Sky Walk Way
-
‘సాగర్’ చుట్టూ స్కైవాక్ వే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ చుట్టూ టూరిజం డెస్టినేషన్సర్కిల్గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడ స్కైవాక్ వే నిర్మించాలని.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకొస్తున్న నేపథ్యంలో ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని కలిపి ఒక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక కేంద్రంగా బుద్ధవనం..: కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆరై్కవ్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితోపాటు తాజాగా అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో చేర్చింది. అందలో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. నాగార్జునసాగర్ డ్యామ్అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జునసాగర్సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్లో విహారించే సదుపాయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యాటకులు వెళ్లి రావడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్కొండ చుట్టూ రహదారుల విస్తరణ... గోల్కొండ కోట చుట్టూ ఉన్న రహదారులు ఇరుకుగా ఉన్నాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇళ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వలయాకారంలో డిజైన్ హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్ వే డిజైన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక హబ్‌గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనాలను తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్‌కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
ఉప్పల్ స్కైవాక్‌ను ప్రారంభించిన కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు గుడ్‌న్యూస్. ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కాగా, కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్ఎండీఏ దీన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఉప్పల్ చౌరస్తాలో 665 మీటర్ల మేర రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను హెచ్ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్లను ఏర్పాటు చేశారు. Witness the magnificent Uppal Skywalk, a true jewel of urban connectivity! Thanks to the visionary leadership of CM Sri KCR and guidance of Municipal Administration and Urban Development Minister Sri @KTRBRS, infrastructure in Hyderabad has undergone a phenomenal transformation.… pic.twitter.com/K0FQ2PiRCn — BRS Party (@BRSparty) June 25, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలు బిజీ.. రాహుల్ సమక్షంలో భారీగా చేరికలు -
నేలమట్టం కానున్న దేశంలోనే మొదటి స్కై వాక్
సాక్షి, ముంబై: దేశంలోనే మొదటి స్కై వాక్‌గా గుర్తింపు పొందిన తూర్పు బాంద్రాలోని స్కై వాక్‌ను త్వరలో బీఎంసీ నేలమట్టం చేయనుంది. ఈ స్కైవాక్ ప్రమాదకరంగా మారడంతో దీన్ని తొలగించి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావించింది. ఈ పనులకు బీఎంసీ పరిపాలన విభాగం రూ.18.69 కోట్లు ఖర్చు చేయనుంది. రైలు దిగిన ప్రయాణికులు తోపులాటలు లేకుండా సులభంగా ప్రధాన రహదారిపైకి చేరుకునేందుకు 2007లో ఎంఎంఆర్డీయే స్కై వాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఆ మేరకు దేశంలోనే మొదటి స్కైవాక్‌ను బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి కళానగర్ వరకు నిర్మించింది. ప్రారంభంలో పాదచారులందరూ దీన్ని వినియోగించేవారు. 2015లో ఎంఎంఆర్డీయే ఈ స్కైవాక్‌ను బీఎంసీకి అప్పగించింది. కాల క్రమేనా బిచ్చగాళ్లు, మాదక ద్రవ్యాల బానిసలు, తాగుబోతులు, జూదగాళ్లు దానిపై తిష్టవేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ స్కైవాక్పై పాదచారులకు ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మెల్లమెల్లగా దీని వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తరువాత బీఎంసీ ఈ స్కైవాక్‌ను బీజేటీఐ సంస్ధ ద్వారా తనఖీ చేయించగా ప్రమాద కరంగా ఉందని తేల్చిచెప్పింది. దీంతో 2019 నుం చి ఈ స్కైవాక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేసి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావిస్తోంది. దీనికోసం రూ.16.20 కోట్లతో కూడిన టెండర్లను ఆహ్వానించింది. అందు లో ఎన్ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ 15 శాతం తక్కువ ధరకు అంటే రూ.14.25 కోట్లతో పని చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో వివిధ పన్నులతోసహా రూ.18.69 కోట్లు ఖర్చుకానున్నాయి. స్కైవాక్‌పైకి ఎక్కడానికి ఇదివరకు మెట్లు ఉండేవి. కానీ కొత్తగా నిర్మించనున్న ఈ స్కైవాక్ పైకి చేరుకోవడానికి మెట్లకు బదులుగా ఎస్కలేటర్‌ను నిర్మించను న్నారు. చట్టపరంగా అనుమతులన్నీ లభించగానే 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనుంది. -
ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు ఇక తీరనున్నాయి. హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రోస్టేషన్‌కు అనుసంధానంచేస్తూ రూ.100 కోట్ల వ్యయంతో రహేజాగ్రూపు సంస్థ మైండ్ స్పేస్‌లో నిర్మిస్తోన్న ‘స్కై వాక్ వే’పనులు శరవేగంగా సాగుతున్నాయి. నగరానికే ఐకాన్‌గా నిలవనున్న ఈ ‘స్కై వాక్ వే’ను మెట్రోస్టేషన్ నుంచి 1.2 కిలోమీటర్ల వరకు చేపడుతున్నారు. స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ ప్రధాన ద్వారం వెంట నేరుగా మొదటి జంక్షన్లో స్కై సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. అటు నుంచి స్కై వాక్ వేను కొనసాగిస్తూ వెస్టిన్ హోటల్ సమీపంలో ఉన్న మరో జంక్షన్లో ‘స్కై వాక్ వే’సర్కిల్‌ను నెలకొల్పారు. నడుచుకుంటూ ఆయా టవర్ల వద్దకు వెళ్లే విధంగా ఎగ్జిట్ ఇస్తున్నారు. రాత్రి సమయంలోనూ వెళ్లేందుకు లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఐటీ ఉద్యోగులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ‘స్కై వాక్’చేస్తూ పనిచేసే టవర్లకు నేరుగా వెళ్లవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ ‘స్కై వాక్ వే’అందుబాటులోకి రానుంది. ఒకేచోట అన్నీ.. రహేజా గ్రూపునకు మాదాపూర్‌లో 110 ఎకరాల స్థలాన్ని 2004 అప్పటి ఏపీఐఐసీ కేటాయించింది. రహేజా గ్రూపు మొదటిసారిగా నగరంలో మైండ్ స్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్‌ను నెలకొల్పింది. ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటింగ్ క్యాంపస్‌గా గుర్తింపు పొందింది. రెయిన్ వాటర్ సిస్టమ్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సోలార్ ప్యానెల్స్ మెయింటెనెన్స్, నాలుగు ఎకరాల రిజర్వ్ గ్రీన్ ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, టెన్నిస్ కోర్టు, 3,500 చెట్లు రహేజా మైండ్ స్పేస్ ఆవరణలో ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఆకాశ వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : నగరవాసుల ప్రయాణాన్ని సురక్షితం చేయడంతో పాటు పాదచారుల నడక సాఫీగా సాగేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే..మరోవైపు అక్కడి కొద్ది ఖాళీ స్థలంలోనే బస్సుల రాకపోకలకు బస్టాండ్లు నిరి్మంచడంతో పాటు అక్కడే ప్రయాణికులు షాపింగ్ చేసేందుకు వాణిజ్య భవనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద స్కైవాక్ (బోర్డు వాక్)లను నిరి్మంచే దిశగా కార్యచరణ రూపొందించింది. రూ.59.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంత రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాల్లో... వాహనాల సంచారం, జనాల రద్దీ కారణంగా రోడ్డు క్రాస్ దాటే సమయంలో పాదచారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు. దీన్ని నివారించేందుకు స్కైవాక్‌లు నిరి్మంచాలని నిర్ణయించారు. తొలుత మెహిదీపట్నం, ఉప్పల్ జంక్షన్లను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్కైవాక్‌లు నిర్మించే ఆలోచన చేస్తున్నారు. మెహిదీపట్నం ప్రాజెక్టు రూపురేఖలిలా... గుడి మల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్ వరకు ఈ స్కైవాక్ (బోర్డు వాక్) నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఫ్లైఓవర్ పైనుంచి అటు, ఇటు బస్టాండ్లను కలుపుతూ ఓ ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్లు సిద్ధం చేశారు. 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పు ఉంటుంది. 16 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. రైతుబజార్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్ వరకు మరో స్కైవాక్‌ను కూడా అనుసంధానం చేస్తారు. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి ఉండే స్కైవాక్‌కు కలుపుతారు. దీంతో గుడి మల్కాపూర్ నుంచి వచి్చన జనాలు, ఇటు రైతు బజార్, ఆసిఫ్‌నగర్ నుంచి వచి్చన జనాలు అదే స్కైవే మీది నుంచి వెళతారు. బోర్డువాక్ వైపు నిలువు కనెక్టివిటీని ఒక గాజు ఎన్‌క్లోజర్ (మాడ్యూల్స్) ద్వారా ప్రవేశపెడతారు. ఇందులో మెట్లు, లిఫ్ట్‌లు ఉంటాయి. ఇరువైపులా ఎత్తు 2.5 మీటర్ల స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుచేస్తారు. 12 మి.మీ మందపాటి పటిష్టమైన గ్లాస్ పేట్లను స్పష్టమైన దృష్టి కోసం ఏర్పాటుచేయనున్నారు. రైతు బజార్ పక్కన ఉన్న 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్లో బస్ బే ఉండే విధంగా, పై అంతస్తులో వాణిజ్య సముదాయం నిరి్మంచనున్నారు. ప్రయాణికుల షాపింగ్‌కు ఇది వేదిక కానుంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.34.28 కోట్లు ఉప్పల్ జంక్షన్లో ఇలా... ఉప్పల్ జంక్షన్లో నాలుగు వైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, స్టెయిర్కేసులు ఆరు ప్రాంతాల వద్ద ఏర్పాటుచేస్తారు. వీటికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పుతో వాక్‌వేను నిరి్మంచనున్నారు. దుకాణాలు, కియోస్‌్కలు కూడా ఏర్పాటుచేస్తారు. అలాగే ఉప్పల్ జంక్షన్‌లోని మెట్రో స్టేషన్ మొదటి లెవల్ (ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే అంతస్తు)కు అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు వరంగల్ బస్సులు ఆగే ప్రాంతం వద్ద ఎస్కలేటర్లు ఎక్కిన వ్యక్తి వాక్‌వే మీదుగా నేరుగా మెట్రో స్టేషన్లోకి వెళ్లవచ్చు. అలాగే రామాంతపూర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న లిఫ్ట్‌ల నుంచి పైకి ఎక్కిన వ్యక్తి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. లేదంటే ఉప్పల్వైపు నడుచుకుంటూ రావొచ్చు. ప్రాజెక్టు అంచనా వ్యయం–రూ.25.39 కోట్లు. -
ట్రిపుల్ ఐటీ జంక్షన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి
గచ్చిబౌలి: ట్రాఫిక్ రద్దీ ఉన్న జంక్షన్లలో పాదాచారుల కోసం స్కై వాక్‌లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఐటీ కారిడార్‌లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్, మియాపూర్ చౌరస్తాలో రెండుచోట్ల స్కైవాక్‌ల ఏర్పాటు చేయాలనిప్రతిపాదించారు. ట్రాఫిక్ రద్దీ వేళల్లో పాదచారులు రోడ్డు దాటాలంటే నగరంలో కత్తి మీద సామేనని చెప్పాలి. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అందుబాటులోకి వస్తే జంక్షన్లలో రోడ్డు దాటడం సులువవుతుంది. తొలుత స్కైవాక్ ఏర్పాటుకు అధికారులు ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను ఎంపిక చేశారు. దీంతో పాటు మియాపూర్ చౌరస్తాలోను స్కైవాక్ ఏర్పాటు చేస్తామని వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్లో నరకమే గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళ కంపెనీలకు వెళ్లేందుకు మెహిదీపట్నం, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి వైపు నుంచి వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇటు వస్తుంటారు. నానక్రంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డీఎల్ఎఫ్కు వెళ్లేందుకు బస్సులు, ఆటోల్లో వచ్చే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లోనే దిగుతారు. వీరంతా ఇక్కడ రోడ్డు దాటాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కొనినసార్లు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో ఇళ్లకు వెళ్లే క్రమంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. స్కైవాక్ అందుబాటులోకి వస్తే పాదాచారులకు రోడ్డు దాటడం సులువవుతుంది. ఏ రోడ్డులో చేరుకున్నా స్కైవే ద్వారా రోడ్డు దాటే వీలుంటుంది. 14 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఐటీ కారిడార్‌లోని ఎంపిక చేసిన 14 రద్దీ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించనున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్, సైబరాబాద్ కమిషనరేట్‌తో పాటు మరో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇవిగాక అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు హరిచందన తెలిపారు. -
హైటెక్ సిటీలో స్కైవాక్ షురూ
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎల్అండ్టీ నెక్టŠస్ గలేరియా మాల్‌ను అనుసంధానిస్తూ నిర్మించిన స్కైవాక్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. స్టేషన్లో దిగిన ప్రయాణికులు నేరుగా గలేరియా మాల్‌కు వెళ్లి షాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యల బారిన పడకుండా నేరుగా షాపింగ్‌కు వెళ్లే వారికి ఇదో సదవకాశమని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ఇప్పటికే పంజగుట్ట మెట్రోస్టేషన్ వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా ఎల్అండ్టీ సంస్థ నగరంలో పలు చోట్ల మాల్స్ నిర్మించడంతో పాటు వాటిని స్టేషన్లకు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలను గ్రేటర్ సిటీజన్లకు పరిచయం చేశామన్నారు. -
ఆ వంతెన పరీక్ష ఫెయిలైతే..ప్రాణాలు గాల్లోనే!
-
పరీక్ష ఫెయిలై బద్ధలయిందో..
బీజింగ్ : గాజు వంతెనలు అనగానే టక్కున గుర్తొచ్చేది చైనా.. పెద్దపెద్ద గాజు పలకలతో కొండల అంచున వంతెనలు నిర్మించడంలో, స్కైవాక్స్ ఏర్పాటుచేయడంలో ఇప్పటికే ఆ దేశం గుర్తింపు పొందింది. దాదాపు మిలియన్ల కొద్ది డబ్బును వీటిని నిర్మించేందుకు చైనా ఉపయోగిస్తుంది. ఇటీవలె చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన చైనా ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. అయితే, 600మీటర్ల ఎత్తున్న ఆ వంతెన ప్రారంభానికి ముందు కార్మికులు గాజు పలకలకు తుది పరీక్షలు పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఛాయా చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారు పెద్ద పెద్ద సుత్తెలను, గాజును పగల కొట్టే వస్తువులను తీసుకొని తమ శక్తిమేరకు వాటిని బలంగా మోదుతున్నారు. బాగా సుత్తెతో కొట్టిన తర్వాత వాటిపై గెంతులు పెడుతూ ఎగిరి దూకుతూ వాటిని పరీక్షిస్తున్నారు. సాధారణంగా వీటిపై నడవడమే కొంత భయానకంగా అనిపిస్తుంటుంది. అలాంటిది అంత ఎత్తుమీద ఉన్న గాజు పలకలపై నిల్చొని వాటినే పగులకొట్టే ప్రయత్నం చేయడానికి ఎంత సాహసం చేయాలో కదా మరీ! -
సికింద్రాబాద్ స్టేషన్‌కు ఆకాశ మార్గం!
► ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు ► పాత గాంధీ ఆస్పత్రి నుంచి స్కైవాక్ వే ► పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు కూడా.. ► చిలకలగూడ వద్ద ఆర్టీసీ టర్మినల్ త్వరలో కార్యాచరణ సిటీబ్యూరో: నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల గురించి చెప్పాలంటే మొదట గుర్తుకు వచ్చేది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతమే. నలువైపులా వచ్చిపోయే సీటీబస్సులు.. మధ్యలో దూసుకుపోయే ఆటోలు, ప్రైవేటు వాహనాలు.. ఈ పద్మవ్యూహాన్ని దాటుకుని రైలు బండిని అందుకోవాలంటే ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలకు ఇక చెక్ పెట్టేందుకు ఈ ప్రాంతంలో ఆకాశ మార్గాలను(స్కైవాక్ వే) అందుబాటులోకి తేనున్నారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా స్కైవాక్వేలను ఏర్పాటు చేసేందుకు, అలాగే రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నగరంలో ప్రధాన రైల్వేస్టేషన్ అయిన సికింద్రాబాద్ నుంచి రోజూ సుమారు 2.5 లక్షల మంది, పండగలు, సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో 3 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. మరో 10 లక్షల మంది నగర ప్రయాణికులు స్టేషన్ మీదుగా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని రైల్వే,ఆర్టీసీ, మెట్రో సదుపాయాలకు అనుగుణమైన బలమైన ప్రజా రవాణా వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సిటీ బస్సులు, వాహనాల రాకపోకలు, మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా అత్యంత రద్దీ ప్రాంతాలుగా మారిన సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఆఫ్జల్‌గంజ్, కోఠీ విమెన్స్ కాలేజ్, మెహదీపట్నం, బోరబండలలో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిం చింది. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. పాతగాంధీ నుంచి చిలకలగూడ వైపు నుంచి ఆకాశ మార్గాలు.... రద్దీ రహితమైన ప్రయాణ ప్రాంగణంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని వైపుల నుంచి ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కైవాక్వేలను ఏర్పాటు చేస్తారు. పాతగాంధీ ఆసుపత్రి వద్ద మెట్రో స్టేషన్‌ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. పైన మెట్రోస్టేషన్, కింద ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఉండేవిధంగా ఇక్కడ స్టేషన్ల నిర్మాణం చేపడతారు. దీంతో ఇటు సిటీ బస్సులకు, అటు మెట్రో రైలుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు నేరుగా రైల్వేస్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకొంటారు. మరోవైపు నిత్యం ప్రయాణికులు, వాహనాల రద్దీతో గజిబిజీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలను ట్రాఫిక్ ఫ్రీ జోన్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతున్న రాకపోకలను నిలిపివేస్తారు. దానికి ప్రత్యామ్నాయంగా కొత్తగాంధీ ఆసుపత్రి నుంచి బోయిగూడ వై జంక్షన్ మీదుగా బోయిగూడ బ్రిడ్జి నుంచి ఇటు రైల్వేస్టేషన్‌కు, అటు క్లాక్‌టవర్ వైపు వెళ్లేందుకు ఈ రోడ్డును విస్తరిస్తారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి వచ్చే వాహనాలు బోయిగూడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. స్టేషన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్,, ఉప్పల్, మల్కాజిగిరి వైపు నుంచి వచ్చే బస్సులన్నింటినీ ఒకే చోట నిలిపేందుకు వీలుగా చిలకలగూడ – బోయిగూడ మార్గంలో ఒక ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రైల్వే నుంచి స్థలాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణ ప్రాంగణం నుంచి రైల్వేస్టేషన్ పదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు నేరుగా చేరుకొనేందుకు మరో స్కైవాక్ వేను ఏర్పాటు చేస్తారు. సాఫీగా రాకపోకలు ... స్టేషన్‌కు అన్ని వైపులా వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో పాతగాంధీ నుంచి కొత్తగాంధీ వరకు ఉన్న మార్గాన్ని వెడల్పు చేయడం ద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లి, ఉప్పల్, తదితర మార్గాల నుంచి వచ్చే వాహనాలుగా సాఫీగా సాగిపోతాయి.ఆ తరువాత బోయిగూడ బ్రిడ్జిని ప్రస్తుతం ఆలుగడ్డ బావి వద్ద నిర్మించిన టన్నెల్ మార్గం తరహాలో అభివృద్ధి చేస్తారు. దీంతో బస్సులు, ఇతర రవాణా వాహనాల రాకపోకలకు కూడా మార్గం సుగమమవుతుంది.అల్వాల్, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, తదితర మార్గాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సులను పాతగాంధీ ఆసుపత్రిలో మెట్రో స్టేషన్ కింద నిర్మించతలపెట్టిన బస్టర్మినల్కు మళ్లిస్తారు. రూ. 150 కోట్లతో స్కైవాక్ వేలు ... ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కే కాకుండా నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లకు స్కైవాక్ వేలను ఏర్పాటు చేసేందుకు మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా ప్రతిపాదనలు రూపొందించారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి జేబీఎస్‌కు నేరుగా ఆకాశ మార్గంలో వెళ్తారు. అలాగే ఎంజీబీఎస్‌కు కూడా స్కైవాక్వే సదుపాయం ఉంటుంది.