కేబీఆర్ పార్కులో జీవవైవిధ్యానికి ముప్పు | The threat to biodiversity in KBR park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కులో జీవవైవిధ్యానికి ముప్పు

Published Wed, May 18 2016 3:36 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కేబీఆర్ పార్కులో జీవవైవిధ్యానికి ముప్పు - Sakshi

కేబీఆర్ పార్కులో జీవవైవిధ్యానికి ముప్పు

♦ ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుతో అరుదైన వృక్ష, జంతు జాతుల మనుగడకు ప్రమాదం
♦ పార్కు చుట్టూ 1,394 చెట్లను తొలగించాలని అధికారుల నిర్ణయం
♦ ట్రాఫిక్ పేరిట పార్కు ఉనికిని దెబ్బతీస్తారా?: పర్యావరణవేత్తలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బహుళ వరుసల దారుల (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్-ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టుతో భాగ్యనగరానికే తలమానికమైన కేబీఆర్ పార్క్‌లో జీవ వైవిధ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. పార్కు చుట్టూ బఫర్‌జోన్‌గా పరిగణించే ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన నడక దారి(వాక్‌వే) మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోపాటు పార్కులో పలు అరుదైన వృక్ష, జంతు, జీవజాతులు, ఔషధ మొక్కల జాతులు అంతరించి పోయే ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లండన్, న్యూయార్క్ వంటి మహానగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా.. నగరంలో బహుళ వరుసల దారుల పేరుతో జాతీయ పార్కు ఉనికిని దెబ్బతీయడం సమంజసం కాదని స్పష్టంచేస్తున్నారు. సాధారణంగా జాతీయ పార్కులకు పది కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా పరిగణించాలని, భారీ నిర్మాణాలు చేపట్టరాదని కేంద్ర అటవీ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినా కేబీఆర్ పార్కు చుట్టూ బఫర్ జోన్‌ను మాయం చేయడం దారుణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్‌ఆర్‌డీపీకి బదులు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని డిమాండ్ చేస్తున్నారు.

 పార్కు వద్ద ఎస్‌ఆర్‌డీపీ స్వరూపమిదే
 సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఐదు ప్యాకేజీల్లో మొత్తం 18 పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో పనులు చేయాలనుకున్నా.. భూసేకరణ చిక్కుల నేపథ్యంలో రెండింటిని విరమించుకుంది. నాలుగు జంక్షన్ల వద్ద దాదాపు రూ.253 కోట్లతో పనులకు సిద్ధమైంది. ఈ పనులు చేసేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 1,394 చెట్లను తొలగించాలని నిర్ణయించారు.

 స్టే ఎత్తివేతకు యత్నాలు..
 పార్కు చుట్టూ ఉన్న 1,394 చెట్ల తొలగింపుపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) స్టే ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ దాన్ని వెకేట్ చేయించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు అవసరాన్ని , భవిష్యత్‌లో ట్రాఫిక్.. దాంతోపాటు పెరిగే కాలుష్యం తదితరమైనవాటిని పేర్కొంటూ చెన్నైలోని రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిల్ ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోంది. ఈ నెల 27న ఇది తిరిగి విచారణకు రానున్నట్లు తెలిసింది.

 జీవ వైవిధ్యానికి ప్రమాదం: ప్రొఫెసర్ వెంకటరమణ, వృక్ష శాస్త్రవేత్త
 ఈ పార్కులోని అరుదైన 500 వృక్షజాతులను కాపాడుకోవడం ద్వారా నగర జీవశాస్త్ర చరిత్రను భావితరాలకు అందించే వీలుంటుంది. ఈ పార్కు ద్వారా పౌరులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతోంది. పార్కులోని కొలనుల ద్వారా వర్షపు నీటిని నేలలోకి ఇంకిస్తుండడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుతో పక్షులు, జీవజాతుల ఆకలి తీరుస్తోన్న వైల్డ్ గ్రేప్స్, కల్మిపండ్లు, సీతాసుధారి, పరికిపండ్లు, తునికిపండ్ల చెట్లతోపాటు బూరుగు, మోదుగ చెట్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను నిరోధించే తిప్పతీగ, చక్కెర వ్యాధిని నియంత్రించే పొడపత్రి, సుగంధిపాల, భారీ సుగంధి, శతావరి, డయేరియాను నిరోధించే పాలకొడిశ వంటి ఔషధ మొక్కల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడి వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరే చోటికి తరలించినా అవి బతికే అవకాశాలు తక్కువ. నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ తగ్గదు.    
 
 వారసత్వ కట్టడంగా పరిగణించాలి: జయభారతి, పర్యావరణవేత్త, హైదరాబాద్ రైజింగ్ ప్రతినిధి
 తెలంగాణ జీవవైవిధ్యానికి ప్రతీక కేబీఆర్ పార్క్. ఇందులో 500 రకాల వృక్ష జాతులు, 120 అరుదైన పక్షి జాతులు, 20 క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటక జాతులున్నాయి. ఈ పార్కును వారసత్వ కట్టడంగా పరిగణించి కాపాడాలి. మేం అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో నిలకడ గల అభివృద్ధిని కోరుకుంటున్నాం.    
 
 అరుదైన వృక్షజాతులు అంతరించే ప్రమాదం

 రాజధాని నగరంలో సుమారు 1,800 రకాల వృక్ష జాతులు ఉండగా.. కేబీఆర్ పార్కులోనే 500 రకాల అరుదైన వృక్ష జాతులున్నాయి. పార్కులో కీటకాలను భక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే డ్రాసిరా ఇండికా, డ్రాసిరా బర్మానీతోపాటు ఔషధ విలువలు అధికంగా ఉన్న నన్నారి(మారేడు గడ్డలు), పొడపత్రి, ఆస్తమా రోగులకు ఉపశమనం ఇచ్చే కొండగోగు, తిరుమ, రేగిస, సోమి, పాలకొడిశ, పక్షుల ఆకలి తేర్చే కల్మికాయలు, జీడిపండు, సీతాఫలం, ఊడుగు వంటి వృక్షాలున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఆర్‌డీపీతో వీటి మనుగడ ప్రశ్నార్థకం కానుంది. నగరంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చేవి మూడు పార్కులే. ఇందులో సుమారు 400 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన కేబీఆర్ పార్క్ ఒకటి. ఈ పార్కు అరుదైన జంతు జాతులకు ఆహారభాండాగారం(ఫుడ్‌బౌల్)గా, జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీని సహజ స్వభావాన్ని దెబ్బతీస్తే ఈ జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement