సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లో దిగి పోలీసులకే చుక్కలు చూపించాడు. ‘90’ ఇస్తేనే బయటకు వస్తానంటూ ముప్పతిప్పలు పెట్టాడు. గత నెల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
జనవరిలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్యాంక్‌బండ్ పై నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. ఇతడు నడుము లోతు నీళ్లు ఉన్న ప్రాంతంలో నిల్చుని ఉండటాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటకులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అగి్నమాపక శాఖ అధికారులనూ రప్పించారు. ట్యాంక్‌బండ్ మీది నుంచి తాడు వేసిన ఓ కానిస్టేబుల్ అది పట్టుకుని పైకి రావాల్సిందిగా ఆ యువకుడిని కోరాడు. ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్లవద్దని, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు.
ఈ విషయాన్ని సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో సదరు కానిస్టేబుల్ ‘నీకు ఏం కావాలి?’ అంటూ ఉర్దూలో ఆ యువకుడిని అడిగాడు. దీనికి సమాధానంగా ‘90 (ఎంఎల్ పరిమాణంలో మద్యం) ఇస్తేనే బయటకు వస్తా’ అంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనేక మంది దీన్ని వీడియో తీశారు. ఓ నెటిజనుడు బుధవారం దీన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ రోజు దాదాపు గంట కష్టపడిన తర్వాత పోలీసులు ఆ యువకుడిని బయటకు రప్పించగలిగినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment