నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసుపై తుది తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కానిస్టేబుల్ ఓబులేశుకు జీవిత ఖైదు విధించింది. గతేడాది నవంబర్ 14వ తేదీన బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్లో ఉదయపు నడకను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతున్న నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తేరుకున్న నిత్యానందరెడ్డి తనవద్ద ఉన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు.
దీంతో ఆగంతకుడు ఏకే 47 వదిలి పరారైయ్యాడు. నిత్యానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిలిన ఏకే 47 తుపాకీ ఆధారంగా కేసు విచారణ ప్రారంభించారు. ఆ తుపాకీ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేశుదని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.