తనకు కాల్స్ రాకుండా.. ఎవరూ తనను ట్రేస్ చేయకుండా ఫోన్‌ను ఫ్లయిట్మోడ్లో పెట్టేవాడు. మోటుగా ఉందని పేరు మార్చేశాడు స్నాచర్ నర్సింహ తన స్నేహితుల వద్ద పేరును మార్చుకున్నాడు. అమ్మాయిల వద్ద నర్సింహ అంటే మోటుగా ఉంటుందని రిషి అని పెట్టుకున్నాడు. ఇతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దసరాకు మరో దొంగతనం చేసి ఏదైనా టూర్ వెళ్లాలని నర్సింహ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపుగానే పోలీసులకు చిక్కాడు. -
‘గొలుసు’ దొంగ దొరికాడు..!
తొమ్మిదేళ్లుగా కేబీఆర్ పార్కులో స్నాచింగ్‌లు - వాకింగ్ చేసేవారే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలు - కెమెరాకు చిక్కడు.. రెండు నెలల గ్యాప్‌తో చోరీలు - ఎట్టకేలకు ఊహాచిత్రం ఆధారంగా నిందితుని గుర్తింపు - నర్సింహను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు హైదరాబాద్: ఒకే ఒక్కడు.. ఆరు కిలోమీటర్ల కేబీఆర్ పార్కు.. 90 సీసీటీవీ కెమెరాలు.. నిత్యం గస్తీ కాసే పోలీసు వాహనాలు.. వీటన్నింటినీ తప్పించుకుని 11 స్నాచింగ్‌ల్లో 44 తులాల బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. తొమ్మి దేళ్లుగా తమను ముప్పుతిప్పలు పెట్టిన ఈ చైన్ స్నాచర్‌ను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసు లు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌కు వచ్చే ఇద్దరు సెలబ్రిటీలు ఊహాచిత్రం ఆధారంగా నిందితుడి గుర్తించి సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నర్సింహ (29)ను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితం మొదలు కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వచ్చేవారిని టార్గెట్ చేసుకుని తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన నర్సింహ స్నాచింగ్ పర్వం గత జూలై 19 వరకూ సాగింది. స్నాచర్ కోసం పోలీసులు పార్కు చుట్టూ ఏకంగా 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. పార్కులో మరో 30 కెమెరాలు ఉన్నా యి. రెండు నెలల విరామంతో స్నాచింగ్ చేసే నర్మింహ కోసం 15 మందికిపైగా పోలీసులు మఫ్టీలో పార్కు వద్ద గస్తీ కాసేవారు. అయినా వీరి కంటపడకుండా మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తూ నర్సింహ పోలీసులకు సవాల్ విసిరాడు. అసలు కెమెరాకు చిక్కకుండా స్నాచర్ ఎలా తప్పించుకుంటాడనేది పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. వాకింగ్‌కు వచ్చేవారే టార్గెట్.. వృద్ధ జంటలను టార్గెట్‌గా పెట్టుకుని ముందు భర్త వెళ్తుంటే వెనుక నడిచే భార్య మెడలో నుంచి గొలుసు తెంపుకుని నింపాదిగా పార్కు లోకి వెళ్లి తప్పించుకోవడం చాలాకాలంగా నర్సింహ అలవాటు చేసుకున్నాడు. చివరగా జూలై 19న సుశీలాదేవి(84) అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల చైన్‌ను దొంగిలించాడు. దీంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుల నుంచి స్నాచర్ ఆనవాళ్లను సేకరించిన పోలీసులు.. ఊహాచిత్రాన్ని గీయించి ప్రతిరోజూ పార్కుకు వచ్చే వాకర్లకు చూపేవారు. ఆ ఊహాచిత్రాన్ని గుర్తించిన ఇద్దరు హీరోలు.. తమ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇలాంటి పోలికలతోనే ఉంటాడని పోలీసులకు తెలిపారు. దీంతో రెండు రోజుల క్రితం బంజా రాహిల్స్ పోలీసులు స్నాచర్‌ను నర్సింహగా గుర్తించి అరెస్టు చేశారు. కేబీఆర్ పార్కు స్నాచర్ తానేనని అతను ఒప్పుకున్నట్లు తెలిసింది. నర్సింహ పార్కు లోపలికి గేటులో నుంచి కాకుండా గ్రిల్స్ దూకి ప్రవేశిస్తున్నట్లు విచారణ లో తేలింది. పోలీసుల దృష్టికి రాని స్నాచింగ్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. -
'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!
-
'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!
కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన 'సే నో టు డ్రగ్స్' కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలెవరూ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్, జీవితలతో మా అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉండే ఒకరిద్దరు తప్ప ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ ఎవరూ పాల్గొనలేదు. మా అసోసియేషన్ పిలుపు నిచ్చినా సినీ వర్గాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. పలువురు టీవీ కళాకారులు మాత్రం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సమాజాన్నీ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని పలుపునిచ్చారు. -
'యాంటీ డ్రగ్స్ వాక్'లో అనసూయ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు ఒక్క కుదుపుకు గురిచేసింది. ఏమీడియాలో చూసినా డ్రగ్స్ కేసు గురించే చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. మెత్తం 12 మందికి స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేయడం, ఒక్కో రోజు ఒక్కోక్కరిని విచారిస్తుండడం ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్-అనర్థాలపై అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవి నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు పాల్గొని తమ మద్దతు తెలియచేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కళామందిర్ ఫౌండేషన్, హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘యాంటీ డ్రగ్ వాక్’ను నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు, ఈకార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. ‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి’ అంటూ అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. #sayNOtoDrugs pic.twitter.com/08STS7i7wg — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 23, 2017 -
24/7 నిఘా నేత్రం
దేశంలోనే తొలిసారిగా వాహన ఉల్లంఘనలపై నిఘాకు ప్రత్యేక వ్యవస్థ - ఐటీఎంఎస్ ఏర్పాటు.. రాత్రీపగలూ నిరంతరాయంగా పరిశీలన - పరిమితికి మించి వేగంగా వెళితే చిక్కినట్లే.. - రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా అంతే.. - ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ఏర్పాటు హైదరాబాద్: అర్ధరాత్రి సమయం.. ట్రాఫిక్ పోలీసులెవరూ ఉండరనే ఉద్దేశంతో అత్యంత వేగంగా వాహనం నడిపాడు ఓ యువకుడు.. కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోయాడు.. కానీ ఒకటి రెండు రోజుల్లోనే అతడి ఇంటికి ఈ–చలానా వచ్చింది. పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లినందుకు, రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు జరిమానా విధించారు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన అత్యాధునిక సెన్సర్ కెమెరాల వ్యవస్థ పనితీరు ఇది. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకెళ్లిపోవడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలన్నింటినీ రాత్రి సమయాల్లోనూ ఈ సెన్సర్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)గా పిలిచే ఈ వ్యవస్థను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్కు–జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఎన్ని వాహనాలు వెళ్లినా.. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ వి.రవీందర్ గురువారం ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 10,800 వాహనాలు వెళ్లినట్లుగా అందులో వెల్లడైంది. ఇక్కడ నిర్దేశించిన గరిష్ట వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లుకాగా.. 64 శాతం వాహనాలు పరిమితికి లోబడి వెళ్లాయని, మిగతావి ఎక్కువ వేగంతో వెళ్లాయని తేలింది. ఇక బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 11,706 వాహనాలు వెళ్లగా... 2,200 వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లినట్లు గుర్తించారు. నాలుగు వాహనాలు 100 కి.మీపైన వేగంతో.. తొమ్మిది వాహనాలు 120 కి.మీపైగా వేగంతో దూసుకుపోయాయి. ఒక ఆడి కారు (ఏపీ 09 సీఏ 7119) గంటకు 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ఐటీఎంఎస్‌లో నమోదైంది. మొత్తంగా సగానికిపైగా వాహనాలు నిర్దేశిత పరిమితికి మించి వేగంతో వెళ్లినట్లు తేలింది. స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌వ్యాప్తంగా అన్ని కూడళ్లు, కారిడార్లలో పదివేల సెన్సర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా రవీందర్ వెల్లడించారు. ప్రయారిటీ ట్రాఫిక్ కూడా.. ట్రాఫిక్ ఎక్కువై ముందున్న వాహనాలు కదలకపోవడం, రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగిపోవడం వంటి వాటి కారణంగా చాలాసార్లు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. అయితే ఐటీఎంఎస్‌లో ఏర్పాటు చేసే కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుసంధానమై.. అంబులెన్స్‌లు వేగంగా ముందుకు కదిలేలా గ్రీన్‌సిగ్నల్స్ ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. -
కేబీఆర్ పార్క్‌లో బాలయ్య యోగా
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న యాడ్ లైఫ్ బుధవారం యోగా సాధన కార్యక్రమాన్ని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఇంతటి ప్రాచుర్యం రావడం భారతదేశానికి, ఇక్కడి సాంస్కృతిక పరంపరకు దక్కిన గౌరవం అన్నారు. యోగా ప్రకృతి సిద్ధంగా మన ఆరోగ్యానికి వరదాయనిలాంటిదని అందులో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయని అవి శరీరంలోని పలు కీలక అవయవాలకు మేలు చేస్తాయన్న విషయం శాస్త్రీయంగా రుజువైందని చెప్పారు. మంచి ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ నిరంతరం యోగా సాధన చేయాలని సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడతున్న వారికి యోగ మేలు చేస్తుందని ఒత్తిడి తగ్గించడమే కాక నయం చేయడంపై కూడా ప్రభావాన్ని చూపుతుందన్నారు. అందుకే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు క్రమపద్ధతిలో యోగాసనాలు చేయించారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి నర్సులు, వైద్యులు సిబ్బందితో పాటు కేబీఆర్ పార్కు వాకర్లు, సందర్శకులు పాల్గొన్నారు. -
నోటిఫికేషన్ ఇచ్చే వరకు పనులు ఆపండి
కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఎన్జీటీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్డీపీ)లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆకాశ వంతెనలకు బ్రేక్ పడింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కేబీఆర్ పార్క్‌లోని జీవరాశి మనుగడకు ప్రమాదకరమంటూ పర్యావరణ, సామాజికవేత్తలు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో పనులు చేపట్టకుండా గతంలో ఎన్జీటీ స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం తుది తీర్పునిచ్చిన ఎన్జీటీ.. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జడ్)పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు చేపట్టొద్దని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో ఫ్లైఓవర్ల పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ మరికొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఎస్‌జడ్ తగ్గించాలని కేంద్రానికి ప్రతిపాదనలు.. కేబీఆర్ పార్క్ ఈఎస్‌జడ్ సగటున 25–35 మీటర్లుగా ఉంది. అందులో పార్క్ వాక్‌వే ఉంది. ఫ్లైఓవర్ల పనులు పూర్తయితే వాక్‌వే 3 నుంచి 7 మీటర్లకు తగ్గనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెరిగిన నగరీకరణ, జనసమ్మర్థంతో పార్క్ నగరం మధ్యకు చేరడంతో ఎకో సెన్సిటివ్ జోన్‌ను సగటున 3 నుంచి 7 మీటర్లకు తగ్గించాలని ఒకసారి, జీరో మీటర్లకు తగ్గించాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. చెన్నైలోని గిండి జాతీయ పార్క్ ఈఎస్‌జడ్ జీరో మీటర్లకు తగ్గించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉన్నందున, సదరు నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు నిలుపుదల చేయాలని ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆ నోటిఫికేషన్ వచ్చే వరకూ ఈ పనులు చేపట్టే అవకాశం లేదు. తుది నోటిఫికేషన్‌ను బట్టే ముందడుగు.. తుది నోటిఫికేషన్లో ఎకో సెన్సిటివ్ జోన్‌ను 3–7 మీటర్లకు లేదా జీరో మీటర్లకు తగ్గిస్తే.. జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ల పనులు చేపట్టవచ్చు. తుది నోటిఫికేషన్లో 25–35 మీటర్ల వరకు యథాత థంగా ఉంచితే ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ.. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాలని పర్యావరణ నిపుణుడొకరు తెలి పారు. జాతీయ పార్కులకు ఈఎస్జడ్లు ఉన్నప్పటికీ రహదా రులు, ఇతర ప్రజావసరాల దృష్ట్యా కమిటీ తగిన మినహాయింపులిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
కదులుతున్న ‘గంజాయి’ డొంక!
⇒ ‘సాక్షి’ కథనంతో కదిలిన పోలీసులు ⇒ బెంజ్ కారు నడిపింది సాత్విక్‌రెడ్డిగా గుర్తింపు హైదరాబాద్: కేబీఆర్ పార్క్ గేట్ వద్ద శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం డొంక కదులుతోంది. ఈ ఉదంతంపై ‘‘బెంజ్‌లో గం‘జాయ్’’పేరుతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసు విభాగం స్పందించింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది జడ్జర్లకు చెందిన రియల్టర్ కుమారుడిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మాదకద్రవ్య నిరోధక చట్టంతో పాటు ఇతర సెక్షన్లనూ జోడించారు. (చదవండి: బెంజ్‌లో గం‘జాయ్’!) జూబ్లీహిల్స్ రోడ్ నెం.31కు చెందిన ఎం.అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చి గేట్ నెం.2 వద్ద తన బీఎండబ్ల్యూ కారును ఆపారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వేగంగా దూసుకువచ్చిన బెంజ్ కారు ఈ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. బీఎండబ్ల్యూ బాగా దెబ్బతినగా... బెంజ్‌లో ఉన్న ముగ్గురు యువకుల్ని వెనుక వచ్చిన మరో కారులోని వారు ఎక్కించుకుని ఉడాయించారు. వాకింగ్ చేస్తున్నవాళ్లు బెంజ్ కారును పరిశీలించగా.. అందులో పొగతో పాటు మద్యం సీసాలు, గంజాయి కనిపించాయి. పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు... ఇదిలా ఉండగా... సదరు బెంజ్ కారులో ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తాజా మంత్రి సంబంధీకులు ఇలా వీవీఐపీల బిడ్డలే ఉన్నారు. దీంతో కేసు నుంచి బయటపడటానికి వారు పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు. సైదాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి వీరిలో ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీవీఐపీల బిడ్డలు అతడిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు పంపి లొంగిపోయేలా చేశారు. అతడు మద్యం తాగినట్లు నిరూపితం కాకపోవడంతో ఈ కేసు సాధారణ ప్రమాదంగా నమోదైంది. అయితే ‘సాక్షి’కథనంతో రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా... ప్రమాదం జరిగిన సమయంలో సాత్విక్‌రెడ్డి అనే యువకుడు బెంజ్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. రియల్టర్ కుమారుడు అరెస్టు... జడ్జర్లకు చెందిన రియల్టర్ బాల్‌రెడ్డి కుమారుడైన సాత్విక్ అమెరికాలో బీబీఏ విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల నగరానికి వచ్చిన ఇతడు తన స్నేహితులైన వీవీఐపీల బిడ్డలకు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు తాజా, మాజీ మంత్రుల కుమారులు హాజరయ్యారు. శనివారం ఉదయం మద్యం, గంజాయి మత్తులో ఉన్న సాత్విక్ ఫిల్మ్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడిని విడిచిపెట్టడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం సాత్విక్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంలో రాఘవేంద్రరెడ్డి ప్రమేయం లేదని తేలింది. అదనపు సెక్షన్లు జోడింపు... ఈ కేసును ఆల్టర్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 279, ఎంవీ యాక్ట్‌లోని 185తో పాటు మాదకద్రవ్య నిరోధక చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్)లోని 20(బీ)(2)(ఎ) సెక్షన్‌ను అదనంగా జోడించారు. ఈ ఘటనకు కారకులైన వారు ఎంత ప్రముఖులైనా వదిలిపెట్టవద్దని డీసీపీ వెంకటేశ్వరరావు స్థానిక పోలీసులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఘటన పూర్వాపరాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
హైదరాబాద్ నూ తాకిన ‘హోదా’ సెగ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనూ ఏపీ ప్రత్యేక హోదా నినాదం మార్మోగింది. ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా కేబీఆర్ పార్కు వద్ద ఐటీ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ‘వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని, పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. స్పెషల్ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని టీఆర్ఎస్ ఎంపీ కవిత సమర్థించారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్ రేసర్లు
-
కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై విచారణ
వ్యాజ్యాలు స్వీకరించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన బహుళ అంత స్తుల ఫ్లైఓవర్ల నిర్మాణానికి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో పెద్ద సంఖ్యలో చెట్లను నరికేస్తుండ టంపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం, కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ప్రముఖ పర్యావర ణవేత్త ప్రొఫెసర్ పురుషో త్తంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. చెట్ల నరికివేతపై ఓ పత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా దాన్నీ హైకోర్టు పిల్‌గా పరిగణించింది. 2 వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తున్నామంటూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. -
కేబీఆర్ పార్కు వద్ద డయాబెటిక్ వాక్
హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఉదయం ఏడు గంటలకు డయాబెటిక్ వాక్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు వాక్ నిర్వాహకులు లయన్స్ చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్ జిల్లా ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ లయన్ ఏ విజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. వందలాది మంది వాకర్లతో కలిసి మధుమేహ అవగాహన నడకను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డా. లక్ష్మారెడ్డి విచ్చేయనున్నట్లు చెప్పారు. షుగర్ 365 డేస్ క్లినిక్ అధినేత డాక్టర్ ప్రసాద్‌రావుతో కలిసి ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. -
అసహ్యించుకోకండి.. కుదిరితే ప్రేమించండి..
హైదరాబాద్: లింగ వివక్షతకు వ్యతిరేకంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద లెస్బియన్లు, గేలు సంయుక్తంగా అవగాహన నడక నిర్వహించారు. నగర నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది లెస్బియన్లు, గేలు తమను కూడా సమాజంలో ఒకరిగా గుర్తించాలంటూ, ప్రేమించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ 5 కే రన్, 10 కే రన్ నిర్వహించారు. క్రియేట్ క్యాంపస్ హైదరాబాద్, హైదరాబాద్ సాల్మానా అనే గ్రూపులతో పాటు స్నేహితుల బృందాలు పెద్ద సంఖ్యలో ఈ నడకలో పాల్గొన్నాయి. గత వారం ఓ చానెల్లో లెస్బియన్ల గురించి కించపరిచే రీతిలో ప్రసారాలు జరిగాయని దానికి నిరసగా కూడా తాము ప్లకార్డులు ప్రదర్శించామని వెల్లడించారు. లెస్బియన్లు, గేలు అందరూ కలిసి చేస్తున్న ఈ నడకలో హక్కుల కోసం పోరాడటమే లక్ష్యంగా నినాదాలు చేసినట్లు వెల్లడించారు. మమ్మల్ని అసహ్యించుకోకండి.. కుదిరితే ప్రేమించండి... మాలోనూ ప్రేమ దాగి ఉంది, సమానత్వం కోసం పరిగెడతాం అన్న టీషర్ట్లను ధరించారు. -
కేన్సర్‌ను జయిద్దాం..
బంజారాహిల్స్: ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ సీజేస్, భారతీయ రొమ్ము కేన్సర్ వైద్య నిపుణుల సంఘం సంయుక్తాధ్వర్యంలో రొమ్ము కేన్సర్‌పై ఆదివారం అవగాహన వాక్ నిర్వహించారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ వాక్‌ను సినీ నటి రెజీనా, కేన్సర్‌ను జయించిన మధుమిత చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. కేన్సర్‌ను జయించిన సుమారు మూడువేల మంది, వారి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు. కేన్సర్‌ను జయించిన వారిని గౌరవించడం, వీరి స్ఫూర్తిగా కేన్సర్ బాధితుల్లో పోరాడేతత్వాన్ని రగిలించడం... ఈ వాక్ ముఖ్య ఉద్దేశమని ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ సీఈఓ పి.రఘురాం తెలిపారు. వాక్‌లో కిమ్స్ చైర్మన్ బి.కృష్ణయ్య, డాక్టర్ బి.భాస్కర్‌రావు, ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్, సింక్రోని ఫైనాన్షియల్ బిజినెస్ లీడర్ ఫైసలుద్దీన్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి చైర్మన్ రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు. -
గోల్డ్ వాక్ ఫర్ చైల్డ్
బంజారాహిల్స్: చిన్నారులకు వచ్చే కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే నయం చేయొచ్చని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ‘గోల్డ్ వాక్ ఫర్ చైల్డ్’ పేరుతో పిల్లలకు వచ్చే కేన్సర్‌పై కేబీఆర్ పార్క్ వద్ద ఆదివారం అవగాహన నడక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాటికలు ప్రదర్శించి కేన్సర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మహమూద్ పాషా, అస్మాపాషా, తాజుద్దీన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మయూరం..వయ్యారం!
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సోమవారం ఉదయం ఓ మయూరం వయ్యారంగా నడుస్తూ కనువిందు చేసింది. రోడ్డు పైకి వచ్చిన ఆ నెమలి... సెంట్రల్ మీడియన్‌లో ఆకలి తీర్చుకొని తుర్రుమంది. వాకర్లు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. – ఫొటోలు... దయాకర్ తూనుగుంట్ల -
జీవులను రక్షిద్దాం..
బంజారాహిల్స్: జీవహింస చేయరాదని, జంతువులను రక్షించాలని కోరుతూ ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఇండియా యునైటెడ్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు అవగాహన నడక నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు సంజన, సంజీవ్‌తో కలిసి జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ వాక్‌లో పాల్గొన్నారు. -
కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద బీజేపీ నేతృత్వంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఫిల్మ్‌నగర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా 5 కి.మీ మేర ఈ యాత్ర సాగుతోంది. తిరంగా యాత్రలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ కార్యకర్తలతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నేడు కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు, దేశ స్వాతంత్య్రంతో పాటు హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించేందుకు కృషి చేసిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6.30కి కేబీఆర్ పార్కు వద్ద నిర్వహిస్తున్న ఈ యాత్రకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేబీఆర్ పార్కు చుట్టూ 5.2 కి.మీ. పరిధిలో యాత్ర నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖులు పద్మనాభయ్య, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డివి మనోహర్, పార్టీ నేతలు పి. మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి ఎన్.రామచందర్‌రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని చెప్పారు. -
కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై హైకోర్టు నిలదీత
- నాటేది రెండు మూడడుగుల మొక్కలు.. - కూల్చేది 20,30 ఏళ్ల నాటి చెట్లనా? - తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు - తదుపరి విచారణ 18కి వాయిదా సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి(కేబీఆర్) పార్కులో భారీస్థాయిలో చెట్ల నరికివేత విషయమై హైకోర్టు బుధవారం తెలంగాణ సర్కార్‌ను నిలదీసింది. ఒకవైపు హరితహారం పేరుతో రెండు, మూడు అడుగుల మొక్కలు నాటుతూ మరోవైపు 20-30 ఏళ్ల నాటి చెట్లను నరికేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్‌లోని చెట్లను పెద్దసంఖ్యలో నరికివేస్తుండటంపై ఓ దినపత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా, దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ పిటిషనర్ తన లేఖలో 3100 చెట్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారని, ఇది నిజం కాదని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఒకపక్క హరితహారం అంటారు. ఇందులో రెండు, మూడు అడుగులున్న చిన్న మొక్కలు నాటుతారు. మరోవైపు అభివృద్ధి అంటూ 20-30 ఏళ్ల నాటి భారీ చెట్లను నరికివేస్తారు. ఇది ఎంత వరకు సబబో మీరే చెప్పాలి.’ అని ప్రశ్నించింది. పిటిషనర్ చెప్పిన లెక్కల్లో తేడాలునప్పటికీ చెట్లు కొట్టేస్తున్నది నిజమా.. కాదా.. అని నిలదీసింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా(అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్‌ను నియమించిన ధర్మాసనం, ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో దీనిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
అక్క ప్రాణాల్ని తిరిగి ఎవరూ తెస్తారు?
-
న్యాయం కావాలి
- రమ్య మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ హైదరాబాద్: చిన్నారి రమ్యకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా అశ్రునివాళి అర్పించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేబీఆర్ పార్కు వద్ద సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్ రోడ్ నం.3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. రమ్య తాత చింతపల్లి సురేందర్, అమ్మమ్మ విజయలక్ష్మి, మేనమామ నవీన్ తదితరులతోపాటు రమ్య సోదరి రష్మి కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి రమ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. రమ్య ప్రాణాన్ని తిరిగి ఎవరు తెస్తారు.. తాగుబోతు డ్రైవర్లను కఠినంగా శిక్షించాలి.. న్యాయం కావాలి.. అటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పబ్‌లు, హుక్కా సెంటర్లపై నియంత్రణ ఏది అని ప్రశ్నించారు. సుమారు 2 గంటలపాటు జరిగిన రమ్య అశ్రునివాళిలో ప్రతిఒక్కరూ చిన్నారిని తలచుకొని కంటనీరు పెట్టారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజల్ శ్రీనివాస్, సినీ హీరో శివాజీ, నటి మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మా కుటుంబానికి న్యాయం జరగాలి
-
తాగుబోతుల పై గట్టి చర్యలు తీసుకోవాలి
-
చెట్ల నరికివేతపై వివరణ ఇవ్వండి
- కేబీఆర్ పార్కుపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం - ఎన్జీటీ ఉత్తర్వుల నేపథ్యంలో ఎటువంటి ఆదేశాలివ్వలేం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులోని చెట్లను పెద్ద సంఖ్యలో నరికివేస్తుండటంపై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పార్కులోని చెట్లను నరికివేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్ల నరికివేత వ్యవహారంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేసినందున తాము ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు ఎన్జీటీ ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే, అవి మీకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే, వాటిని తమ దృష్టికి తీసుకురావొచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ధర్మాసనం విచారించింది. పార్కును పణంగా పెట్టొద్దు ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ... బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్కు వద్ద దాదాపు 2,390 చెట్లను కొట్టేస్తున్నారని తెలిపారు. ఇందులో పార్కు లోపలి చెట్లు కూడా ఉన్నాయన్నారు. ఈ నరికివేత వల్ల అరుదైన జాతుల చెట్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ఇంతకీ ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ప్రశ్నించింది. పార్కును ఆనుకుని వెళుతున్నాయని ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి బదులిచ్చారు. అభివృద్ధి అవసరమేనని, అయితే కేబీఆర్ పార్కు వంటి వాటిని పణంగా పెట్టడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. పార్కు బయట నుంచి ఫ్లైఓవర్లు వెళుతుంటే పార్కు లోపల చెట్లతో పనేముందుందని ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, తాము లోపలి చెట్లను నరకడం లేదని, పార్కు చుట్టూనే ఫ్లైఓవర్లు వస్తున్నాయని చెప్పారు. చెట్లు జోలికి వెళ్లకుండా ప్రణాళికలు రూపొందించడం సాధ్యపడదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నామని ఏజీ తెలియజేశారు. చెట్ల నరికివేత సమస్యకు పరిష్కారం కాదని, వాటిని మరో చోటుకు తరలిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక చెట్టు కొట్టిన చోట మూడు చెట్లు నాటుతున్నామని ఏజీ చెప్పగా, మెట్రో రైల్ నిర్మాణం సందర్భంగా ఎన్ని చెట్లు నాటారని ధర్మాసనం ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు లోపల చెట్ల నరికివేతపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీకి తేల్చి చెప్పింది. -
త్వరలో ‘ఎస్సార్డీపీ’ వెబ్‌పోర్టల్
కేబీఆర్ పార్కు వద్ద పనులపై అవగాహన సాక్షి, హైదరాబాద్: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఎస్సార్ డీపీ) వెబ్‌పోర్టల్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేబీఆర్ జాతీయ పార్కు వద్ద ఈ ప్రాజెక్టు కోసం చెట్లను తొలగించడంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ దానిని ఏర్పాటు చేస్తోంది. పలువురు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పార్కును పరిరక్షించాలని, పార్కులోని వృక్ష, జీవజాతులకు హాని కలిగించవద్దని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో వాటికి ఎలాంటి ముప్పు ఉండదని, పార్కులోని చెట్లను తొలగించడం లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. అయినా, తమ వాదనను ఎవరూ వినడం లేదని, దీంతో ప్రజల్లో గందరగోళం నెల కొందని జీహెచ్ఎంసీ గుర్తించింది. అన్ని వివరాలూ సమగ్రంగా వెబ్సైట్లో పొందుపరచడమే కాక, ప్రజాభిప్రాయాలను కూడా దాని ద్వారా స్వీకరించాలని, ప్రజల సందేహాలకు కూడా వెబ్సైట్లో సమాధానాలివ్వాలని భావి స్తోంది. కేబీఆర్ పార్కు వద్ద చేసే పనులు, అందుకుగాను తొలగించాల్సిన చెట్లు, ప్రత్యామ్నాయంగా చేపట్టే చర్యలు, ప్రస్తుతం, భవిష్యత్‌లో కాలుష్యం పరిస్థితి, ఎస్సార్డీపీ ఫ్లైఓవర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, మంచి- చెడులు, రెండు వైపులా అన్ని అంశాలను వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని వివరాలతో ‘ఎస్సార్డీపీ’ వెబ్సైట్ రూపక ల్పనకు దాదాపు 3, 4 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లవద్దని నిర్ణయం: ఎస్సార్డీపీ పనులపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జులై 1 వరకు స్టే ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లాలని అధికారులు భావించారు. అయితే జులై 1 వరకు వేచి చూడాలని, తొందరపడి హైకోర్టుకు వెళ్లనవసరం లేదని ఉన్నతస్థాయిభేటీలో భావించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి పొరపాట్లు లేనందున తదుపరి విచారణ వరకు వేచి చూడాలని అభిప్రాయపడినట్లు సమాచారం. -
పచ్చని ఆకు సాక్షిగా ప్రమాద ఘంటిక
పచ్చదనానికి దూరమవడంతో పెరుగుతున్న మానసిక రుగ్మతలు జంట నగరాల్లో గత యాభై ఏళ్లలో దారుణంగా తగ్గిపోయిన గ్రీన్‌బెల్ట్ ఓ వైపు పచ్చదనం కనుమరుగవుతుంటే కేబీఆర్ పార్కుపై సర్కారు దండయాత్ర పనులు ఆపాలంటూ పర్యావరణవేత్తల ఆందోళన అయినా ముందుకు సాగుతున్న అధికారులు జాగో హైదరాబాద్ 1950ల్లో 35 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండగా.. ఇప్పుడు కేవలం 8 శాతం 1,394: ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా పార్కు చుట్టూ తొలగించనున్న వృక్షాలు 400 ఎకరాలు: కేబీఆర్ పార్కు విస్తీర్ణం. అరుదైన వృక్ష, జంతు జాతులకు ఆలవాలం 2.5 లక్షలు: కేబీఆర్ జంక్షన్ చుట్టూ ప్రస్తుతం రోజుకు సగటున ప్రయాణిస్తున్న వాహనాలు సాక్షి, హైదరాబాద్: ప్రకృతిని మనిషిని వేర్వేరుగా చూడలేం.. మనిషి సహజ ఆవరణం అడవే.. ఎన్నో ఏళ్లుగా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలివి! అనేక పరిశోధనల్లోనూ ఇదే తేలింది. మనిషి మానసిక ఆరోగ్యానికి, ప్రకృతిలోని పచ్చదనానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రకృతికి దూరమయ్యే కొద్దీ మానసిక సమస్యలు, ఒత్తిళ్లు, రుగ్మతలు పెరుగుతాయని తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పీటర్ ఖాన్ పరిశోధనలోనూ వెల్లడైంది. మరి మన రాజధాని నగరంలో పచ్చదనం పాలెంత? రోజురోజుకూ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న నగరంలో హరితప్రాంతం (గ్రీన్‌బెల్ట్) వేగంగా కరిగిపోతోంది. 1950వ దశకంలో హైదరాబాద్ విస్తీర్ణంలో ఇది 35 శాతం ఉండేది. ఇప్పుడెంత ఉందో తెలుసా? కేవలం 8 శాతం!! అంటే నగరంలో ఏకంగా 27 శాతం పచ్చదనం కనుమరుగైందన్నమాట! ప్రకృతికి ఇంతగా దూరం కావడంతో జనంలో క్రమంగా మానసిక దౌర్బల్యం, రుగ్మతలూ పెరుగుతూ వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్షణమే మేలుకోకుంటే సామాజికంగా పెనుసంక్షోభం తప్పదని పర్యావరణ వేత్తలు, మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... నగరానికే తలమానికంగా ఉంటూ, 400 ఎకరాల్లో విస్తరించిన అద్భుతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కుపై సర్కారు దండయాత్రకు దిగుతోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్డీపీ) పేరుతో పార్కులోని అరుదైన వృక్ష, జంతు జాతులకు ముప్పు తెస్తోంది. ఈ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో రెండు వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. పార్కు చుట్టూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1394 చెట్లను తొలగించాలని భావిస్తోంది. దీన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకే వెళ్తోంది. అసలేంటి ఈ ఎస్ఆర్డీపీ? నగరంలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఈ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు ప్యాకేజీల్లో 18 ప్రాంతాల్లో పనులకు టెండర్లు పిలిచారు. వీటిల్లో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో రెండు వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. వీటిల్లో రెండు జంక్షన్ల వద్ద భూసేకరణ ఇబ్బందులతో వెనక్కు తగ్గారు. నాలుగు జంక్షన్లలో పనులు చేపట్టేందుకు.. కేబీఆర్ చుట్టూ ఉన్న చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.322 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ల వద్ద పనుల్ని ఉపసంహరించుకున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, మహారాజ అగ్రసేన్ విగ్రహం, ఫిల్మ్‌నగర్, రోడ్డు నంబర్ 45 జంక్షన్ల వద్ద పనులకు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్కు వద్ద గత జనవరిలోనే పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనుల్లో భాగంగా పార్కుచుట్టూ ఉన్న 1,394 చెట్లను తొలగించాల్సి ఉంది. అరుదైన వృక్ష, జంతు జాతులకు ముప్పు.. రాజధాని నగరంలో సుమారు 1,800 రకాల వృక్షజాతులు ఉండగా.. కేబీఆర్ పార్కులోనే 500 రకాల అరుదైన వృక్షజాతులు ఉన్నాయి. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుతో పార్కుకు వాటిల్లే ముప్పు ఇదీ.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే డ్రాసిరా ఇండికా, డ్రాసిరా బర్మానీతోపాటు ఔషధ విలువలు అధికంగా ఉన్న నన్నారి (మారేడు గడ్డలు), పొడపత్రి, అస్తమా రోగులకు ఉపశమనం ఇచ్చే కొండగోగు, తిరుమ, రేగిస, సోమి, పాలకొడిశ, అరుదైన పక్షుల ఆకలి తేర్చే కల్మికాయలు, జీడిపండు, సీతాఫలం, ఊడుగు వంటి వృక్షాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. పార్కు చుట్టూ ఉన్న చెట్లలో సైకస్, మహాఘని, చాంపియన్ పామ్, బాటిల్బ్రష్, బహున్ల, నెమలి నార, రావి, తెల్లమద్ది, బిగ్నీనియా, ఉల్లింత, రేల తదితర చెట్లు కనుమరుగుకానున్నాయి. పర్యావరణ అభ్యంతరాలు బేఖాతర్ ఎస్‌ఆర్‌డీపీపై పర్యావరణవేత్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పనులతో కేబీఆర్ పార్క్‌లో జీవ వైవిధ్యానికి పెను ముప్పు వాటిల్లుతోందని నెల రోజులుగా ఉద్యమిస్తున్నా తగ్గడం లేదు. ఈ జాతీయ పార్కు చుట్టూ బఫర్‌జోన్‌గా పరిగణించే ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన వాక్‌వే మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోపాటు పార్కులో అరుదైన వృక్ష, జంతు, జీవజాతులు, ఔషద మొక్కల జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్, న్యూయార్క్ వంటి మహానగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ బహుళ వరుసల ఫ్లైఓవర్ల పేరుతో జాతీయ పార్కు ఉనికిని దెబ్బతీయడం సమంజసం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా జాతీయ పార్కులకు పది కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ పరిధిలో భారీ నిర్మాణాలు చేపట్టరాదని కేంద్ర అటవీ శాఖ నిబంధనలు స్పష్టంచేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు. అయినా ముందుకే.. ఎస్ఆర్డీపీ పనులపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా జీహెచ్ఎంసీ ముందుకే వెళ్తోంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. మానవ హక్కుల కమిషన్‌లో పిల్ దాఖలైంది. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ).. చెట్ల తొలగింపుపై ఇప్పటికే స్టే ఇచ్చింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. ఇవన్నీ ఇలా ఉండగానే కౌంటర్లతోపాటు హైకోర్టుకు వెళ్లాలని అధికారులు యోచిస్తున్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు నివేదికను ప్రజల ముందుంచాలి ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు రిపోర్టును ప్రజల ముందుంచాలి. ఈ ప్రాజెక్టు వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలపై అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం పర్యావరణ ప్రభావ నివేదికను సిద్ధం చేసి స్థానిక పోలీసు స్టేషన్, తపాలా కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ఆ తర్వాత ఒక నెల గడువు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఆ తర్వాతే పనులు చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఇవేవీ చేయడం లేదు. చట్టం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఈ ప్రాజెక్టు పనులను తక్షణం ఆపాలి. లే కుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. - ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త జీహెచ్ఎంసీ ఏం చెబుతోంది? కేబీఆర్ పార్కు చుట్టూ ఎస్ఆర్డీపీ పనులు చేపట్టకుంటే నగరంలో 2035 నాటికి కాలుష్యం మరింత పెరిగి ప్రజా జీవనం దుర్భరమవుతుందని జీహెచ్ఎంసీ వాదిస్తోంది. కేబీఆర్ జంక్షన్ చుట్టూ ప్రస్తుతం రోజుకు సగటున 2.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యల వల్ల, సిగ్నల్స్ వద్ద ఆగాల్సి రావడం వల్ల రోజుకు సగటున32,096 వేల లీటర్ల ఇంధనం వృథా అవుతోందని, కాలుష్యం పెరిగిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచేందుకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అవసరమని, అందుకు ఈ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు ఉపయోగపడతాయని అంటున్నారు. కాంట్రాక్టర్ల కోసమే.. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఎస్ఆర్డీపీ పనులు చేపడుతున్నారు. పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, స్థానికుల అభిప్రాయాలను తుంగలోకి తొక్కి ఈ పనులు చేపడితే నగరానికి పెనుముప్పు తప్పదు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కాలుష్య తీవ్రత తగ్గలేదని గుర్తెరగాలి. - ప్రొఫెసర్ రామచంద్రయ్య, సెస్ సమతుల్యతను దెబ్బతీయడమే చెట్లను తొలగించి బహుళ వరుసల ఫ్లైఓవర్లు నిర్మించడమంటే కేబీఆర్ పార్క్‌ను నాశనం చేయడమే. ఈ ప్రాజెక్టుతో పార్కులో జీవావరణ వ్యవస్థలోని సమతుల్యత దెబ్బతింటుంది. - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణ వేత్త జీవ వైవిధ్యానికి ప్రమాదం తెలంగాణ జీవవైవిధ్యానికి ప్రతీక ఈ పార్క్. ఇందులో వందలాది వృక్ష జాతులు, అరుదైన పక్షిజాతులు, క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటక జాతులున్నాయి. ఈ పార్కును వారసత్వ కట్టడంగా పరిగణించి కాపాడాలి. - జయభారతి, పర్యావరణ వేత్త, హైదరాబాద్ రైజింగ్ ప్రతినిధి నగరాల్లో మానసిక రుగ్మత లు పెరిగిపోతున్నాయి పచ్చటి చెట్లు, రకరకాల జంతువులు, పక్షుల మధ్య ఏళ్ల కిందట మనిషి సాగించిన మనుగడ తాలూకూ అనుభూతులు మన సబ్కాన్షియస్ మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ అనుభూతులకు ఎప్పుడైతే తగిన ప్రేరణ లేకుండా పోతుందో అప్పుడు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. డిప్రెషన్, స్ట్రెస్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడే వారిని వాకింగ్ చేయమని సలహా ఇస్తుంటాం. సూర్యోదయం కంటే ముందు వాకింగ్ చేయడం ఒకరకంగా ప్రకృతితో మమేకం అయ్యేందుకే. వడివడిగా నాలుగు అంగలు వేశామన్నట్లుగా కాకుండా పరిసరాలను గమనిస్తూ.. మంచు బిందువుల నుంచి పక్షుల కిలకిలల వరకూ ప్రకృతి అందించే ఆనందాలన్నింటినీ అనుభూతి చెందగలిగితే మానసిక సమస్యలు వేగంగా దూరమైపోతాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏటా మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనరల్ యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్ కేసులు ఎక్కువవుతున్నాయి - నిరంజన్‌రెడ్డి, ప్రఖ్యాత సైకాలజిస్ట్, హైదరాబాద్ ప్రకృతికి దూరమవడంతో మానసిక సమస్యలు ప్రకృతికి, నగర ప్రజల మానసిక స్థితికి దగ్గరి సంబంధం ఉందని ఓ పరిశోధనలో తేలింది. ప్రకృతికి, పచ్చదనానికి ఎంతగా దూరమైతే అంతగా ప్రజల్లో అంతగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ చేసిన పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ‘‘నగరాలు, పట్టణ వాతావరణంలో మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగ సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రజలు ప్రకృతికి దూరమవడం. నగ ర జీవులు తమ నిత్య జీవితంలో ప్రకృతికి దూరంగా ఉండిపోతున్నారు. ఇది వారి శారీరక ఆరోగ్యంపైనే కాదు.. మానసిక ఆరోగ్యంపైనా దుష్ర్పభావం చూపుతోంది’’ అని పీటర్ ఖాన్ చెప్పారు. -
అర్ధరాత్రి వేళ...
పచ్చదనంపై వేటు... కేబీఆర్ పార్కు చుట్టూ మల్టీలెవల్ ఫ్లైఓవర్ పనులు షురూ... గుట్టు చప్పుడు కాకుండా పనులు చేపట్టిన అధికారులు బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు చుట్టు నిర్మించనున్న మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను రాత్రివేళల్లో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. జూబ్లీహిల్స్‌రోడ్ నెం.45లోని బాలకృష్ణ నివాసం ఎదురుగా ఉన్న పార్కింగ్స్లాట్లో వాక్‌వేను ఆనుకొని ఉన్న గోడను పూర్తిగా కూల్చివేశారు. వీటితో పాటు గ్రిల్స్‌ను కూడా తొలగించి పక్కకు పడేశారు. సిమెంటు దిమ్మెల నిర్మాణానికి వినియోగించే సెంట్రింగ్ పరికరాలను సమకూర్చుకొని ఇక్కడ ఉంచారు. మంగళవారం రాత్రి ఈ తంతు గమనించిన హైదరాబాద్ రైజింగ్ క్లబ్ నిర్వాహకులు ఇక్కడకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పచ్చని చెట్లు తొలగించొద్దని నినదించారు. -
కేబీఆర్ పార్కులో జీవవైవిధ్యానికి ముప్పు
♦ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుతో అరుదైన వృక్ష, జంతు జాతుల మనుగడకు ప్రమాదం ♦ పార్కు చుట్టూ 1,394 చెట్లను తొలగించాలని అధికారుల నిర్ణయం ♦ ట్రాఫిక్ పేరిట పార్కు ఉనికిని దెబ్బతీస్తారా?: పర్యావరణవేత్తలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బహుళ వరుసల దారుల (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-ఎస్ఆర్డీపీ) ప్రాజెక్టుతో భాగ్యనగరానికే తలమానికమైన కేబీఆర్ పార్క్‌లో జీవ వైవిధ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. పార్కు చుట్టూ బఫర్‌జోన్‌గా పరిగణించే ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన నడక దారి(వాక్‌వే) మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోపాటు పార్కులో పలు అరుదైన వృక్ష, జంతు, జీవజాతులు, ఔషధ మొక్కల జాతులు అంతరించి పోయే ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్, న్యూయార్క్ వంటి మహానగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా.. నగరంలో బహుళ వరుసల దారుల పేరుతో జాతీయ పార్కు ఉనికిని దెబ్బతీయడం సమంజసం కాదని స్పష్టంచేస్తున్నారు. సాధారణంగా జాతీయ పార్కులకు పది కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా పరిగణించాలని, భారీ నిర్మాణాలు చేపట్టరాదని కేంద్ర అటవీ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినా కేబీఆర్ పార్కు చుట్టూ బఫర్ జోన్‌ను మాయం చేయడం దారుణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డీపీకి బదులు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్కు వద్ద ఎస్ఆర్డీపీ స్వరూపమిదే సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఐదు ప్యాకేజీల్లో మొత్తం 18 పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో పనులు చేయాలనుకున్నా.. భూసేకరణ చిక్కుల నేపథ్యంలో రెండింటిని విరమించుకుంది. నాలుగు జంక్షన్ల వద్ద దాదాపు రూ.253 కోట్లతో పనులకు సిద్ధమైంది. ఈ పనులు చేసేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 1,394 చెట్లను తొలగించాలని నిర్ణయించారు. స్టే ఎత్తివేతకు యత్నాలు.. పార్కు చుట్టూ ఉన్న 1,394 చెట్ల తొలగింపుపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే ఇవ్వడంతో జీహెచ్ఎంసీ దాన్ని వెకేట్ చేయించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు అవసరాన్ని , భవిష్యత్‌లో ట్రాఫిక్.. దాంతోపాటు పెరిగే కాలుష్యం తదితరమైనవాటిని పేర్కొంటూ చెన్నైలోని రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిల్ ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోంది. ఈ నెల 27న ఇది తిరిగి విచారణకు రానున్నట్లు తెలిసింది. జీవ వైవిధ్యానికి ప్రమాదం: ప్రొఫెసర్ వెంకటరమణ, వృక్ష శాస్త్రవేత్త ఈ పార్కులోని అరుదైన 500 వృక్షజాతులను కాపాడుకోవడం ద్వారా నగర జీవశాస్త్ర చరిత్రను భావితరాలకు అందించే వీలుంటుంది. ఈ పార్కు ద్వారా పౌరులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతోంది. పార్కులోని కొలనుల ద్వారా వర్షపు నీటిని నేలలోకి ఇంకిస్తుండడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుతో పక్షులు, జీవజాతుల ఆకలి తీరుస్తోన్న వైల్డ్ గ్రేప్స్, కల్మిపండ్లు, సీతాసుధారి, పరికిపండ్లు, తునికిపండ్ల చెట్లతోపాటు బూరుగు, మోదుగ చెట్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను నిరోధించే తిప్పతీగ, చక్కెర వ్యాధిని నియంత్రించే పొడపత్రి, సుగంధిపాల, భారీ సుగంధి, శతావరి, డయేరియాను నిరోధించే పాలకొడిశ వంటి ఔషధ మొక్కల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడి వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరే చోటికి తరలించినా అవి బతికే అవకాశాలు తక్కువ. నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ తగ్గదు. వారసత్వ కట్టడంగా పరిగణించాలి: జయభారతి, పర్యావరణవేత్త, హైదరాబాద్ రైజింగ్ ప్రతినిధి తెలంగాణ జీవవైవిధ్యానికి ప్రతీక కేబీఆర్ పార్క్. ఇందులో 500 రకాల వృక్ష జాతులు, 120 అరుదైన పక్షి జాతులు, 20 క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటక జాతులున్నాయి. ఈ పార్కును వారసత్వ కట్టడంగా పరిగణించి కాపాడాలి. మేం అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో నిలకడ గల అభివృద్ధిని కోరుకుంటున్నాం. అరుదైన వృక్షజాతులు అంతరించే ప్రమాదం రాజధాని నగరంలో సుమారు 1,800 రకాల వృక్ష జాతులు ఉండగా.. కేబీఆర్ పార్కులోనే 500 రకాల అరుదైన వృక్ష జాతులున్నాయి. పార్కులో కీటకాలను భక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే డ్రాసిరా ఇండికా, డ్రాసిరా బర్మానీతోపాటు ఔషధ విలువలు అధికంగా ఉన్న నన్నారి(మారేడు గడ్డలు), పొడపత్రి, ఆస్తమా రోగులకు ఉపశమనం ఇచ్చే కొండగోగు, తిరుమ, రేగిస, సోమి, పాలకొడిశ, పక్షుల ఆకలి తేర్చే కల్మికాయలు, జీడిపండు, సీతాఫలం, ఊడుగు వంటి వృక్షాలున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్డీపీతో వీటి మనుగడ ప్రశ్నార్థకం కానుంది. నగరంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చేవి మూడు పార్కులే. ఇందులో సుమారు 400 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన కేబీఆర్ పార్క్ ఒకటి. ఈ పార్కు అరుదైన జంతు జాతులకు ఆహారభాండాగారం(ఫుడ్బౌల్)గా, జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీని సహజ స్వభావాన్ని దెబ్బతీస్తే ఈ జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.