వనం.. ఖాకీమయం
కాల్పుల ఘటనతో పోలీస్ అలర్ట్
కేబీఆర్ పార్కు వద్ద భారీ బందోబస్తు
రక్షక్, స్పెషల్ వాహనాలలో గస్తీ
అడుగడుగునా పోలీసులే...
సడలని ధీమా...పార్కుకు తగ్గని రద్దీ
బంజారాహిల్స్: కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజు...కేబీఆర్ పార్కులో సీన్ మారింది. నిన్నటిదాకా వందలకొద్ది వాకర్లు మాత్రమే నడిచే వాక్‌వే కనిపించేది. కానీ గురువారం అందుకు భిన్నంగా అడుగడుగునా ఖాకీలు కనిపించారు. బుధవారం ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు ఏకే-47తో కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భద్రతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వ యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగజేసుకోవాల్సి వచ్చిం ది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్నారు. నిన్నమొన్నటిదాకా ఒక్క హోంగార్డు కూడా తిరగని ఈ పార్కు వద్ద గురువారం తెల్లవారుజామున నాలుగు గంట ల నుంచే భారీగా పోలీసులను మోహరించారు.
హోంగార్డు స్థాయి నుంచి అధికారి వరకు పార్కు చుట్టూ రౌండ్లేశారు. సాయుధ బలగాల మోహరించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పోలీసు వాహనాలు సుమారు 12 వరకు పార్కు చుట్టూ రౌండ్లు కొట్టాయి. వీటికి తోడు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా రక్షక్ వాహనాలను రప్పించారు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ నాగరాజు, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్‌ఐలు పార్కు చుట్టూ నిఘా ఉంచారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. మొత్తానికి కేబీఆర్ పార్కు పోలీసు దిగ్బంధంలో ఉండిపోయింది. నిఘా మధ్య సామాన్యులు, వీఐపీలు, వీవీఐపీలు వాకింగ్ చేయాల్సి వచ్చింది.