సికింద్రాబాద్ స్టేషన్‌కు ఆకాశ మార్గం!
► ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు
► పాత గాంధీ ఆస్పత్రి నుంచి స్కైవాక్ వే
► పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు కూడా..
► చిలకలగూడ వద్ద ఆర్టీసీ టర్మినల్ త్వరలో కార్యాచరణ
సిటీబ్యూరో: నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల గురించి చెప్పాలంటే మొదట గుర్తుకు వచ్చేది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతమే. నలువైపులా వచ్చిపోయే సీటీబస్సులు.. మధ్యలో దూసుకుపోయే ఆటోలు, ప్రైవేటు వాహనాలు.. ఈ పద్మవ్యూహాన్ని దాటుకుని రైలు బండిని అందుకోవాలంటే ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలకు ఇక చెక్ పెట్టేందుకు ఈ ప్రాంతంలో ఆకాశ మార్గాలను(స్కైవాక్ వే) అందుబాటులోకి తేనున్నారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా స్కైవాక్‌వేలను ఏర్పాటు చేసేందుకు, అలాగే రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
నగరంలో ప్రధాన రైల్వేస్టేషన్ అయిన సికింద్రాబాద్ నుంచి రోజూ సుమారు 2.5 లక్షల మంది, పండగలు, సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో 3 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. మరో 10 లక్షల మంది నగర ప్రయాణికులు స్టేషన్ మీదుగా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని రైల్వే,ఆర్టీసీ, మెట్రో సదుపాయాలకు అనుగుణమైన బలమైన ప్రజా రవాణా వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సిటీ బస్సులు, వాహనాల రాకపోకలు, మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా అత్యంత రద్దీ ప్రాంతాలుగా మారిన సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఆఫ్జల్‌గంజ్, కోఠీ విమెన్స్ కాలేజ్, మెహదీపట్నం, బోరబండలలో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిం చింది. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది.
పాతగాంధీ నుంచి చిలకలగూడ వైపు నుంచి ఆకాశ మార్గాలు....
రద్దీ రహితమైన ప్రయాణ ప్రాంగణంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని వైపుల నుంచి ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కైవాక్‌వేలను ఏర్పాటు చేస్తారు. పాతగాంధీ ఆసుపత్రి వద్ద మెట్రో స్టేషన్‌ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. పైన మెట్రోస్టేషన్, కింద ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఉండేవిధంగా ఇక్కడ స్టేషన్‌ల నిర్మాణం చేపడతారు. దీంతో ఇటు సిటీ బస్సులకు, అటు మెట్రో రైలుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు నేరుగా రైల్వేస్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకొంటారు.
మరోవైపు నిత్యం ప్రయాణికులు, వాహనాల రద్దీతో గజిబిజీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలను ట్రాఫిక్ ఫ్రీ జోన్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతున్న రాకపోకలను నిలిపివేస్తారు. దానికి ప్రత్యామ్నాయంగా కొత్తగాంధీ ఆసుపత్రి నుంచి బోయిగూడ వై జంక్షన్ మీదుగా బోయిగూడ బ్రిడ్జి నుంచి ఇటు రైల్వేస్టేషన్‌కు, అటు క్లాక్‌టవర్ వైపు వెళ్లేందుకు ఈ రోడ్డును విస్తరిస్తారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి వచ్చే వాహనాలు బోయిగూడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
స్టేషన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్,, ఉప్పల్, మల్కాజిగిరి వైపు నుంచి వచ్చే బస్సులన్నింటినీ ఒకే చోట నిలిపేందుకు వీలుగా చిలకలగూడ – బోయిగూడ మార్గంలో ఒక ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రైల్వే నుంచి స్థలాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణ ప్రాంగణం నుంచి రైల్వేస్టేషన్ పదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు నేరుగా చేరుకొనేందుకు మరో స్కైవాక్ వేను ఏర్పాటు చేస్తారు.
సాఫీగా రాకపోకలు ...
స్టేషన్‌కు అన్ని వైపులా వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో పాతగాంధీ నుంచి కొత్తగాంధీ వరకు ఉన్న మార్గాన్ని వెడల్పు చేయడం ద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లి, ఉప్పల్, తదితర మార్గాల నుంచి వచ్చే వాహనాలుగా సాఫీగా సాగిపోతాయి.ఆ తరువాత బోయిగూడ బ్రిడ్జిని ప్రస్తుతం ఆలుగడ్డ బావి వద్ద నిర్మించిన టన్నెల్ మార్గం తరహాలో అభివృద్ధి చేస్తారు.
దీంతో బస్సులు, ఇతర రవాణా వాహనాల రాకపోకలకు కూడా మార్గం సుగమమవుతుంది.అల్వాల్, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, తదితర మార్గాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సులను పాతగాంధీ ఆసుపత్రిలో మెట్రో స్టేషన్ కింద నిర్మించతలపెట్టిన బస్‌టర్మినల్‌కు మళ్లిస్తారు. రూ. 150 కోట్లతో స్కైవాక్ వేలు ... ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కే కాకుండా నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లు, మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లకు స్కైవాక్ వేలను ఏర్పాటు చేసేందుకు మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా ప్రతిపాదనలు రూపొందించారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి జేబీఎస్‌కు నేరుగా ఆకాశ మార్గంలో వెళ్తారు. అలాగే ఎంజీబీఎస్‌కు కూడా స్కైవాక్‌వే సదుపాయం ఉంటుంది.