సాక్షి, ముంబై: దేశంలోనే మొదటి స్కై వాక్‌గా గుర్తింపు పొందిన తూర్పు బాంద్రాలోని స్కై వాక్‌ను త్వరలో బీఎంసీ నేలమట్టం చేయనుంది. ఈ స్కైవాక్ ప్రమాదకరంగా మారడంతో దీన్ని తొలగించి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావించింది. ఈ పనులకు బీఎంసీ పరిపాలన విభాగం రూ.18.69 కోట్లు ఖర్చు చేయనుంది. రైలు దిగిన ప్రయాణికులు తోపులాటలు లేకుండా సులభంగా ప్రధాన రహదారిపైకి చేరుకునేందుకు 2007లో ఎంఎంఆర్డీయే స్కై వాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఆ మేరకు దేశంలోనే మొదటి స్కైవాక్‌ను బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి కళానగర్ వరకు నిర్మించింది.
ప్రారంభంలో పాదచారులందరూ దీన్ని వినియోగించేవారు. 2015లో ఎంఎంఆర్డీయే ఈ స్కైవాక్‌ను బీఎంసీకి అప్పగించింది. కాల క్రమేనా బిచ్చగాళ్లు, మాదక ద్రవ్యాల బానిసలు, తాగుబోతులు, జూదగాళ్లు దానిపై తిష్టవేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ స్కైవాక్‌పై పాదచారులకు ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మెల్లమెల్లగా దీని వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తరువాత బీఎంసీ ఈ స్కైవాక్‌ను బీజేటీఐ సంస్ధ ద్వారా తనఖీ చేయించగా ప్రమాద కరంగా ఉందని తేల్చిచెప్పింది. దీంతో 2019 నుం చి ఈ స్కైవాక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేసి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావిస్తోంది.
దీనికోసం రూ.16.20 కోట్లతో కూడిన టెండర్లను ఆహ్వానించింది. అందు లో ఎన్‌ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ 15 శాతం తక్కువ ధరకు అంటే రూ.14.25 కోట్లతో పని చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో వివిధ పన్నులతోసహా రూ.18.69 కోట్లు ఖర్చుకానున్నాయి. స్కైవాక్‌పైకి ఎక్కడానికి ఇదివరకు మెట్లు ఉండేవి. కానీ కొత్తగా నిర్మించనున్న ఈ స్కైవాక్ పైకి చేరుకోవడానికి మెట్లకు బదులుగా ఎస్కలేటర్‌ను నిర్మించను న్నారు. చట్టపరంగా అనుమతులన్నీ లభించగానే 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment