
ఆన్‌లైన్ బుకింగ్‌తో క్యూకు ఫుల్‌స్టాప్
నావిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే సులువుగా జూ సందర్శన
చార్మినార్: పాతబస్తీలోని నెహ్రూ జులాజికల్ పార్కును సందర్శించడానికి చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఇష్టపడుతున్నారు. జూ సందర్శనకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చాంతాడంత క్యూ లైన్‌లకు ఫుల్‌స్టాఫ్ పడింది. జూ సందర్శకులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే టికెట్ రేట్లు పెరిగినా.. ఆదరణ తగ్గలేదు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచైనా జా సందర్శన టికెట్లను ఆన్‌లైనా ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జూ బుకింగ్ కౌంటర్ వద్ద ఉండే క్యూలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో..మనల్ని మనమే మరచిపోయి కాస్సేపు సరదాగా..ఉల్లాసంగా..ఉత్సాహాంగా గడపడానికి నెహ్రూ జూలాజికల్ పార్కు చక్కని వేదిక. అంతేకాకుండా మొబైల్ నావిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే..జూ పార్కులోని అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారాన్ని మన కళ్ల ముందుంటుంది. గత నెల 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పెద్దలకు వీక్ డేస్‌లలో రూ.70, చిన్నారులకు రూ.45 లుగాను..వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా..ప్రస్తుతం రెండు కేటగిరీల వారీగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారుకు రూ.50గా నిర్దారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి.
ఆహ్లాదం, వినోదంతో పాటు విజ్ఞానం పంచుతున్న జూ..
నెహ్రూ జూలాజికల్ పార్కు ఓ ఎంటర్‌టైన్ మెంట్ పార్కుగా కాకుండా సందర్శకులకు ఆహ్లాదం, వినోదంతో పాటు జంతువు, పక్షులపై కొత్త విషయాలను నేర్చుకునే విద్యాలయంగా చెప్పవచ్చు. దీంతో జూ సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. అప్పుడప్పుడు వచ్చే పాఠశాలలు, కళాశాలలకు సెలవులతో పాటు వీకెండ్ రోజులలో జూపార్కును సందర్శించే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. వేలాది మంది సందర్శకులకు జంతువులు, పక్షులపై ప్రత్యేక అవగాహనను జూపార్కు అధికారులు కలి్పస్తూ జూలో అనేక కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం కలిగిస్తున్నారు. కేవలం కాలక్షేపం కోసమే కాకుండా జంతు ప్రపంచం గురించి తెలుసుకునే విజ్ఞాన యాత్రగా జూ పార్కు సందర్శన ఉంటుంది. జూ పార్కును సందర్శించడానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
జూ సందర్శనకు పెరిగిన ఆసక్తి..
జూలో లేని జంతువు, పక్షులను రప్పించేందుకు, జంతువు, పక్షుల సంతానోత్పత్తి చేపట్టడం ప్రారంభించాక జూ సందర్శన పట్ల సందర్శకుల్లో అమితమైన ఆసక్తి పెరిగింది. అత్యంత విషతుల్యమైన పాములు, విషం లేని పాములను స్నేక్ సెల్ బృందం ప్రదర్శిస్తూ వాటి వివరాలను సందర్శకులకు తెలియజేస్తూ పాములపై సందర్శకులకు ఉన్న అపోహాలను తొలగిస్తున్నారు. అంతేకాకుండా వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ వన్యప్రాణులను దత్తత తీసుకునే వెసలుబాటును కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లపై సందర్శకులను చైతన్యవంతులను చేస్తూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్నారు. సందర్శకులు రోజంతా ఉపశమనం పొందడమే కాకుండా ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వన్యప్రాణులను తిలకించడమే కాకుండా అనేక విషయాలను తెలుసుకోవడం లాంటి అనుభూతులను జూను సందర్శిస్తే కాని తెలియదు.

ఎప్పటికప్పడు కొత్తదనం..
జూపార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతరించిపోయే జంతువు, పక్షుల సంతానోత్పత్తిని చేపట్టేందుకు జూపార్కు కేంద్ర బిందువుగా ఉంది. చిన్నారులు ఆడుకునేందకు చిల్డ్రన్స్ పార్కు, సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, రచ్చబండలు, సహాపంక్తి భోజనాలు చేసేందుకు పచ్చని తోరణాలతో విచ్చుకున్న పచ్చదనం జూపార్కు అందచందాలను తిలకించేందుకు విజిటర్ వ్యాన్, లయన్ సఫారీ, చిట్టి రైలు అందుబాటులో ఉన్నాయి.