హాయిగా..ఊపిరి పీల్చుకున్న సిటీ | Air-pollution heavy decreased between 9 to 15 dates | Sakshi
Sakshi News home page

హాయిగా..ఊపిరి పీల్చుకున్న సిటీ

Published Fri, Jan 17 2014 1:48 AM | Last Updated on Tue, May 29 2018 1:20 PM

Air-pollution heavy decreased  between  9 to 15 dates

సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ ‘జాం’జాటం... ముక్కుపుటాలదిరిపోయే వాయు కాలుష్యం... ఊపిరాడని దుస్థితి... ఇది రొటీన్‌గా ఉండే సిటీ సీన్. కానీ వీటి నుంచి నగరవాసికి ఏడు రోజుల పాటు ఉపశమనం లభించింది. ఈ సంక్రాంతికి గ్రేటర్‌వాసులు అధికశాతం పల్లెబాట పట్టడంతో లక్షలాది వ్యక్తిగత వాహనాలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం భారీగా తగ్గింది.

 ఈ నెల 9 నుంచి 15 వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బృందాలు అబిడ్స్, పంజగుట్ట, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, కేబీఆర్‌పార్క్, బాలానగర్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, ఉప్పల్ ప్రాంతాల్లో వాయుకాలుష్య మోతాదును నమోదు చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరికొన్ని చోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ తాజా రిపోర్టు వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరాడనీయకుండా చేసే సూక్ష్మ ధూళికణాలు (ఆర్‌ఎస్‌పీఎం), స్థూల ధూళికణాలు (టీఎస్‌పీఎం), ముక్కుపుటాలను అదరగొట్టి, ఊపిరితిత్తులకు పొగబెట్టే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఓటూ), నైట్రస్ ఆక్సైడ్ (ఎన్‌ఓఎక్స్)ల మోతాదులు సాధారణ రోజుల్లో నమోదయ్యే సగటు కంటే బాగా తగ్గడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

 గ్రేటర్‌లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్నిరకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ సెలవుల్లో సింహభాగం వాహనాలు ఇంటికే పరిమితం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గింది. దీంతో ఇంధన వినియోగం తగ్గి కాలుష్య ఉద్గారాలు వెలువడటం తగ్గిందని పీసీబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

‘గ్రేటర్’లో సాధారణ రోజుల్లో సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఇంధనాన్ని మండించడం (వినియోగం) పెరిగి భయంకరమైన పొగ వెలువడుతుందని వారు తెలిపారు. ఇందులో ఆర్‌ఎస్‌పీఎం, టీఎస్‌పీఎం, ఎస్‌ఓటూ, ఎన్‌ఓఎక్స్ వంటి ఉద్గారాలు అధిక మోతాదులో ఉంటాయన్నారు. కానీ పండగ సెలవుల్లో ఈ పరిస్థితి లేని కారణంగా వాయుకాలుష్యం తగ్గిందని విశ్లేషించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement