‘సాగర్‌’ చుట్టూ స్కైవాక్‌ వే | CM Revanth Reddy Decided Skywalk Way at Hussainsagar | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’ చుట్టూ స్కైవాక్‌ వే

Published Sun, Sep 1 2024 4:19 AM | Last Updated on Sun, Sep 1 2024 4:19 AM

CM Revanth Reddy Decided Skywalk Way at Hussainsagar

ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రహదారి 4 వరుసలుగా విస్తరణ 

రాష్ట్రంలోని బౌద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్‌ 

నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం 

గోల్కొండ చుట్టూ ఉన్న రహదారుల విస్తరణకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌ చుట్టూ టూరి­జం డెస్టినేషన్‌సర్కిల్‌గా అభివృద్ధి చేయా­లని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడ స్కైవాక్‌ వే నిర్మించాలని.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకొస్తున్న నేపథ్యంలో ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్‌ బౌద్ధ క్షేత్రాలతోపా­టు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని కలిపి ఒక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్‌ రిజర్వా­యర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజి­యం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.  
 
పర్యాటక కేంద్రంగా బుద్ధవనం..: కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్‌ 2.0 పథకంలో భాగంగా బుద్ధవనం అభివృ­ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్‌ డిజిటల్‌ మ్యూజియం అండ్‌ ఎగ్జిబిషన్, డిజిటల్‌ ఆరై్కవ్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితోపాటు తాజాగా అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో చేర్చింది. 

అందలో భాగంగా నాగార్జునసాగర్‌ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జునసాగర్‌సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్‌ వాటర్‌ వరకు బోట్‌లో విహారించే సదుపాయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పర్యాటకులు వెళ్లి రావడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. 

గోల్కొండ చుట్టూ రహదారుల విస్తరణ... 
గోల్కొండ కోట చుట్టూ ఉన్న రహదారులు ఇరుకుగా ఉన్నాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇళ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  

వలయాకారంలో డిజైన్‌ 
హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్‌ వే డిజైన్‌ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక హబ్‌గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనాలను తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్‌కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement