ఈసారి మూడు గంటల ముందే నిమజ్జనం పూర్తి ∙ నగర సీపీ సీవీ ఆనంద్
ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందే పూర్తి చేశామని, సోమవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఫ్రీ చేయగలిగామని, ఇదంతా ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్లే సాధ్యమైందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో హుస్సేన్ సాగర్‌లో ఒక్కరోజే 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. మొత్తం 11 రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు.
ఇంకా మిగిలి ఉన్న విగ్రహాలను ప్రణాళిక ప్రకారం నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.40కి పూర్తిచేశాం..ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్‌లో నిమజ్జన కార్యక్రమంలో చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేటలకు చెందిన నిర్వాహకులు ముందుకొచ్చి విగ్రహాలను త్వరగా తరలించారన్నారు.
ఈస్ట్‌జోన్, సౌత్ జోన్‌ల పరిధిలో మండప నిర్వాహకులు ఎంత చెప్పినా ముందుకు రాలేదని, అందుకే ఆలస్యమవుతుందన్నారు. ఇష్టమొచి్చనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచైనా మండప నిర్వాహకులు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకొని పోలీసులకు, జీహెచ్‌ఎంసీకి సహకరిచాలన్నారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య రెండు భారీ వినాయక విగ్రహాలు ఇరుక్కుపోవడం వల్ల కొంత ఆలస్యమైందని, ఓల్డ్ సిటీ, ఆబిడ్స్ మెయిన్ రోడ్లలో వాహనాలు బ్రేక్ డౌన్ కావడం 4–5 గంటల ఆలస్యానికి కారణమైందన్నారు.
పోలీసు సిబ్బంది, అధికారులు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ట్రాన్స్‌కో, ఆర్టీఏ సిబ్బంది, అధికారులు 40 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే గొడవలు చాలా తగ్గాయని, చిన్న చిన్న గొడవలు జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచి్చన వెంటనే పరిష్కరించామని తెలిపారు. మొదటి ఫేజ్, రెండవ ఫేజ్‌లలో కలిపి సిటీ పోలీసులు 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది మొత్తం 25 వేల మంది పోలీసులు నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం మీద నిమజ్జనోత్సవాలను సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నానని నగర సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment