ఒక్క ‘నమస్తే’తో దొరికిపోయాడు
►ఆ కవలలు రియల్ హీరోలు
►చిన్న అనుమానమే పెద్ద దొంగను పట్టించింది.
►ఈ సారి థాయ్ మసాజ్‌కు ప్లాన్
►మూడుసార్లు పోలీసులకు బురిడీ
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో గత పదేళ్లుగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేస్తే కచ్చితంగా పని చేసుకెళ్లే ఓ చైన్‌స్నాచర్ పదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పార్కు బ్లూ ప్రింట్ తీసుకుని, దొంగతనాలు జరిగిన తీరుపై సమీక్షించారు.. అయినా ఖాకీలను బురిడీ కొట్టిస్తూ ఎప్పటికప్పుడూ తనదైన రీతిలో పని కానిచ్చేస్తున్నాడు.
దీంతో అతడి కోసమే ప్రత్యేకంగా పార్కు చుట్టూ 60 కెమెరాలు ఏర్పాటు చేయడమేగాక పార్కులో ఉన్న మరో 25 కెమెరాలపై నిఘా ఉంచారు. అయినా స్నాచింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉండటంతో మరో 20 కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇన్ని కెమెరాలకు చిక్కని నిందితుడు కేవలం ఒక ‘‘నమస్తే’’కు దొరికిపోయాడు. ఇద్దరు సినీ కవలలైన స్టంట్ మాస్టర్లు అతడిని పట్టించి రియల్ హీరోలుగా మిగిలారు.. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకట్వేర్‌రావు మంగళవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.
కార్మికనగర్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అలియాస్, నర్సింహ అలియాస్ రిషీ చిన్నా(25) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన కేబీఆర్ పార్కులో ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు బంగారు గొలుసులు (250 గ్రాములు), ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినప్పటికీ పోలీసులను బురిడీ కొట్టించి బయట పడినట్లు తెలిపారు. నిందితుడితోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన ఓం నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణచారిని కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
రిచ్‌గా ఉండాలని...
నర్సింహ అలియాస్ రిషీచిన్నా చదివింది పదో తరగతి. విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకనే అతను అందుకోసం చోరీల బాట పట్టాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను దానికి సమీపంలోనే ఉన్న సుజాత హైస్కూల్‌లో చదివినట్లు చెప్పుకొనేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని బీటెక్ చదివానంటూ అందరినీ నమ్మించేవాడు. పబ్బులకు వెళ్లాలని, గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగాలని, విదేశీ టూర్లు, బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. అదే ఆలోచన నర్సింహను రిషీగా మార్చింది. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకొనేలా చేసింది.
కేబీఆర్ పార్క్ కొట్టిన పిండి
నర్సింహకు పోలీసులు సేకరించిన కేబీఆర్ బ్లూప్రింట్ కంటే ఎక్కువగా పార్కు చుట్టూ ఉన్న కెమెరాలు, ఎక్కడి నుంచి వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికి రావాలి అనే ప్రతి విషయం తెలుసు. దీంతో అతను కేబీఆర్ పార్కు చాలా సేఫ్ ప్లేస్‌గా భావించాడు. ఇక్కడే రెండు నెలల వ్యవధిలో స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ పార్క్‌కు వచ్చేవాడు. వాకింగ్ చేసినట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. తోటి వాకర్లకు అనుమానం రాకుండా మసలుకునేవాడు.
పట్టించిన నమస్తే..
పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వాకర్లను గుర్తుపెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో అతను రోజూ పార్కుకు వస్తున్న కవల స్టంట్ మాస్టర్లకు నమస్తే పెట్టేవాడు. ఈ క్రమంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కున అతను అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా వారు ఎదురయ్యారు. ఎప్పటిలానే నర్సింహ వారికి నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొంచెం ముందుకు వచ్చిన వారికి స్నాచింగ్ జరిగిందని తెలియడం, ఆ సమయంలో అటువైపు అతనొక్కడే వెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. తాజాగా నాలుగు రోజుల క్రితం పార్కుకు వచ్చిన నర్సింహను గుర్తించిన వారు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సింహను అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు.
థాయ్ మసాజ్‌కు వెళ్లాలని..
నర్సింహకు థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఈ నేపథ్యంలో అతను నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్కుకు వచ్చాడు. అక్కడ స్నాచింగ్‌కు పాల్పడి తరువాత దసరాకు ముందు మరోసారి పంజా విసరాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. బంగారాన్ని డబ్బులుగా మార్చుకొని థాయిలాండ్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు.
మూడుసార్లు టోకరా..
కేపీహెచ్‌బీలోనూ అతను గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని నమ్మించి బురిడీ కొట్టించాడు. మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్ కేసులోనూ అలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోనూ స్నాచింగ్‌కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోనూ ఇలాగే చెప్పడంతో పోలీసులు నమ్మి వదిలేశారు. చివరికి ఇలా కేబీఆర్ పార్కులో వాకర్‌లా నటించి స్నాచింగ్‌లకు పాల్పడుతూ వాకర్లు ఇచ్చిన సమాచారంతో నాటకార్ నర్సింహ నాటకానికి తెరపడింది.
సంబంధిత వార్త..
ఇంట్లో నర్సింహ.. బయట రిషి!