ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ నమూనా
గచ్చిబౌలి: ట్రాఫిక్ రద్దీ ఉన్న జంక్షన్లలో పాదాచారుల కోసం స్కై వాక్‌లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఐటీ కారిడార్‌లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్, మియాపూర్ చౌరస్తాలో రెండుచోట్ల స్కైవాక్‌ల ఏర్పాటు చేయాలనిప్రతిపాదించారు. ట్రాఫిక్ రద్దీ వేళల్లో పాదచారులు రోడ్డు దాటాలంటే నగరంలో కత్తి మీద సామేనని చెప్పాలి. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అందుబాటులోకి వస్తే జంక్షన్లలో రోడ్డు దాటడం సులువవుతుంది. తొలుత స్కైవాక్ ఏర్పాటుకు అధికారులు ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను ఎంపిక చేశారు. దీంతో పాటు మియాపూర్ చౌరస్తాలోను స్కైవాక్ ఏర్పాటు చేస్తామని వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు.
ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో నరకమే
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళ కంపెనీలకు వెళ్లేందుకు మెహిదీపట్నం, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి వైపు నుంచి వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇటు వస్తుంటారు. నానక్‌రంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డీఎల్‌ఎఫ్‌కు వెళ్లేందుకు బస్సులు, ఆటోల్లో వచ్చే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లోనే దిగుతారు. వీరంతా ఇక్కడ రోడ్డు దాటాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కొనినసార్లు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో ఇళ్లకు వెళ్లే క్రమంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. స్కైవాక్ అందుబాటులోకి వస్తే పాదాచారులకు రోడ్డు దాటడం సులువవుతుంది. ఏ రోడ్డులో చేరుకున్నా స్కైవే ద్వారా రోడ్డు దాటే వీలుంటుంది.
14 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
ఐటీ కారిడార్‌లోని ఎంపిక చేసిన 14 రద్దీ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించనున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్, సైబరాబాద్ కమిషనరేట్‌తో పాటు మరో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇవిగాక అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు హరిచందన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment