బైస్కిల్ ‘సిటీ’ దశలవారీగా ట్రాక్‌ల విస్తరణ
కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లాన్‌లో భాగంగా ప్రతిపాదనలు
కేబీఆర్ పార్కు, హుస్సేన్‌సాగర్‌ల చుట్టూ ట్రాక్
నాన్‌మోటరైజ్డ్ రవాణా సదుపాయాలపై దృష్టి
50 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌కు ఉమ్టా ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంటే ఒకప్పుడు సైకిళ్ల నగరం. వాహనాలు పెద్దగా రోడ్డెక్కని ఆ రోజుల్లో ప్రజలు సైకిళ్లనే అత్యధికంగా వినియోగించారు. బహుశా మరే నగరంలో లేనన్ని సైకిళ్లు హైదరాబాద్‌లో వినియోగంలో ఉన్నందుకే నిజాం కాలంలో దీన్ని సైకిళ్ల నగరం అని పిలిచారు. అలాంటి నగరం ఇప్పుడు వాహనాల నగరంగా మారింది. సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు సిటీ రోడ్లపైన పరుగులు తీస్తున్నాయి.
దీంతో సైకిల్‌కు చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాన్‌మోటరైజ్డ్ రవాణా సదుపాయాలపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఉమ్టా అధికారులు తెలిపారు. మొదటి దశలో సుమారు 50 కిలోమీటర్ల వరకు సరికొత్త సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సైకిలిస్టులకు పూర్తి భద్రత ఉండేవిధంగా ఈ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోస్టేషన్‌లు, సిటీ బస్‌స్టేషన్‌లు, జంక్షన్‌లలో సైకిళ్లను వినియోగించే విధంగా పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాక్...
ఈ ప్రణాళికలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు, నెక్లెస్‌రోడ్ సందర్శనకు వచ్చేవారు సరదాగా సైకిళ్లపైన విహరించవచ్చు. అలాగే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాక్‌లను విస్తరించడం వల్ల వాకింగ్‌తో పాటు సైకిలింగ్ కూడా ఒక వ్యాయామంగా మారనుంది. మరోవైపు పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా వాహనాల వల్ల సైకిలిస్టులకు ప్రమాదాలు వాటిల్లకుండా ఫుట్‌పాత్‌ల మధ్యలో ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
మెట్రో స్టేషన్‌లకు సైకిళ్లు...
కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లానింగ్‌లో భాగంగా మెట్రో స్టేషన్‌లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం నాన్‌మోటరైజ్డ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మెట్రో స్టేషన్‌లకు 2 కిలోమీటర్ల పరిధిలో సైకిళ్లను వినియోగించేవిధంగా ట్రాక్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అవకాశం ఉన్న మెట్రో స్టేషన్‌ల వద్ద ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రోత్సహించడంతో పాటు సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే నగరం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల్లో సైకిళ్ల కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో అవకాశం ఉన్న చోట 50 కిలోమీటర్ల వరకు ట్రాక్‌లను విస్తరించి దశల వారీగా ట్రాక్‌ల సంఖ్యను పెంచనున్నారు. గత సంవత్సరం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, ఇటు కొల్లూరు వరకు హెచ్‌ఎండీఏ అధునాతన సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్...
⇒ హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్టా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్‌పైన దృష్టి సారించింది. ఇందుకోసం వినియోగంలో ఉన్న ప్రజా, ప్రైవేట్, వ్యక్తిగత రవాణా సదుపాయాలపైన అధ్యయనం చేసి 2050 నాటికి అవసరమైన రహదారుల విస్తరణ, రవాణా,మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసి ఉంది.
⇒ ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ లీ అసోసియేట్స్‌కు అధ్యయన బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఈ పరిధి 10 వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనుంది. అలాగే నగర జనాభా కూడా 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఈ మేరకు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ను రూపొందించవలసి ఉంది. ఇందులో భాగంగా సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధిని చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment