హైదరాబాద్‌కు వెలుపల ఏర్పాటు చేయాలి
అనంత్ అంబానీలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహా్వనించాలి
‘స్పీడ్’పై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్‌లో ఉంచాలని చెప్పారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..
అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్‌నెస్‌సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు.
బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి
యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు.
పర్యాటకంపై వేర్వేరు పాలసీలు
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు.
కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో..
హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు.
హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి
హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్‌లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి
వేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment