hussainsagar
-
Ganesh Nimajjanam: హుస్సేన్‌సాగర్‌లో లక్ష విగ్రహాలు
ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందే పూర్తి చేశామని, సోమవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఫ్రీ చేయగలిగామని, ఇదంతా ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్లే సాధ్యమైందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో హుస్సేన్ సాగర్‌లో ఒక్కరోజే 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. మొత్తం 11 రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. ఇంకా మిగిలి ఉన్న విగ్రహాలను ప్రణాళిక ప్రకారం నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.40కి పూర్తిచేశాం..ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేటలకు చెందిన నిర్వాహకులు ముందుకొచ్చి విగ్రహాలను త్వరగా తరలించారన్నారు. ఈస్ట్‌జోన్, సౌత్ జోన్ల పరిధిలో మండప నిర్వాహకులు ఎంత చెప్పినా ముందుకు రాలేదని, అందుకే ఆలస్యమవుతుందన్నారు. ఇష్టమొచి్చనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచైనా మండప నిర్వాహకులు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకొని పోలీసులకు, జీహెచ్ఎంసీకి సహకరిచాలన్నారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య రెండు భారీ వినాయక విగ్రహాలు ఇరుక్కుపోవడం వల్ల కొంత ఆలస్యమైందని, ఓల్డ్ సిటీ, ఆబిడ్స్ మెయిన్ రోడ్లలో వాహనాలు బ్రేక్ డౌన్ కావడం 4–5 గంటల ఆలస్యానికి కారణమైందన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాన్స్‌కో, ఆర్టీఏ సిబ్బంది, అధికారులు 40 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే గొడవలు చాలా తగ్గాయని, చిన్న చిన్న గొడవలు జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచి్చన వెంటనే పరిష్కరించామని తెలిపారు. మొదటి ఫేజ్, రెండవ ఫేజ్‌లలో కలిపి సిటీ పోలీసులు 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది మొత్తం 25 వేల మంది పోలీసులు నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం మీద నిమజ్జనోత్సవాలను సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నానని నగర సీపీ తెలిపారు. -
‘సాగర్’ చుట్టూ స్కైవాక్ వే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ చుట్టూ టూరిజం డెస్టినేషన్సర్కిల్గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడ స్కైవాక్ వే నిర్మించాలని.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకొస్తున్న నేపథ్యంలో ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని కలిపి ఒక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక కేంద్రంగా బుద్ధవనం..: కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆరై్కవ్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితోపాటు తాజాగా అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో చేర్చింది. అందలో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. నాగార్జునసాగర్ డ్యామ్అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జునసాగర్సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్లో విహారించే సదుపాయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యాటకులు వెళ్లి రావడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్కొండ చుట్టూ రహదారుల విస్తరణ... గోల్కొండ కోట చుట్టూ ఉన్న రహదారులు ఇరుకుగా ఉన్నాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇళ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వలయాకారంలో డిజైన్ హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్ వే డిజైన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక హబ్‌గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనాలను తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్‌కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
Hyderabad: కేబీఆర్ పార్కు, హుస్సేన్‌సాగర్‌ల చుట్టూ సైకిల్ ట్రాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంటే ఒకప్పుడు సైకిళ్ల నగరం. వాహనాలు పెద్దగా రోడ్డెక్కని ఆ రోజుల్లో ప్రజలు సైకిళ్లనే అత్యధికంగా వినియోగించారు. బహుశా మరే నగరంలో లేనన్ని సైకిళ్లు హైదరాబాద్‌లో వినియోగంలో ఉన్నందుకే నిజాం కాలంలో దీన్ని సైకిళ్ల నగరం అని పిలిచారు. అలాంటి నగరం ఇప్పుడు వాహనాల నగరంగా మారింది. సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు సిటీ రోడ్లపైన పరుగులు తీస్తున్నాయి. దీంతో సైకిల్‌కు చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాన్‌మోటరైజ్డ్ రవాణా సదుపాయాలపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఉమ్టా అధికారులు తెలిపారు. మొదటి దశలో సుమారు 50 కిలోమీటర్ల వరకు సరికొత్త సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సైకిలిస్టులకు పూర్తి భద్రత ఉండేవిధంగా ఈ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోస్టేషన్లు, సిటీ బస్స్టేషన్లు, జంక్షన్లలో సైకిళ్లను వినియోగించే విధంగా పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాక్... ఈ ప్రణాళికలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు, నెక్లెస్‌రోడ్ సందర్శనకు వచ్చేవారు సరదాగా సైకిళ్లపైన విహరించవచ్చు. అలాగే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాక్‌లను విస్తరించడం వల్ల వాకింగ్‌తో పాటు సైకిలింగ్ కూడా ఒక వ్యాయామంగా మారనుంది. మరోవైపు పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా వాహనాల వల్ల సైకిలిస్టులకు ప్రమాదాలు వాటిల్లకుండా ఫుట్‌పాత్‌ల మధ్యలో ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. మెట్రో స్టేషన్లకు సైకిళ్లు... కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లానింగ్‌లో భాగంగా మెట్రో స్టేషన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం నాన్‌మోటరైజ్డ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మెట్రో స్టేషన్లకు 2 కిలోమీటర్ల పరిధిలో సైకిళ్లను వినియోగించేవిధంగా ట్రాక్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అవకాశం ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రోత్సహించడంతో పాటు సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే నగరం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల్లో సైకిళ్ల కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో అవకాశం ఉన్న చోట 50 కిలోమీటర్ల వరకు ట్రాక్‌లను విస్తరించి దశల వారీగా ట్రాక్‌ల సంఖ్యను పెంచనున్నారు. గత సంవత్సరం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, ఇటు కొల్లూరు వరకు హెచ్ఎండీఏ అధునాతన సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్...⇒ హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్టా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్‌పైన దృష్టి సారించింది. ఇందుకోసం వినియోగంలో ఉన్న ప్రజా, ప్రైవేట్, వ్యక్తిగత రవాణా సదుపాయాలపైన అధ్యయనం చేసి 2050 నాటికి అవసరమైన రహదారుల విస్తరణ, రవాణా,మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసి ఉంది. ⇒ ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ లీ అసోసియేట్స్‌కు అధ్యయన బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఈ పరిధి 10 వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనుంది. అలాగే నగర జనాభా కూడా 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఈ మేరకు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ను రూపొందించవలసి ఉంది. ఇందులో భాగంగా సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధిని చేపడతారు. -
Hussain Sagar: ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లో దిగి పోలీసులకే చుక్కలు చూపించాడు. ‘90’ ఇస్తేనే బయటకు వస్తానంటూ ముప్పతిప్పలు పెట్టాడు. గత నెల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జనవరిలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్యాంక్‌బండ్ పై నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. ఇతడు నడుము లోతు నీళ్లు ఉన్న ప్రాంతంలో నిల్చుని ఉండటాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటకులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అగి్నమాపక శాఖ అధికారులనూ రప్పించారు. ట్యాంక్‌బండ్ మీది నుంచి తాడు వేసిన ఓ కానిస్టేబుల్ అది పట్టుకుని పైకి రావాల్సిందిగా ఆ యువకుడిని కోరాడు. ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్లవద్దని, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో సదరు కానిస్టేబుల్ ‘నీకు ఏం కావాలి?’ అంటూ ఉర్దూలో ఆ యువకుడిని అడిగాడు. దీనికి సమాధానంగా ‘90 (ఎంఎల్ పరిమాణంలో మద్యం) ఇస్తేనే బయటకు వస్తా’ అంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనేక మంది దీన్ని వీడియో తీశారు. ఓ నెటిజనుడు బుధవారం దీన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ రోజు దాదాపు గంట కష్టపడిన తర్వాత పోలీసులు ఆ యువకుడిని బయటకు రప్పించగలిగినట్లు తెలిసింది. -
HYD: నేటి నుంచి ఏవియేషన్ షో.. ఏ గేటు నుంచి ఎవరెవరికి ప్రవేశమంటే..
హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్‌స్క్వాడ్‌తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం.. గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్‌కు హాజరయ్యేవారు గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్ గేటు 5: ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు ► మీడియా, పాస్‌లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హైలైట్స్ ► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు. ► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా. ► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు ► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన. ► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. ► యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్‌కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్‌కు హాజరు కానున్నారు. సారంగ్ టీం స్పెషల్.. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్‌సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ రిహార్సల్స్‌ను కొనసాగించింది. -
డబుల్ డెక్కర్.. ఉచిత ప్రయాణం
హైదరాబాద్: ఎన్నికల వేళ.. డబుల్‌డెక్కర్ రోడ్డెక్కింది. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టూ మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు రూ.2.5 కోట్ల చొప్పున 3 బస్సులను ప్రవేశపెట్టారు. కానీ చాలాకాలం వరకు ఈ బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. నగరంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దఫాలుగా సర్వేలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రూట్లను ఖరారు చేయలేదు. దీంతో పార్కింగ్‌కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం సాగర్ చుట్టూ తిప్పుతున్నారు. సెక్రటేరియల్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విదేశీ పర్యాటకులు సైతం నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, పరిసరాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఇదీ రూట్... ప్రస్తుతం సాగర్ చుట్టూ మూడు బస్సులు కూడా తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్ పార్కు, జలవిహార్, నీరాకేఫ్, పీపుల్స్‌ప్లాజా, ఇందిరాగాంధీ, పీవీల విగ్రహాలు, అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సుల్లోనే ట్యాంక్‌బండ్ వైపు వెళ్లవచ్చు. అనంతరం ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కు వరకు చేరుకొంటాయి. బస్సు మొదటి అంతస్తులో కూర్చొని ఈ రూట్లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇవీ వేళలు.. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డబుల్ డెక్కర్ బస్సుల్లో సాగర్ చుట్టూ విహరించవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్ డెక్కర్లకు డిమాండ్ కనిపిస్తోంది. -
నిమజ్జనం.. మరింత వేగవంతం!
హైదరాబాద్: గణేష్ నవరాత్రుల్లో అత్యంత కీలక ఘట్టం సామూహిక నిమజ్జనం. దీనికోసం పోలీసులు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దాదాపు మధ్య మండలం మొత్తాన్నీ సాధారణ వాహనాలకు ‘నో ఎంట్రీ జోన్’గా మారుస్తారు. ఈ కారణంగానే ఈ క్రతువును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మరో టెక్నిక్‌ను అమలులోకి తెస్తున్నారు. విగ్రహం ఉంచే ప్లాట్‌ఫామ్ కింద ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్, మధ్యమండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లుతో పాటు ఇతర ఉన్నతాధికారులు దీన్ని శనివారం రాత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పడేసే పని ఉండదు... మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వాహనాల్లో హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకువస్తారు. అక్కడ నిమజ్జనం కోసం సిద్ధం చేసి ఉంచిన క్రేన్ల ప్లాట్‌ఫామ్ పైకి వీటిని ఎక్కిస్తారు. సాగర్ నీటి ఉపరితలం వద్దకు చేరిన తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌పై ఉండే సిబ్బంది విగ్రహాన్ని నీళ్లల్లోకి తోస్తారు. కొన్ని సందర్భాల్లో విగ్రహం ప్లాట్‌ఫామ్ వైర్‌కు పట్టుకోవడం, దాన్ని తప్పించి నీళ్లల్లో వేయడం జరుగుతుంటుంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసులు గడిచిన ఆరేళ్ల నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హుక్‌ను వాడుతున్నారు. ఈసారి దానికంటే వేగంగా నిమజ్జనం పూర్తి చేయడానికి మరో కొత్త విధానం అవలంబించనున్నారు. ప్లాట్‌ఫామ్‌కు కింద ప్లాస్టిక్ డ్రమ్స్... ఈ విధానంలో భాగంగా విగ్రహాలను ఉంచే ప్లాట్‌ఫామ్‌కు కింది వైపు ఓ పక్కన ఒకటి లేదా రెండు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఉన్న విగ్రహాన్ని నీటి ఉపరితలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత ప్రత్యేకంగా నీటిలోకి వేయాల్సిన అవసరం ఉండదు. క్రేన్ ఆపరేటర్ ప్లాట్‌ఫామ్‌ను కిందికి దించితే సరిపోతుంది. ఽఖాళీ డ్రమ్ము ఉన్న భాగం పైకి ఉండిపోయి.. మరోవైపు కిందికి వెళ్తుంది. ఫలితంగా ప్లాట్‌ఫామ్ పైన ఉన్న విగ్రహం ఆ వైపునకు పడిపోతుంది. ఈ విధానంగా నిమజ్జనం ఎవరి ప్రమేయం లేకుండా సాధారణ సమయం కంటే నాలుగు నుంచి ఆరు నిమిషాల ముందే ముగుస్తుంది. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాట్ల పరిశీలన... ట్యాంక్‌బండ్ ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదింది. దీంతో ఈ ఏడాది దానిపై అవసరమైన సంఖ్యలోనే క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ఎత్తు లేకుండా మధ్యస్తంగా ఉన్న వాటినే నిమజ్జనం చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో గతం కంటే ఎక్కువ క్రేన్లు ఉండనున్నాయి. వీటి ద్వారానే పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. సాగర్ చుట్టూ ఉండే అన్ని క్రేన్ల ప్లాట్‌ఫామ్‌లకు ఖాళీ డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. సామూహిక నిమజ్జనం సమీపిస్తుండటంతో అక్కడి ఏర్పాట్లను నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్రేన్ల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపులకు తీసుకుంటున్న చర్యల్లో అనేక మార్పులు చేర్పులను సూచించారు. -
హుస్సేన్‌సాగర్ తీరంలో మరో అందమైన పార్కు
హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ సుందరీకరణలో భాగంగా జలవిహార్ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. విశేషాలెన్నో.. ► ఈ పార్కులో ఎలివేటెడ్ వాక్‌వేస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాక్‌వేలపై నడుస్తుంటే హుస్సేన్‌సాగర్ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్ వాక్‌వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్‌వేలను ఏర్పాటు చేశారు. ► అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్, పంచతత్వ వాక్‌వే, సెంట్రల్ పాత్వే, అండర్ పాస్‌లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్ ఉంటుంది. కాంటిలివర్, పర్గోలాస్, విద్యుత్ కాంతులతో అందంగా ఆకట్టుకొనే శిల్పాలు సందర్శకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇల్యుమినేషన్ బొలా ర్డ్స్, ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, నియో ఫ్లెక్స్లైటింగ్ వంటి విద్యుత్ కాంతుల నడుమ బోర్డ్ వాక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందమైన ల్యాండ్‌స్కేప్.... ► లేక్‌వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్‌స్కేప్‌తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్ డిౖజైన్‌లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్‌లొకేట్ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు. ► పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్‌స్కేప్, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఎంట్రీ టికెట్ ఇలా.. ► లేక్‌వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి. -
హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం (ఫొటోలు)
-
హుస్సేన్‌సాగర్‌లో భారీగా పెరిగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లో కాలుష్యం అనూహ్యంగా పెరిగినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత రోజుల్లో సాగర్ నీటి నమూనాలను సేకరించి.. పరీక్షించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. నీటి రంగు, బురద రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, భార లోహాల మోతాదు పరిమితికి మించి పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. నిమజ్జనానికి ముందు ఆగస్టు 29 తోపాటు నిమజ్జనం జరిగిన తేదీలు సెప్టెంబరు 2,5, 7, 9 తేదీలలో.. నిమజ్జనం అనంతరం సెప్టెంబరు 12న పీసీబీ నిపుణులు.. ఎన్‌టీఆర్‌పార్క్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, లేపాక్షి పాయింట్, సాగరం మధ్యనున్న బుద్ధవిగ్రహంవద్ద నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని పాయింట్ల వద్దా కాలుష్యమే.. నిమజ్జనంతో పీసీబీ సేకరించిన అన్ని పాయింట్ల వద్ద కాలుష్య మోతాదు భారీగా పెరిగినట్లు గుర్తించారు. ఎన్టీఆర్ పార్క్ నిమజ్జనానికి ముందు సరాసరిన లీటరు నీటిలో బురద రేణువుల మోతాదు 45 మిల్లీగ్రాములుండగా.. అనంతరం ఏకంగా 152 మిల్లీ గ్రాములకు చేరింది. నీటి గాఢత కూడా 7.24 పాయింట్లుగా నమోదైంది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 712 మిల్లీగ్రాముల నుంచి 848 మిల్లీగ్రాములకు పెరిగింది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 37 మిల్లీగ్రాములుండగా.. నిమజ్జనం తర్వాత ఏకంగా 164 మిల్లీగ్రాములకు చేరింది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 10 మిల్లీగ్రాముల నుంచి 30 మి.గ్రా మేర పెరిగింది. భార లోహాలు క్రోమియం, లెడ్, జింక్, కాపర్, క్యాడ్మియం తదితరాల మోతాదు కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. లుంబినీ పార్క్ వద్ద: నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. బురద రేణువుల మోతాదు అత్యధికంగా 1340 మి.గ్రా నమోదైంది. గాఢత 8.12 పాయింట్లకు చేరింది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 831 మి.గ్రా నమోదైంది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 284 మిల్లీగ్రాములుగా.. నీటి కాఠిన్యత మి.గ్రాములకు చేరింది. నెక్లెస్‌రోడ్ వద్ద: బురద రేణువులు 112 మి.గ్రాములకు చేరువయ్యాయి. గాఢత 8.24 పాయింట్లుగా ఉంది. కరిగిన ఘన పదార్థాలు 829 మిల్లీగ్రాములుగా ఉన్నాయి. ఈ–కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 160 మిల్లీగ్రాములుగా ఉంది. నీటి కాఠిన్యత 404 మి.గ్రాములకు చేరింది. లేపాక్షి: బురద రేణువులు 100 మి.గ్రాములకు చేరాయి. నీటి గాఢత 8.50 పాయింట్లకు చేరింది.కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 126 మిల్లీగ్రాములుగా ఉంది. కాఠిన్యత 326 మి.గ్రా ఉంది. బుద్ధ విగ్రహం వద్ద: బురద రేణువులు 96 మి.గ్రా నమోదయ్యాయి. కరిగిన ఘన పదార్థాలు 832 మి.గ్రా ఉన్నాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 101 మి.గ్రా.. కాఠిన్యత 426 మి.గ్రా ఉంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 24 మిల్లీగ్రాములుగా ఉంది. అనర్థాలివే.. ► సాగర్‌లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ► సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ► వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ► జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. -
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. నగరం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడుతున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరగబోయే శోభాయాత్రను తిలకించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఈసారి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, బారికేడ్లను దాటడంలో ఇబ్బందులు పడకుండా ఉత్తమమైన మెట్రో మార్గాన్ని ఎంచుకోండి. -
‘ఎకో’దంతుడికి జై!
ఏకదంతుడు.. క్రమంగా ‘ఎకో’దంతుడవుతున్నాడు..మట్టి గణపతికి జై..రంగు ప్రతిమలకు బై.. అంటున్నారు భక్తులు. మట్టి విగ్రహాలకే మొక్కుతున్నారు..నీటి వనరుల కాలుష్యాన్ని పెంచుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) మోజు నుంచి బయటపడుతున్నారు. నాలుగైదేళ్లుగా మట్టి విగ్రహాల వైపు భక్తజనం దృష్టి సారిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలపై ప్రత్యేక కథనం.. - సాక్షి, హైదరాబాద్ సాగర్ నిమజ్జనంలో 43 శాతం మట్టివే.... గతేడాది నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాల్లో 43 శాతం మట్టివేనని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కలు తేల్చింది. ఈసారి ఆ సంఖ్య 55 శాతాన్ని దాటుతుందని అంచనా. ప్రజల్లో అవగాహన మెరుగుపడిందన్న స్పష్టమైన సంకేతాలున్నాయని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ చెప్పారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవగాహన పెరిగిందన్నారు. ఎకోఫ్రెండ్లీ గణపతి ఐడియాలు కొన్ని.. చెరకు గణపతి... తమిళనాడులో 20 మంది కార్మికులు రెండు టన్నుల చెరకుతో భారీ గణపతిని తయారుచేశారు. ఆ తరువాత నిమజ్జనానికి బదులు ఆ చెరకుగడలను తీసి, భక్తులందరికీ పంచిపెట్టడంతో ఇప్పుడు చాలా చోట్ల చెరకు గణపతులు వెలుస్తున్నారు. తద్వారా వేస్టేజ్ ఉండదు, భక్తులకు ఉపయోగకరంగానూ ఉంటుంది. గోబర్ గణేషుడు... హిందువులు ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యికీ, పేడకూ అంతే పవిత్రత ఉంది. పేడ నీటిలో త్వరగా కరిగిపోతుంది. అందుకే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆవుపేడని కలిపి వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలుతో పాటు పవిత్రతకి పవిత్రతా చేకూరుతుంది. చేప మిత్రుడిగా... నిమజ్జనం చేసే నీటిలో ఉన్న చేపలకి ప్రమాదకరంగా మారకుండా ఉండడమే కాకుండా ఫిష్ ఫ్రెండ్లీ గణపతులను ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ ఎన్జీవో తయారుచేస్తోంది. ఆనంద్ పెంధార్కర్ అనే పర్యావరణ వేత్త ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుల తయారీని పరిచయం చేశారు. ఇలాంటి గణపతి విగ్రహాలు చేపలకు హానిచేయకపోవడమే కాదు, చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే చేపలు తినే పదార్థాలతోనే ఈ గణేషులను తయారుచేస్తారన్నమాట. తీపి గణపతి... వినాయకచవితికి కొంత మధురంగా మలచాలనుకున్న ముంబైకి చెందిన రింటూ రాథోడ్ 50 కేజీల చాక్లెట్ గణేషుడిని తయారు చేసింది. దీన్ని నీటిలో నిమజ్జనం చేయకుండా ఆ చాక్లెట్‌నంతా తీసి పిల్లల నోళ్లు తీపిచేశారు. అంతేనా పాలల్లో నిమజ్జనం చేసి మిల్క్‌షేక్‌ని భక్తులకు పంపిణీ చేశారు. గణపతిని విత్తుకోండిలా... ముంబైకి చెందిన దత్తాద్రి కొత్తూర్ ఓ సరికొత్త గణపతిని తయారుచేశారు. విత్తగణపతి అన్నమాట. అన్ని గణపతి విగ్రహాల్లా దీన్ని నీటిలో ముంచక్కర్లేదు. కుండీలో పెట్టుకుని కొద్దిగా నీరు పోస్తుంటే చాలు పండుగ రోజులు పూర్తయ్యేనాటికి మీ యింట్లో మీకు నచ్చిన కూరగాయ మొక్కల్ని ప్రసాదించేస్తాడు ఎకోఫ్రెండ్లీ వినాయకుడు. విత్తనాలేవైనా మీ యిష్టం, ధనియాలో, బెండకాయ, తులసి విత్తనాలో ఏవైనా మీకు కావాల్సిన విత్తనాలను మట్టితో కలిపి గణేషుడిని తయారుచేయడమే. తలా ఓ చేయి... పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు,ప్రభుత్వ విభాగాల అధికారులు ఈసారి మట్టి విగ్రహాలపై ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రసార మాధ్యమాలు కూడా తోడవడంతో జనంలో మార్పు కనిపిస్తోంది. - మట్టి విగ్రహాలపై దేవాలయాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. - గతేడాది 40 వేల మట్టి విగ్రహాలను రూపొందించి ఉచితంగా అందజేసిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఈ సారి ఆ సంఖ్యను 60 వేలకు పెంచింది. - వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నీటి వనరులకు చెడుపు చేయకుండా సహజ రంగులతో విగ్రహాలు తయారు చేశారు. - నగరంతోపాటు జిల్లాల్లో ఉన్న కొన్ని కుమ్మరి సంఘాలు కూడా మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. - కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, భక్త మండళ్లు, మహిళా మండళ్లు కూడా మట్టి విగ్రహాలకే జైకొట్టాయి. -
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం మళ్లీ టెండర్లు
-
హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆదివారం 'హైదరాబాద్ 10కే రన్' జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వాహన చోదకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని సహకరించాలని కోరారు. - రాజ్‌భవన్, ఆనంద్‌నగర్, పంజగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ స్టాట్యూ(ఖైరతాబాద్ చౌరస్తా) నుంచి నిరంకారి వైపు పంపిస్తారు. - మింట్ కాంపౌండ్, ఐ-మాక్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు పంపిస్తారు. - ఇక్బాల్ మీనార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను తెలుగు తల్లి చౌరస్తా, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెక్రటేరియేట్ పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా, బైబిల్ హౌస్ మీదుగా మళ్ళిస్తారు. - హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించకుండా తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. - లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని జీహెచ్ఎంసీ ఆఫీస్, ఐటీ లైన్, హిమాయత్‌నగర్‌ల వైపు పంపిస్తారు. - డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చిల్డ్రన్స్ పార్క్, అప్పర్‌ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. వీటిని కట్ట మైసమ్మ దేవాలయం, కవాడీగూడ మీదుగా మళ్ళిస్తారు. - రసూల్‌పుర నుంచి నల్లగుట్ట రైల్ అండర్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. -
భర్త తిట్టాడని.. సాగర్‌లో దూకేందుకు యత్నం!
రాంగోపాల్‌పేట్: భర్త తిట్టాడని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట్‌కు చెందిన శుభకర్, కుంట భాగ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ విషయంలో ఇటీవల ఆవేశంలో భర్త ఆమెను దూషించాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురై చనిపోవాలని నిశ్చయించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తున్న ఆమెను గుర్తించిన లేక్ పోలీసులు రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ కోసం అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు భర్తతో పాటు పంపించారు. -
వైభవంగా వినాయక నిమజ్జనం
హైదరాబాద్: జంట నగరాల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు 25 చెరువుల్లో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. తొమ్మిది ప్రధాన మార్గాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన యాత్ర ప్రారంభంకానుంది. వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు.