నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: సీఎం కేసీఆర్ ‘కేబీఆర్ కాల్పుల’ ఘటనలో నిందితుడి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు వద్ద జరిగిన కాల్పుల ఘటనలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని కొద్ది గంటల్లోనే గుర్తించి, అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నగరంలో కొద్దిపాటి సీసీ కెమెరాల సాయంతోనే పోలీసులు అనేక కేసులు ఛేదించారంటూ అభినందించారు. హైదరాబాద్‌లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నిఘా కెమెరాల్లో వచ్చే సమాచారాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా నగరంలో అంతర్జాతీయ స్థాయి ‘కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అరబిందో ఫార్మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనను వివరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. శాంతిభద్రతలపై రాజీపడబోమన్నారు.
అందులోని అంశాలివీ..
‘‘కాల్పుల ఘటనలో ఒక ఆగంతకుడు ఏకే-47 రైఫిల్‌తో అరబిందో ఫార్మా కంపెనీ యజమాని కంభం నిత్యానందరెడ్డిని డబ్బు డిమాండ్ చేసినపుడు జరిగిన పెనుగులాటలో కాల్పులు జరిగాయి. బంజారాహిల్స్ పోలీసు లు ఐపీసీ 307, 364ఏ, 511 సెక్షన్ల కింద, ఆయుధ చట్టం-25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని అతన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. గుర్తించిన 24 గంటల్లోనే నిందితుడిని వెంటాడి కర్నూలులో అరెస్టు చేశారు. అతని పేరు పి.ఓబులేసు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన అతడు కర్నూలులోని రెండో బెటాలియన్‌లో 1998లో కానిస్టేబుల్‌గా నియమితుడయ్యాడు. 2002 నుంచి 2014 మార్చి 14 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశాడు. అందులో పనిచేస్తున్నపుడే ఏకే-47 రైఫిల్ చోరీ జరిగినట్లు తేలింది. కీలకమైన ఆధారం సీసీటీ వీ ఫుటేజ్ ద్వారా లభించింది. దానిద్వారానే నిందితుడిని గుర్తించారు.
హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత చర్యల్లో భాగంగా నగరమంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చే సేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి, మంజూరు చేశాం. రూ.150 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పోలీసు వ్యవస్థ, అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించేందుకు త్వరలో పునాది వేస్తాం. కాల్పుల ఘటనలో నిందితుడికి శిక్ష పడేలా పక్కా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కేసును రికార్డు సమయంలో ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నాం’’
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి భద్రత
Published Sat, Nov 22 2014 1:07 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement
Advertisement